అమ్మపై అంతటి ప్రేమ చూసి ఆనంద్ మహింద్రా ఫిదా.. కారు గిఫ్ట్

బజాజ్ స్కూటర్ పై దేశమంతా టూర్

బ్యాంకు ఉద్యోగం వదిలేసి.. అమ్మతో 48 వేల కిలోమీటర్ల చుట్టిన కొడుకు

20 రాష్ట్రాలతో పాటు, నేపాల్, భూటాన్ లకూ తీసుకెళ్లిన దక్షిణామూర్తి

భావోద్వేగంతో ఆనంద్ మహింద్రా ట్వీట్.. కారు గిఫ్ట్ ఇస్తానని ప్రకటన

మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా మనసుకు హత్తుకున్న విషయాలను రెగ్యులర్ గా ట్విట్టర్ లో షేర్ చేస్తుంటారు. అవసరంలో ఉన్న వారికి తన వంతు సాయం చేస్తుంటారు. తాజాగా ఇవాళ ఉదయం ఓ ‘బ్యూటిఫుల్ స్టోరీ’ని పోస్ట్ చేశారాయన. ఓ అమ్మపై తన కొడుకు చూపిస్తున్న ప్రేమకు కరిగిపోయిన ఆయన భావోద్వేగంతో ట్వీట్ చేశారు. కన్నతల్లిని బజాజ్ స్కూటర్ పై దేశమంతా తిప్పుతున్న అతడికి కారు గిఫ్టుగా ఇస్తానని ప్రకటించారు.

ఇంటి పనులతో ఎప్పుడూ ఊరు దాటని అమ్మ

ఇంటిలో ఎవరికి ఏ అవసరం వచ్చిన అమ్మే చూడాలి. పేరుకు నాన్న కుటుంబ పెద్ద అయినా.. ఆ ఇంటిని నడిపించేది మాత్రం అమ్మ అని ఎవరైనా చెబుతారు.  ఇంటి పనులు చూడాలి… వంట పని చేసుకోవాలి. పిల్లల మంచీ చెడూ చూసుకోవాలి. నాన్న చేదోడువాదోడుగా ఉండాలి. పొద్దున నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ తీరిక ఉండని వ్యక్తి ఎవరంటే ఒక్క అమ్మ మాత్రమే. అందుకే ఆ అమ్మలు ఇళ్లు దాటి వెళ్లే తీరిక ఉండదు. జీవితమంతా ఇంట్లోనే గడిచిపోతుంది చాలా మంది అమ్మలకు!! అలానే ఇంటి పనులతో తీరికలేక తల్లి ఊరు దాటకుండా ఉండిపోయిందన్న బాధతో ఆ కొడుకు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. బ్యాంకు ఉద్యోగాన్నే వదిలేసి.. దేశమంతా చూపించాలని డిసైడ్ అయ్యాడు మైసూర్ కు చెందిన దక్షిణామూర్తి కృష్ణ కుమార్.

48 వేల కిలోమీటర్ల మాతృసేవా సంకల్పయాత్ర

కన్నతల్లికి దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలన్నీ చూపించాలని నిర్ణయించుకున్నాడు దక్షిణామూర్తి. ‘మాతృసేవా సంకల్ప యాత్ర’ పేరుతో 20 ఏళ్ల క్రితం కొన్న పాత బజాజ్ స్కూటర్ పైనే అమ్మను వెంటబెట్టుకుని బయలుదేరాడు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దాదాపు 20 రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలను తిప్పి చూపించాడు. అంతేనా భూటాన్, మయన్మార్, నేపాల్ దేశాలకూ ఆ స్కూటర్ పైనే తీసుకెళ్లాడు. అమ్మకు ఏ ఇబ్బందీ కలగకుండా అప్పుడప్పుడు ఆగుతూ ఆగుతూ అన్ని ప్రాంతాలను చూపించాడు.

మహింద్రా కేయూవీ ఇస్తా

దక్షిణామూర్తి తన తల్లిని ఇలా యాత్రకు తీసుకెళ్లిన వీడియోను మనోజ్ కుమార్ అనే వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేశాడు. అది ఆనంద్ మహింద్రా కంట్లో పడింది. భావోద్వేగ కామెంట్ తో దాన్ని రీట్వీట్ చేశారు. అమ్మపై, దేశంపై దక్షిణామూర్తి ప్రేమను చూసి ఫిదా అయిన ఆనంద్ మహింద్రా.. వారి వివరాలు కనుక్కొని చెప్పాలని కోరారు. దక్షిణామూర్తికి మహింద్రా కేయూవీ 100 ఎన్ఎక్స్ టీ కారు గిఫ్ట్ గా ఇస్తానని చెప్పారు. ఈ సారి డ్రైవ్ కు అమ్మను ఆ కారులో తీసుకెళ్లొచ్చని ఆనంద్ మహింద్రా అన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Latest Updates