12 గంటలకే బంద్!.జీహెచ్ఎంసీ పరిధిలో అప్రకటిత కర్ఫ్యూ

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​ హైదరాబాద్​లో అప్రకటిత కర్ఫ్యూ పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటివరకు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు తెరిచి ఉన్న కిరాణా దుకాణాలు, సూపర్​మార్కెట్లు, కూరగాయలు, పండ్ల షాపులన్నీ మధ్యాహ్నం 12 గంటలకే మూసేశారు. సాయంత్రం ఆరు నుంచి రాత్రంతా అమలవుతున్న కర్ఫ్యూ టైమ్​ను పోలీసులు మధ్యాహ్నం నుంచే అమలు చేస్తున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా.. హైదరాబాద్ లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ పరిస్థితి కనిపించింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక వెహికల్స్​లో గస్తీ తిరుగుతూ షాపులు మూసేయాలని సూచించారు. కొన్నిచోట్ల మాట వినని దుకాణాల వారిని పోలీస్​స్టేషన్లకు కూడా తీసుకెళ్లినట్టు సమాచారం. కేవలం పెట్రోల్​ బంకులు, మెడికల్​ షాపులకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు.

అవసరం లేకున్నా తిరగడంతో..

లాక్ డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం బయటికి వచ్చేందుకు సర్కారు అనుమతించింది. సాయంత్రం ఆరు తర్వాత కర్ప్యూ అమల్లో ఉంది. కొద్దిరోజులుగా గ్రేటర్ శివార్లు, మరికొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు, నాలుగు గంటలకే దుకాణాలు మూయిస్తున్నారు. కానీ ఒక్కసారిగా గ్రేటర్​అంతటా బుధవారం మధ్యాహ్నం నుంచే కర్ఫ్యూ వాతావరణం కనబడింది. పోలీసుల సూచనల మేరకు అన్నిచోట్లా  మెడికల్​ షాపులు, పెట్రోల్​బంకులు తప్ప అన్నింటినీ మూసేశారు. కూరగాయల రైతులు, వ్యాపారులు మధ్యాహ్నమే మార్కెట్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇదే టైమ్​లో పోలీసుల గస్తీ పెరిగింది. 12 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యమైపోయాయి. అయితే ముందస్తు సమాచారం లేకుండా అన్ని దుకాణాలు మూసేయడంతో చాలాచోట్ల జనం ఇబ్బందిపడ్డారు. ఒకవైపు పోలీసుల తనిఖీలు పెరగడం, మరోవైపు ఉన్న పళంగా షాపులు క్లోజ్ అవుతుండటంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన కూడా కనిపించింది.

అవసరం లేకున్నా తిరుగుతుండటంతోనే..

లాక్ డౌన్ అమల్లో ఉన్నా జనం తిరుగుతున్నారని, పెద్దగా అవసరం లేకున్నా బయటికి వెళ్తున్నారని, వెహికల్స్​పై తిరుగుతున్నారని పోలీసులకు  ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదే సమయంలో కరోనా పాజిటివ్​ వాళ్ల సెకండ్ కాంటాక్ట్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి రెండు రోజుల కింద సీనియర్ పోలీసు ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే కాస్త కఠినంగా వ్యవహరించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ మేరకు స్థానిక పోలీసులు చాలా చోట్ల బుధవారం పొద్దున్నే కిరాణా, కూరగాయలు, ఇతర నిత్యావసరాల షాపుల వద్దకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటలకే మూసేయాలని చెప్పారు. 12 గంటల తర్వాత గస్తీ తిరుగుతూ షాపులను మూసేయించారు.

కాలనీల్లో నో ఎంట్రీ బోర్డులు

పోలీసులు లాక్​డౌన్​ను కఠినం చేయడంతో పలుచోట్ల కాలనీలు, బస్తీల్లో రాకపోకలను స్థానికులు నిలిపివేశారు. కరోనా పాజిటివ్​ కేసులేమీ లేనిచోట్ల, కంటెయిన్​మెంట్లకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో కూడా రోడ్లను మూసివేసి, నో ఎంట్రీ బోర్డులు పెట్టారు. అడ్డంగా కట్టెలు, రాళ్లు, ఇతర సామగ్రి పెట్టి కాపలాగా ఉన్నారు. ‘‘కాలనీలోకి ఎవరికీ అనుమతి లేదు. ఈ కాలనీ రోడ్డు నుంచి ఎవరినీ పోనివ్వం. కాలనీలోకి కొత్త వ్యక్తులు రాకుండా చూసుకొమ్మని పోలీసులు చెప్పారు” అని ఆయా చోట్ల జనం అంటున్నారు.

Latest Updates