పీఎం ఆఫీస్‌ డిప్యూటీ సెక్రటరీగా ఆమ్రపాలి

హైదరాబాద్: తెలుగు ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి  ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ (పీఎంవో)లో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. అతి చిన్న వయసులోనే ఈ పోస్టులో నియమితులైన అతికొద్ది మందిలో ఒకరిగా ఆమె నిలిచారు. ఈ పోస్టులో ఆమె మూడేళ్లు కొనసాగుతారని శనివారం డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ వెల్లడించింది. అలాగే పీఎంవో డైరెక్టర్ గా రఘురాజ్ రాజేంద్రన్, అండర్ సెక్రటరీగా మంగేశ్ ఘిడియాల్ నియమితులయ్యారని పేర్కొంది. ఆమ్రపాలి యూనియన్ కేబినెట్ సెక్రటేరియట్ లో డిప్యూటీ సెక్రటరీగా పని చేశారు. ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రికి ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నారు. ఆమ్రపాలి 1982, నవంబరు 4న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కాట వెంకట్ రెడ్డి, పద్మావతి దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి రిటైర్డ్ ప్రొఫెసర్. 2010 బ్యాచ్ ఏపీ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమె 2011 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ సమీర్ శర్మను వివాహం చేసుకున్నారు. ఆమ్రపాలి తెలంగాణలో వివిధ హోదాల్లో పనిచేశారు. వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా, జీహెచ్ఎంసీ, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్లోనూ పనిచేశారు.

Latest Updates