రూపాయికే ఇడ్లీ అమ్మే బామ్మకు గ్యాస్ స్టవ్

80 ఏళ్ల వయసులోనూ కష్టపడుతూ… రూపాయికే ఇడ్లీ అమ్ముతున్న బామ్మ కమలతాళ్ గురించి ఇపుడు దేశమంతా చర్చించుకుంటోంది. రేట్లు పెరుగుతున్నప్పటికీ.. తన హోటల్ కు వచ్చే వారిని ఇబ్బందిపెట్టకుండా.. తక్కువ ధరకు ఇడ్లీ అందిస్తోందామె. గతంలో ఆటానా(50 పైసలు)కే ఒక్కో ఇడ్లీ ఇస్తుండేది ఈ బామ్మ. ముప్పై ఏళ్లుగా పొద్దున్నే లేవడం.. ఇడ్లీ బ్యాటర్ తయారుచేసుకోవడం … బాయిలర్ లో ఇడ్లీ తయారుచేయడం.. చెట్నీ రుబ్బుకోవడం.. ఇన్ని పనులు ఆమె ఒక్కతే చేస్తుంటుంది. ఇప్పటికీ కట్టెల పొయ్యి వాడుతూ.. ఇడ్లీ, బోండా లాంటి నోరూరించే టిఫిన్స్ తయారుచేస్తోంది బామ్మ. రోజుకూలీలు, వారి కుటుంబసభ్యుల ఆకలి తీర్చేందుకే తాను ఇంత తక్కువకు ఇడ్లీ అమ్ముతున్నానని ఆమె చెప్పింది.

కోయంబత్తూర్​ సమీపంలోని వడివేలంపాలయంలో ఉండే ఈ బామ్మ గురించి తెల్సినవాళ్లంతా.. నువ్వు గ్రేట్ అమ్మా అని మెచ్చుకుంటున్నారు. ఇటీవలే.. బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్ర ఆమె గొప్పతనాన్ని పొగుడుతూ… ఆమె చేస్తున్న బిజినెస్ లో ఇన్వెస్ట్ మెంట్ పెట్టాలని ఉందన్నారు. కట్టెల పొయ్యి వాడుతూ కష్టపడుతోందని అందుకే.. ఆమెకు ఓ గ్యాస్ స్టవ్ కొనివ్వాలని ఉంది అని అభిమానంతో చెప్పారు ఆనంద్ మహీంద్రా.

Read Also : చచ్చే దాకా.. రూపాయికే అమ్ముతా!

బుధవారం నాడు.. కోయంబత్తూరులోని భారత్ గ్యాస్ సంస్థ వాళ్లు ఆమె గురించి తెల్సుకుని.. కమలతాళ్ ఇంటికి గ్యాస్ స్టవ్ కనెక్షన్ ఇచ్చారు. ఈ సంగతిని మరోసారి ట్విట్టర్ లో షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. బామ్మకు చేసిన సాయానికి కృతజ్ఞతలు చెప్పారు. ముందే చెప్పినట్టుగా ఈ గ్యాస్ స్టవ్ కు అయ్యే ఖర్చు తానే భరిస్తా అని గ్యాస్ కంపెనీకి చెప్పారు ఆనంద్ మహీంద్రా.

Latest Updates