వరదల్లో ఫ్యాషన్ ఫోటో షూట్

సామాన్య ప్రజల రోజూవారి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి వర్షాలు.  ఇల్లు దాటి అడుగు బయటపెట్టే పరిస్థితి లేదు. రోడ్లు, ఇల్లు, వాకిలి, ఆఫీసులన్నీ వరద నీళ్లతో నిండిపోయాయి. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే.. ఓ అమ్మాయి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె చేసిన పనేంటో చెప్తే.. ఇదేంది? అని ముక్కున వేలేసుకునేవాళ్లు కూడా ఉన్నారు. వారెవ్వా.. శెభాష్​ అని మెచ్చుకునేవాళ్లు కూడా ఉన్నారు. ఇంతకీ ఆమేం చేసిందని ఆలోచిస్తున్నారా? బిహార్ ​ వరదల్లో ఫ్యాషన్ ఫొటోషూట్​ చేసింది. పేరు అదితి సింగ్​.

మోకాళ్ల లోతు బురద నీళ్లు, ఆ నీళ్లలో అడుగు పెట్టాలంటే.. ఎక్కడ మ్యాన్​హోల్​ ఉందో.. ఎక్కడ నాలా ఉందో  తెలియని పరిస్థితి. దీనికి కారణాలు ఏవైనా కావొచ్చు. ఈ విషయం గురించి నిరసన తెలపాలంటే ఇప్పుడు అక్కడున్న పరిస్థితి సరైంది కాదు. అక్కడ నిరసన కంటే.. సాయం ముఖ్యం. కానీ.. భవిష్యత్తులో మరోసారి భారీ వర్షాలొస్తే.. ఈ పరిస్థితి మరోసారి తలెత్తే అవకాశం ఉంది. మరేం చేయాలి? నిరసన తెలపాల్సిందే.

తన నిరసనకు, తను చదువుతున్న కోర్సునే మార్గంగా ఎంచుకుంది. పాట్నాలోని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఫ్యాషన్​ టెక్నాలజీ ​ స్టూడెంట్​ అయిన అదితి సింగ్​ బిహార్​ వరదల పరిస్థితిని, అక్కడి ప్రజల ఇబ్బందులను అందరి దృష్టికి తీసుకురావాలని ఆలోచించింది. అందుకే.. మోకాళ్లలోతు బురద నీళ్లలో దిగి ఫ్యాషన్​ ఫొటోలు షూట్​ చేసింది. ఆ ఫొటోలను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది. ఆ ఫోటోలను చూసిన చాలామంది ఫాలోవర్లు, సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉండేవాళ్లు ‘చాలా స్టైల్​గా నీ నిరసన తెలిపావ్​.. శెభాష్.. ఫ్యాషన్​ స్టూడెంట్​ అనిపించుకున్నావ్​’ అంటున్నారు. అదితితో ఫొటోగ్రఫీ చదువుతున్న ఆమె ఫ్రెండ్​ సౌరవ్​ అనురాజ్​ ఈ ఫొటోలను  తీశాడు. నీళ్లలో మునిగిపోయిన కార్లు, బురద నీళ్లతో కనిపించకుండా పోయిన రోడ్లు, జనావాసాల మధ్య ఫొటోషూట్​ తీసి.. వరద బీభత్సం అక్కడి ప్రజలను ఎంతలా ఇబ్బంది పెడుతోందో చాలా సున్నితంగా తెలియజేశారు.

 

Latest Updates