కారు నంబర్ ప్లేట్ పై ‘ఏపీ సీఎం జగన్’.. యువకుడు అరెస్ట్

టోల్ గేట్, ఇతర చెకింగ్ ల నుంచి తప్పించుకోవడానికి ఓ యువకుడు కారు నంబర్ ప్లేట్ పై ‘ఏపీ జగన్ సీఎం’ రాయించుకుని తిరుగుతున్నాడు. ఆ యువకుడిని జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..ఈస్ట్ గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన ముప్పిడి హరి రాకేశ్(27)  కూకట్ పల్లిలోని బాలాజీనగర్ లో ఉంటూ జీడిమెట్లలో బిజినెస్ చేస్తున్నాడు. అదే పిఠాపురం ప్రాంతానికే చెందిన యేసురెడ్డికి చెందిన కారును రాకేశ్ సిటీకి తీసుకొచ్చి వాడుకుంటున్నాడు. కారు నంబర్ ప్లేట్ లో ఏపీ 10బీడీ7299 నంబర్ కి బదులుగా  ‘ఏపీ సీఎం జగన్’​ అని ముందు, వెనకాల రాయించుకుని తిరుగుతున్నాడు. ఈనెల 19న   సాయంత్రం జీడిమెట్ల  పైపులైను రోడ్డులో వెళ్తున్న రాకేశ్​కారును అక్కడే వెహికల్​ చెకింగ్  చేస్తున్న జీడిమెట్ల
ట్రాఫిక్​ సీఐ సత్యనారాయణ ఆపి వివరాలు సేకరించారు.  కారు తమ బంధువుకి చెందినదని..ఈస్ట్ గోదావరి నుంచి సిటీకి వచ్చేటప్పడు  టోల్ గేట్​ ఫీజు, ఇతర చెకింగ్​ల నుంచి తప్పించుకోవడానికి అలా  రాశానని రాకేశ్​ ట్రాఫిక్ పోలీసులతో చెప్పాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు కేసును  జీడిమెట్ల లా అండ్​ ఆర్డర్​ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కారు స్వాధీనం చేసుకుని రాకేశ్ అరెస్ట్ చేశారు. అతడితో పాటు కారు ఓనర్ యేసురెడ్డిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Latest Updates