30 లక్షల అంబులెన్సు… నెల రోజులకే మూలనపడింది

తొలిరోజునే పరేషాన్​ చేసింది

రిపేర్ ​చేసిన టెక్నీషియన్​

మళ్లీ అదే సమస్య రిపీట్​

పట్టించుకోకుండా వదిలేసిన వైద్యాధికారులు

భద్రాచలం ఏరియా దవాఖానాలో రోగుల కష్టాలు

భద్రాచలం, వెలుగు : నాలుగు రాష్ట్రాల సరిహద్దున ఉన్న  భద్రాచలం ఏరియా దవాఖానాలో లక్షలు పెట్టి కొన్న అంబులెన్స్​ మూలకు పడ్డది. ఇక్కడకు నిరుపేద గిరిజనులు వైద్యం కోసం వస్తుంటారు. వారిని అత్యవసరంగా హైదరాబాదు, విజయవాడ వంటి మెగాసిటీలకు ట్రీట్​మెంట్​కోసం తీసుకెళ్లాలంటే ఎమర్జెన్సీ అంబులెన్స్ తప్పనిసరి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్‍ డాక్టర్​ఎంవీ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‍ కుమార్​చొరవతో నెల కిందట కార్పొరేట్​సోషల్​రెస్పాన్సిబిలిటీ కింద భద్రాచలం ఏరియా దవాఖానాకు ఎమర్జెన్సీ అంబులెన్స్ కేటాయించారు.

మొదటిరోజే మొరాయించింది

అంబులెన్స్​వచ్చిన మొదటి రోజే మొరాయించింది. నెల కిందట ఓ పేషెంట్​ను తీసుకువెళ్తుండగా రెండు , మూడు కిలోమీటర్లు వెళ్లి ఆగిపోయింది. తర్వాత ఆ పేషెంట్​ను వేరే అంబులెన్స్​లో పంపించాల్సి వచ్చింది. తర్వాత ఏరియా దవాఖానాకు తీసుకువచ్చి పడేశారు.  ఇక అప్పటినుంచి మళ్లీ ప్రైవేట్​ అంబులెన్స్​లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎన్ని ఫెసిలిటీస్​ ఉండీ ఏం లాభం

ఎమర్జెన్సీ రోగుల కోసం కేటాయించిన ఈ అంబులెన్స్​లో వెంటిలేటర్​ఫెసిలిటీతో పాటు సెంట్రల్​ ఆక్సిజన్​సిస్టమ్​ అందుబాటులో ఉంటుంది. పేషెంట్​ఉన్న ఆరోగ్య స్థితి మారకుండా తీసుకెళ్లడానికి ఈ అంబులెన్స్  ఉపయోగపడుతుంది. దీని విలువ దాదాపు రూ.30లక్షల వరకు ఉంటుంది. మొదటిసారి పాడైపోయిన తర్వాత  హైదరాబాద్​ నుంచి వచ్చిన టెక్నీషియన్ రిపేర్​ చేసి అంతా ఓకే అని చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత స్టార్ట్​ చేస్తే మళ్లీ అదే సమస్య రిపీటైంది. టెక్నీషియన్​కు ఫోన్​ చేయగా ఎలక్ట్రికల్​ సిస్టం పాడైపోయిందని, హైదరాబాదుకు తీసుకురావాలని సూచించాడు. దీంతో ఎవరూ పట్టించుకోకుండా అలాగే మూలకు పడేశారు.

ఎలక్ట్రికల్ సిస్టమ్​ దెబ్బతింది

ఎమర్జెన్సీ అంబులెన్స్ ఎలక్ట్రికల్‍ సిస్టమ్​దెబ్బతిన్నది. అందుకే పక్కకు పెట్టాం. కొత్త వెహికల్​ కావడంతో సంబంధిత కంపెనీకి సమాచారం అందించాం. వారు వచ్చి రిపేర్‍చేస్తారు. ఆ తర్వాత ఉపయోగిస్తాం. -డా.యుగంధర్‍, సూపరింటెండెంట్‍, ఏరియా దవాఖాన, భద్రాచలం.

రిపేర్‍ చేయించాలి

పేదలకు ఉపయోగపడే ఎమర్జెన్సీ అంబులెన్స్ విషయంలో ఏరియా దవాఖానా సూపరింటెండెంట్​నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాన్ని వెంటనే రిపేర్​ చేయించాలి. చిన్న చిన్న సమస్యలకు అంబులెన్స్ ను పక్కన బెట్టడం కరెక్ట్​ కాదు. ఈ విషయంలో కలెక్టర్​ దృష్టి పెట్టి బాగు చేయించి రోగులకు అందుబాటులోకి తేవాలి. -ఆకోజు సునీల్‍, సీపీఐ పట్టణ కార్యదర్శి

 

Latest Updates