నచ్చితే నాయనమ్మ పాత్రయినా ఓకే

యాంకర్‌‌‌‌‌‌గా అందరికీ దగ్గరైన అనసూయ నటిగానూ మెప్పు పొందుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్‌‌‌‌ ‘కథనం’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనసూయ కాసేపు ఇలా కబుర్లాడింది. ‘‘నేను ఇండస్ర్టీకొచ్చి దాదాపు పదేళ్లవుతోంది. ఎంబీయే చేసి జాబ్ చేసుకుంటూ అనుకోకుండా ఇటువైపు వచ్చాను. హీరోయిన్ అవ్వాలని, అవుతానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. పెళ్లి కాకముందు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఇంట్లోవాళ్లు వద్దన్నారు.  పెళ్లయ్యాక మావారు, అత్తమామల సపోర్ట్‌‌తో సినిమాలు చేస్తున్నాను.

ఇప్పటి వరకూ గెస్ట్ రోల్స్ కనుక ఏమీ అనిపించలేదు. కానీ హీరోయిన్‌‌గా అనేసరికి ఎక్సయిటింగ్‌‌గా ఉంది. ‘రంగ స్థలం’ చేశాక హీరోయిన్​గా చాలా ఆఫర్లు వచ్చాయి. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ చాన్సులొచ్చాయి. కానీ నేనే వద్దనుకున్నా. ఈ కథ విన్నప్పుడు మాత్రం వెంటనే ఓకే అనేశా. నా పాత్ర పేరు అనూ. తను ఒక అనాథ. అసిస్టెంట్ డైరెక్టర్‌‌‌‌గా పని చేస్తూ ఉంటుంది. తను రాసిన కథలోని హత్యలు నిజంగానే జరగడం
మొదలవుతుంది. దాంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది.

ఇప్పుడు ఇలాంటి సినిమాలకి డిమాండ్ ఉంది. అందరూ ఇష్టపడుతున్నారు. ఈ సినిమా కూడా తప్పక నచ్చుతుంది. ‘క్షణం’ చేశాక ప్రేక్షకులు నన్ను ఆదరించారు. అందుకే నటిగా కంటిన్యూ అవుతున్నాను. యాక్ట్రెస్‌‌గా సమస్యలేమీ లేవు కానీ ట్రోలింగ్ ఎక్కువవుతోంది. అది అదృష్టం,
దౌర్భాగ్యం కూడా. ఒకప్పుడు హర్టయ్యేదాన్ని. ఇప్పుడు పట్టించుకోవడం మానేశా. ఇటీవలే ఇంకొక సినిమాకి కమిటయ్యాను. ఆ వివరాలు సెప్టెంబర్‌‌‌‌లో చెబుతాను. ఇలాంటి పాత్రే చేయాలని అనుకోను. ‘యాత్ర’లో చిన్న పాత్రే అయినా మంచిది కనుక ఓకే అన్నాను. ఆడియెన్స్‌‌కి నచ్చుతుంది అనుకుంటే నాయనమ్మ పాత్రయినా చేస్తాను. ఈ సినిమాలో నా రోల్ కూడా అందరికీ నచ్చుతుంది.’’

Latest Updates