ఏపీ సచివాలయానికి వాటర్ ​కట్​చేస్తారా?

వెలుగు:  వాటర్​బోర్డు పెండింగ్ బిల్లులపై ఫోకస్ పెట్టింది. ఏపీ సచివాలయం రూ.3.5కోట్లు బకాయిపడినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే సంబంధిత అధికారులతో చర్చలు జరిపినా స్పందన లేకపోవడంతో తదుపరి చర్యలకు సిద్ధం అవుతున్నారు. విభజన చట్టం ప్రకారం పాత సచివాలయంలోని నాలుగు బ్లాకులు ఏపీకి  కేటాయించారు. 2014 నుంచి ఈ భవనాలను ఏపీ వినియోగిస్తోంది. జలమండలి నీటిని సరఫరా చేస్తుండగా ఏపీ సర్కారు బిల్లులను చెల్లించడం లేదు. ఏపీ జీఐడీ విభాగానికి లేఖలు రాస్తున్నా, ఎలాంటి స్పందన లేదు. తాజాగా ఏపీ అధికారులతో సమావేశమై బకాయిలు చెల్లించాలని కోరారు. రెండేళ్లుగా ఆ భవనాల్లో కార్యకలాపాలు సాగించడం లేదని, తామెలా బిల్లులు చెల్లిస్తామని ఏపీ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డివిజన్ నంబర్–4 పరిధిలోని సచివాలయానికి నల్లా లైన్ తొలగించాలా లేదా అనే అంశంపై జలమండలి యోచిస్తోంది. పెండింగ్ బిల్లులు చెల్లించని ప్రభుత్వ రంగ సంస్థలకు నల్లా నీటిని తొలగించిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. ఏపీ సచివాలయం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ నల్లా కనెక్షన్ తొలగించినా ఏపీ నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా బకాయిల రికవరీపై నిర్ణయం తీసుకుంటామని జలమండలి అధికారులు చెబుతున్నారు. ఏపీ హౌసింగ్ బోర్డుకు చెందిన రూ.12 కోట్ల పెండింగ్ బిల్లులపై కూడా రెవెన్యూ విభాగం అధికారులు దృష్టిసారించి లేఖలు రాసినట్లు తెలుస్తోంది.

Latest Updates