అన్నం లేక మన్ను తిన్న చిన్నారి మృతి..!!

anantapur-drought-girl-child-death-while-eating-sand-

కరువు కాటకాలకు నిలయమైన అనంతపురం జిల్లాలో ఆకలిచావు కలకలం రేపుతోంది. కర్ణాటక నుంచి వలస వచ్చిన ఓ కుటుంబంలో చిన్నారి ఆకలితో అలమటించి మట్టి తిని అనారోగ్యం పాలై కన్నుమూసింది. మూడు రోజుల క్రితం జరిగిన హృదయ విదారకర ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది.

కర్ణాటక రాష్ట్రం గుదిబండ గ్రామం నుంచి మహేష్, నీలవేణి దంపతులు పదేళ్ల క్రితం కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని హమాలీ క్వాటర్స్‌కు వచ్చి స్థిరపడ్డారు. కూలినాలి చేసుకుని జీవించే వీరికి ఉండటానికి ఇల్లు లేదు. తినడానికి తిండి లేదు. కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. నీలవేణి అక్క కూతురును కూడా తమవద్దే పెంచుకుంటున్నారు. ఎనిమిదేళ్లలోపు వయసు కలిగిన శ్రీను,, అంజలి, వనిత, ఇంకా పేరు పెట్టని ఏడాది వయసు పాప ఉన్నారు. ఏడాది కిందట ఒక పాప అనారోగ్యంతో చనిపోయింది. మూడు రోజుల క్రితం రెండేళ్ల వయసు కలిగిన మరో పాప (నీలవేణి అక్క కూతురు) ఆకలికి తట్టుకోలేక మట్టి తిని అనారోగ్యానికి గురై మృతి చెందింది. వీరున్న గుడారం పక్కనే పాపను పూడ్చారు.

మహేష్‌కు ఎప్పుడో ఓసారి మాత్రమే కూలి పని దొరుకుతోంది. కుటుంబ పోషణ భారంగా మారిపోయింది. ఇల్లు లేకపోవడంతో పిల్లలు రాత్రిపూట వీధుల్లో పడుకుంటున్నారు. పగలు ఎండవేడిమికి తట్టుకోలేక చెట్ల కింద ఉంటున్నారు. ఆకలి తీర్చేవారి కోసం ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఏడాది పాపకు ఏడవడానికి కూడా శక్తిలేదు. బాలల హక్కులను కాపాడడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అందరూ చెపుతుంటారు. ప్రభుత్వం బాలల హక్కుల చట్టాలను అమలు చేస్తోందా అన్న ప్రశ్న ఈ పిల్లలను చూస్తే కలుగుతుంది.

స్పందించిన ఎస్‌ఐ, చైల్ట్‌లైన్‌ సిబ్బంది

మహేష్‌ కుటుంబ దీనావస్థను స్థానికుల ద్వారా తెలుసుకున్న కదిరి రూరల్‌ ఎస్‌ఐ వెంకటస్వామి చలించిపోయారు. ఆ కుటుంబానికి ఉండడానికి ఒక గదిని తన స్వంత డబ్బులతో నిర్మిస్తానని ముందుకు వచ్చారు. అలాగే చైల్డ్‌లైన్‌ 1098 కో ఆర్డీనేటర్‌ శ్రీనివాసులునాయుడు స్పందించారు. మహేష్‌ పిల్లల్లో ముగ్గురు ఆరోగ్యరీత్యా ప్రమాదపుటంచున్న ఉన్నారని, వీరిని జిల్లా కేంద్రానికి తీసుకెళ్లి సురక్షితమైన వసతిగృహంలో ఉంచి మెరుగున వైద్యం, విద్య అందించే ఏర్పాటు చేస్తానన్నారు. దాతలు ముందుకు వస్తే ఇలాంటి పిల్లలను ఆదుకున్నట్లవుతుందన్నారు.

Latest Updates