వస్తడనుకోలె!

డ్యూటీ మీద సరిహద్దులు దాటిపోయిన సైనికుడు పది నెలల తర్వాత ఇంటికొస్తె ఎట్లుంటది? ఆ సైనికుడి భార్య కళ్ల నుంచి పొంగుతున్న ఆనందం భాష్పాలను దేనితో పొల్చగలం? ‘నాన్న వచ్చినవా?’అని ఎగిరి అతని మెడ చుట్టుకున్న ఆ పిల్లల సంతోషపు ఎత్తుని దేనితో కొలవగలం?

ఇరవై ఏడేళ్ల సైడ్నీ కూపర్‌‌‌‌కి ఇద్దరు పిల్లలు. ఒక మూడేళ్ల పిలగాడు, ఇంకో బుడ్డోడికి ఏడాది దాటింది. ‘మన ఇల్లు ఒక ఆడపిల్లతో కళకళలాడాలి’ అని ఆ భార్యాభర్తల కోరిక. అనకున్నట్టుగానే గతనెల 24 న పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది సైడ్నీ. ఇద్దరూ అమ్మాయిలే! కోరిక తీరింది.కానీ..  డెలివరీరోజు తన భర్త ఆమె పక్కనే లేడు..  ఆయన ఇంటి నుంచి వెళ్లి దాదాపు నెలలు అయింది. రాడని ఆమెకు కూడా తెలుసు….   అతనో సోల్జర్.

మంచీ చెడులు స్కైప్‌ లోనే..
ఆమె భర్త పేరు స్కైలర్‌‌‌‌ కూపర్ (28). అమెరికాలోని ‘కాన్సస్‌‌ నేషనల్ ఆర్మీ గార్డ్‌‌’లో సైనికుడిగా పని చేస్తున్నడు. పది నెలల కింద అర్జెంట్‌‌గా ఆర్మీ ఆదేశాలతో సైన్యంతో కలిసి కువైట్‌‌కు వెళ్లిండు. అతను వెళ్లగానే సైడ్నీ ప్రెగ్నెంట్‌‌అని తెలిసింది. సైనికుడిగా భార్య కదా? దేశ రక్షణ కోసం ఎన్నో త్యాగాలు చేయాలి! అందుకే గుండెకు సర్ది చెప్పుకుంది. తాను ప్రెగ్నెంట్‌‌ అన్న సంగతిని కూడా ‘స్కైప్‌ ’లోనే భర్తకు తెలిపింది. అతను చాలా ఆనందపడిండు.

పది నెలల తర్వాత..
అలా పది నెలలు గడిచింది. ‘ఈ రోజు డెలివరీ’అని చెప్పింది సైడ్నీ. కానీ రమ్మనలేదు. అలా అని.. అతను రాడని అనుకోలె… అలాగని వస్తాడని కూడా అనుకోలె. ఇంతలో.. పుట్టిన పిల్లలకు సుస్తీ చేసింది. ఐసీయూలో ఉంచారు డాక్టర్లు. పది రోజులైంది. రోజూ ఏడుస్తూనే ఉంది. ఆ రోజు ఫిబ్రవరి 5. ఆసుపత్రిలో ఆమె తన బిడ్డలకు పాలు ఇస్తోంది. అకస్మాత్తుగా ఆమె ముందుకొచ్చి నిలబడ్డాడు స్కైలర్‌‌‌‌.   ఆనందం తట్టుకోలేక కంటతడి పెట్టుకుంది సైడ్నీ. ఆమెను హగ్ చేసుకున్నడు స్కైలర్. ఆ చిన్నారులను చేతిలోకి తీసుకున్నడు. తర్వాత ఇంటికెళ్లినరు. డోర్ తెరవగానే వాళ్ల కుక్క స్కైలర్‌‌ను చూసింది. దానికి ఏం గుర్తుకొచ్చిందో ఏమో తోక ఊపి అతని మీదకు ఎగిరింది. చాలా సేపటికి తర్వాత అతన్ని విడిచిపెట్టింది. తర్వాత అతని కొడుకులు నాన్నని చూసి గంతులేశారు. వాళ్లని ఎత్తు కోగానే ‘నాన్నా’అంటూ మెడపట్టుకుని ముద్దాడారు. ఈ స్వీట్‌‌మూమెంట్స్‌‌ మూడు వీడియోలో రికార్డు అయ్యాయి.

‘గ్రేట్‌ సోల్జర్‌.. గ్రేట్‌ ఫ్యామిలీ’
ఆ వీడియోలనే ‘సైడ్నీ కూపర్‌‌‌‌ ఈజ్‌‌ విత్‌ స్కైలర్‌‌‌‌ కూపర్‌‌’ పేరుతో ఫేస్‌‌బుక్‌ లో షేర్ చేసింది సైడ్నీ.అంతేకాదు… ‘ఒంటరిగానే… వెయ్యి మైళ్లు… ప్రెగ్నెస్నీ..ఒంటరిగానే డెలివరీ.. 48,392 స్కైప్‌ కాల్స్‌‌.. కొంత మంది సూపర్‌‌‌‌ హీరోస్‌‌.. కొన్ని ప్లేన్‌‌ రైడ్స్‌‌.. 12రోజులు ఐసీయూలో..ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌‌ సహాయం.. ఎన్నో కన్నీళ్లు ఇలా ఎన్నెన్నోజరిగాయి ఈ ఒక్క ఏడాదిలో!…ఫైనల్‌‌గా ఓ సైనికుడు ఇంటికొచ్చిండు . అతనికి నేను ప్రామిస్‌‌ చేసిన’ అని పోస్ట్‌‌లో రాసుకొచ్చింది. ఆ పోస్టే ఇప్పుడు వైరల్‌‌ అయింది. ‘గ్రేట్‌‌ సోల్జర్‌‌‌‌… గ్రేట్‌‌ ఫ్యామిలీ’ అంటూ అమెరికన్‌‌ నెటిజన్లు దీనికి కామెంట్స్‌‌ పెడుతున్నరు.

Latest Updates