ఏపీ నుంచి ఇసుక బంద్​

    చెక్ పోస్టుల్లో నిఘా పెట్టాలని సీఎం జగన్ ఆదేశం

    ఇసుక కొరత తీర్చేందుకు వారోత్సవాలు  నిర్వహిస్తామని ప్రకటన

అమరావతి, వెలుగు: ఏపీలో ఇసుక అవసరాలు తీరేవరకు తెలంగాణ సహా కర్నాటక, తమిళనాడుకు ఇసుక సరఫరా బంద్​ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వారంరోజులపాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇసుక సమస్యపైనే పని చేయాలని సూచించారు. ఇసుక కొరతతోపాటు ఇతర సమస్యలపై మంగళవారం అమరావతిలో అధికారులతో ఆయన సమీక్షించారు. “ఇసుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర రాష్ర్టాలకు వెళ్లకూడదు. ఒక్క లారీ కూడా బయటకు పోకూడదు. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు చేయండి. ఇసుక అక్రమ రవాణాపై డీజీపీ స్వయంగా పర్యవేక్షించాలి. ఏపీలో ఇసుక సరఫరా పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో జరగాలి. కలెక్టర్లు, ఎస్పీలు ఇసుక తవ్వకాలు, సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి” అని జగన్ ఆదేశించారు.

టీడీపీ ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో ఖజానాకు రావాల్సిన నిధులు ఆ పార్టీ నాయకుల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. ఇసుక కొరత గోరంత ఉంటే ప్రతిపక్షం దాన్ని కొండతం చేసి చూపిస్తోందని విమర్శించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కలెక్టర్లు, ఎస్పీలకు పూర్తి అధికారాలను కట్టబెడుతున్నట్లు ప్రకటించారు. ఏపీలో 267 ఇసుక రీచ్​లకు గాను 69 రీచ్​లలో మాత్రమే ఇసుక తవ్వకం జరుగుతోందని, వరదల వల్ల ఇసుక తవ్వకాలకు ఆటంకం ఏర్పడిందన్నారు. ఇసుక కొరతను తీర్చడానికి వారం రోజుల పాటు ఇసుక వారోత్సవం నిర్వహిస్తామని జగన్​ ప్రకటించారు. గ్రామ సచివాలయాల్లో చలానా కట్టి 20 కిలోమీటర్ల వరకు ట్రాక్టర్​ ద్వారా ఎవరైనా ఇసుక తరలించుకోవచ్చని చెప్పారు.

ఇసుక కొరతపై నేడు లోకేశ్ దీక్ష

అమరావతి, వెలుగు: ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ ఆందోళనలను తీవ్రం చేసింది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి లోకేశ్ బుధవారం ఒక రోజు దీక్ష చేయనున్నారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట జరిగే దీక్షలో నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొంటారని టీడీపీ తెలిపింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోకేశ్ దీక్ష చేయనున్నారు. ఇసుక సరఫరాపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని వైఎస్ జగన్ సర్కారును డిమాండ్ చేయనున్నారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates