బాలుడి ప్రాణం తీసిన పతంగి 

  • కరెంటు వైర్లలో చిక్కుకోవడంతో తీసేందుకు ప్రయత్నం
  • షాక్ తగిలి మృతి 
  • మరొకరికి తీవ్రగాయాలు
  • వికారాబాద్ జిల్లా పరిగిలో విషాదం

పరిగి, వెలుగు: విద్యుత్​ వైర్లలో చిక్కుకున్న పతంగిని తీసేందుకు ప్రయత్నిస్తుండగా షాక్​ తగిలి ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాలుడికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం బాహర్​పేట్​లో షేక్ జావేద్ అలీ కొడుకు షేక్ జహీర్​(9), రఫి కొడుకు షమీర్(9)లు ఆదివారం స్కూలుకు సెలవు కావటంతో బంగ్లాపైకెక్కి ఆడుకుంటూ పతంగి ఎగరేశారు. అది కాస్తా ఇంటికి దగ్గర్లోంచి వెళ్తున్న హైటెన్షన్ కరెంటు వైర్లకు చిక్కుకుంది. దీంతో పతంగిని ఎలాగైనా తీయాలని, అక్కడే ఉన్న ఐరన్ పైప్ తో తేసేందుకు ప్రయత్నిస్తుండగా షాక్ కొట్టి బాలుడికి మంటలు అంటుకున్నాయి. జహీర్ ను లాగేందుకు షమీర్ ప్రయత్నించగా అతనికి కూడా మోచేతి వరకు మంటలంటుకున్నాయి. ఇది గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు వెంటనే పిల్లలిద్దర్నీ పరిగి దవాఖానకు తరలించారు. జీహీర్​ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. షమీర్​ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి సమాచారం సేకరించారు. చనిపోయిన జహీర్​ తండ్రి ఆర్టీసీలో డైవర్​గా పనిచేస్తున్నారు.

 

Latest Updates