కాబోయే తల్లుల్ని పిల్లల్లా చూసుకుంటరు

పెండ్లయిన ఆడబిడ్డలందరూ కలలు కనేది పండంటి బిడ్డను కనాలనే. కడుపులో బిడ్డ కదులుతుంటే.. కాబోయే అమ్మ ఆనందాలకు హద్దులుండవు. బిడ్డపుడితే ఎంత ఆనందమో! ఆ పసిగుడ్డు ని కంటికి రెప్పలా కాపాడుకోవడంలోనూ అంతే ఆనందం. నేటి అమ్మలందరికీ ఆనందాలుపంచే ముగ్గు రమ్మలు ఆశమ్మ, అంగన్‌వాడీ టీచరమ్మ, ఏఎన్‌ఎం నర్సులమ్మ. పేగుతెం చుకుని పుట్టకున్నా ఊరి బిడ్డలందరికీ ఈ ముగ్గు రూ అమ్మలే!


ఒకప్పుడు
..
నెలసరి ఆగిపోతే కడుపులో బిడ్డపడ్డదో, కాలకూట విషంలాంటి జబ్బుపడ్డదో తేల్చిచెప్పేది మంత్రసానే. ఊరి ఆడోళ్లందరికీ వైద్యం చేసే మంత్రసాని చంటి బిడ్డలకూ చిట్కా వైద్యం చేస్తుంది. ఆమె మంచి డైటీషియన్‌‌. కడుపుతో ఉన్నప్పుడు ఏమి తినాలో, పాలుపడాలంటే ఎంత తినాలో చెప్పేది. ఆకలి పెంచాలన్నా, వాతం పోవాలన్నా, రోగం తగ్గాలన్నా ఏం చెయ్యాలో చెప్పేది. ఆ తరం పోయింది.

ఇప్పుడు..
కడుపులో ఏమవుతుందో తొలిచూలుకు అర్థంకాదు. కడుపులోని కదలికలు పంచుకోవడానికి అన్నీ తెలిసిన ఇంకో తోడు దొరకదు. అన్నీ చిన్న కుటుంబాలు. క్షణం తీరికలేని జీవితాలు. ఒకరికోసం ఒకరు నిలబడే రోజులే కావు. ఇంటిపట్టునే ఉండే ఆడవాళ్ల సందేహాలు తీర్చేవాళ్లుండరు. కడుపులో బిడ్డ ఎదుగుదల ఎట్లుందో తెలియకుంటే కలలన్నీ కల్లలయితయి. ఇట్లాంటి అనుభవమే బండిపల్లి మౌనిక కథ. ఆమె ఒంట్లో రక్తం లేదు. రక్తం పంచుకుని పుట్టాల్సిన కడుపులోని బిడ్డకు కష్టమొచ్చింది. మూడు నెలలకే అబార్షన్​ అయింది. ఈ సమస్యను మౌనిక ముందే పసిగట్టలేకపోయింది.

నెల నెలా పోవాల్సిందే
కొంత కాలానికి మౌనిక కలలు పండినయి. మళ్లీ కడుపులో బిడ్డ పడ్డది. నిర్లక్ష్యం తన బిడ్డకు శాపం కాకూడదనుకుంది. అంగన్‌‌వాడీ టీచర్‌‌ని కలిసింది. ‘సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌‌సీ)లో గర్భిణీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తారు. తప్పకుండా వెళ్లు, కుదరకపోతే శుక్రవారం ఉంటది. ఆ రోజు వెళ్లు అని చెప్పింది’ అంగన్‌‌వాడీ టీచర్‌‌. సోమవారం రానేలేదు. ఆదివారం పొద్దునే ఆశక్క ఇంటికి వచ్చింది. ‘రేపు పొద్దునే దవాఖానకు పోదాం రెడీగా ఉండు’ అని చెప్పిపోయింది.

చెప్పిన టైమ్‌‌కే వచ్చింది ఆశక్క. తల్లికాబోయే ఇంకో నలుగుర్ని వెంటేసుకొచ్చింది. అమ్మలక్కలంతా కలిసి మంచిగా ముచ్చట్లు చెప్పుకుంట దవాఖానకు పోయారు. డాక్టర్లు యూరిన్‌‌ ప్రెగ్నెన్సీ టెస్ట్‌‌ చేశారు. అందులో పాజిటివ్‌‌ రిజల్ట్‌‌ వచ్చింది. తల్లికాబోయే మౌనిక ఆరోగ్యం ఎట్లుందో తెలుసుకోవాలని.. బరువు, బీపీ, బ్లడ్‌‌ టెస్ట్‌‌, థైరాయిడ్‌‌ టెస్ట్‌‌ చేశారు. పండంటి బిడ్డని కనాలన్న ఆ కోరికని రక్తహీనత ఇంకా వెంటాడుతోందని బ్లడ్‌‌ రిపోర్ట్‌‌ బయటపెట్టింది. రక్తంలో  హిమోగ్లోబిన్‌‌8 మిల్లీ గ్రాములే ఉంది. డాక్టర్లు ధైర్యం చెప్పారు. మందులు తీసుకుని ఇంటికొచ్చింది. ఒక్క మౌనికకే కాదు, ఆమెతోపాటు వచ్చిన వాళ్లందరికీ ఇట్లనే పరీక్షలు చేయిస్తది ఆశక్క.

ఆశ అనుబంధం
‘ఒక మహిళ నెలతప్పిందంటే మాతా శిశు కార్డు చేతిలో పెడతం. అందులో ఏ నెలలో ఏ పరీక్షలు చేయించాలో రాసి ఉంటది. ఆ ప్రకారంగా మేం ఒక రిజిస్టర్‌‌ తయారు చేసుకుంటం. దాని ప్రకారం వాళ్లను నెలనెలా దవాఖానకు తీసుకుపోతం. ఏఎన్‌‌ఎంతో టీకాలు వేయిస్తం. ముందు రోజే చెప్పి తీసుకుపోతం. మేముంటే ఇంట్లోవాళ్ల తోడు అవసరమే లేదు అంటోంది ఆశా వర్కర్‌‌ షేక్‌‌ మీరాబీ. ఆమే కాదు.. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక ఆశా వర్కర్‌‌ చొప్పున రాష్ట్రంలో వేలాది మంది ఉన్నారు. వాళ్లందరి పని ఇదే. ఆశక్క ఇట్లచేయబట్టే మౌనిక రక్తహీనత పోయింది. భయమూ పోయింది. తొమ్మిది నెలలు నిండినంక బిడ్డని కన్నది. ఆ బిడ్డ బరువు 2.85 కేజీలు. ఆశమ్మ చెప్పినట్టు బిడ్డని చూసుకుంది. మొదటి నెలలో 800 గ్రాములు పెరగాల్సిన బిడ్డ 1.1 కేజీ పెరిగింది. అంగన్‌‌వాడీ అన్నం ఎంత బలమో మౌనిక అనుభవం చెబుతోంది.

అమ్మ బడి
అంగన్‌‌వాడీ బడి అమ్మలకూ పాఠాలు చెబుతుంది. నెలలో ఫస్ట్‌‌ తారీఖు, 15వ తారీఖున అంగన్‌‌వాడీ బడిలో అమ్మలకు నర్సులమ్మ (ఏఎన్‌‌ఎం) ఆరోగ్య పాఠాలు చెబుతుంది. గర్భం దాల్చితే శరీరంలో హార్మోన్ల మార్పులెట్లుంటయో చెప్పి,  టీకాలు ఇచ్చిపోతుంది. ఈ రెండు రోజులు పోను మిగతా రోజులన్నీ అంగన్‌‌వాడీ టీచర్‌‌ ఈ పాఠాలు చెబుతుంది. ఆ పాఠాల ప్రకారమే ఆయమ్మ ‘ఆరోగ్య లక్ష్మి.. సంపూర్ణ ఆహారం’ రోజుకో తీరుగ వండి, వడ్డిస్తుంది. అన్నంలో రోజుకో గుడ్డు ఇస్తుంది. ఈ గుడ్డులోని ఐరన్‌‌ రక్తం పెరిగేలా చేస్తుంది. రక్తం పెరిగితే అబార్షన్‌‌ కాదు. పప్పులో రోజుకో కాయగూరని చేర్చి రుచిగా చేస్తుంది. కడుపులో బిడ్డను తయారు చేసేది పప్పులో పుష్కలంగా ఉండే ప్రొటీన్లే! వీటితోపాటు నాలుగు నెలలదాకా ఫోలిక్‌‌ యాసిడ్‌‌ మాత్రలు, నాలుగు నెలల నుంచి అదనంగా ఐరన్‌‌, క్యాల్షియం మాత్రలు ఇచ్చి బిడ్డ బలంగా ఉండేలా చూసుకుంటారు. మందులు, అంగన్‌‌వాడీ అన్నం రోజూ తింటే తల్లీబిడ్డలు బాగుంటారని చెప్పడం కాదు. ప్రసవాల లెక్కలే చెబుతున్నాయి. అయినా.. ‘అంగన్‌‌వాడీ సెంటర్లలో అన్నం ఎవరు తింటారని చాలా మందికి సందేహం? ఇది దూరంగా చూసే వాళ్లకు అర్థంకాని విషయం. దగ్గరగా చూస్తే ఇదెంతో అద్భుతం’ అంటోంది అంగన్‌‌వాడి వర్కర్‌‌ కె. సంధ్యారాణి. ఉప్పల్‌‌లోని సరస్వతి నగర్‌‌లో అంగన్‌‌వాడీ కేంద్రం నిర్వహిస్తోందామె. ఈ కేంద్రం పరిధిలో ఏడు కాలనీలు, ఒక స్లమ్‌‌ ఉన్నాయి. ఇక్కడ 2015 నుంచి ఇప్పటి వరకు ఒక్క శిశువు కూడా తక్కువ బరువు (2.8 కేజీలకు తగ్గకుండా)తో పుట్టనే లేదు. ఏడాదిలోపు వయసులో చనిపోయే పిల్లల్లో 23 శాతం మంది హైదరాబాద్‌‌ నగరంలో ఉంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఆరోగ్య లక్ష్మి.. సంపూర్ణ ఆహారంలో ఉండే పోషకాలు, తల్లుల అవసరాలను ఎలా తీరుస్తాయో ఆమె చక్కగా చెబుతూ అందరికీ దగ్గరయింది.

ఇల్లు మారాలనిపించదు..
‘రెండో బిడ్డను కూడా మొదటి బిడ్డలాగా కనాలని అంగన్‌‌వాడి సెంటర్‌‌కు దగ్గర్లోనే ఉంటున్నా’ అని లక్ష్మీ తిరుపతమ్మ అంటోంది. తను గృహిణి. భర్త ఉద్యోగి. ఆఫీసుకి, ఇంటికీ 20 కిలోమీటర్ల దూరం. ‘ఆఫీసు ఎంత దూరంలో ఉంటేనేం? అంగన్‌‌వాడీ సెంటర్‌‌కు దగ్గరగా ఉంటేచాలు’ అంటుంది తిరుపతమ్మ. పెండ్లయిన మూడేండ్లకు ఆమె నెల తప్పిందట. ఆ సంతోషం మూన్నాళ్లముచ్చటైంది. మూడో నెలలోనే అబార్షన్‌‌. ఆ తర్వాత తెలిసిందేమంటే థైరాయిడ్‌‌ సమస్య అని. ముందే తెలియక నష్టపోయింది. కొన్నాళ్లకు మళ్లీ గర్భందాల్చింది. ఈసారి అంగన్‌‌వాడీలో పేరు రిజిస్టర్‌‌ చేయించుకుంది. ఏఎన్‌‌ఎం టీకాలు ఇస్తూ, పీహెచ్‌‌సీలో  నెలనెలా పరీక్షలు చేయించింది. వాళ్లు చెప్పినట్లు చేస్తూ, ప్రతి రోజూ ఆరోగ్య లక్ష్మి.. సంపూర్ణ భోజనం తీసుకున్నది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ అంగన్‌‌వాడీలో వడ్డించే ఆహారం తిరుపతమ్మను నిజంగానే ఆరోగ్య లక్ష్మిని చేసింది.

అమ్మకడుపు చల్లగా
‘మేము కానీ, ఆశమ్మ కానీ గవర్నమెంట్‌‌ హాస్పిటల్‌‌కే తీసుకుపోతం. అక్కడ బాగా చూడరని కొంత మంది ప్రైవేట్‌‌ హాస్పిటల్‌‌కు పోయేటోల్లు. ప్రైవేటు దవాఖానల్లో చూపించుకునే పేదోళ్లు ఆ  ఫీజులు కట్టలేక మధ్యలో చెకప్‌‌లకు పోతలేరు. ఒకప్పటికీ, ఇప్పటికీ గవర్నమెంట్‌‌ హాస్పిటల్స్‌‌లో చాలా మార్పులొచ్చినయ్‌‌. పీహెచ్‌‌సీలో ఇప్పుడు ఎనీమియా ట్రీట్‌‌మెంట్‌‌ ఇస్తున్నరు. ఎక్కువ మంది ఆడవాళ్లు రక్త హీనతతో ఉంటారు. మందులకు తగ్గకుంటే మూడు లేదా అయిదు సార్లు ఐరన్‌‌ ఇంజక్షన్‌‌ ఇవ్వాలి. ఈ ఎనీమియా ట్రీట్‌‌మెంట్‌‌ ఒక్కసారికి ప్రైవేటు దవాఖానలు 1500కు పైగానే చార్జ్‌‌ చేస్తరు. ఇట్లాంటి ఖర్చులు భరించలేక మధ్యలోనే హాస్పిటల్‌‌కు పోవడం బంద్‌‌ చేస్తున్నరు. తిరిగి గవర్నమెంట్‌‌ హాస్పిటల్‌‌కు కూడా రావట్లే.  కొంత మంది మూడో నెలలో ఎన్‌‌టీ స్కాన్‌‌, అయిదోనెలలో టిప్పా స్కాన్‌‌ చేయించుకోవట్లే. బిడ్డ ఎదుగుదల తెలియట్లే. ఇట్లాంటి సమస్యలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నయ్‌‌.  రాత్రి కాన్పుకు పోతే  ఒకప్పుడు చాలా పీహెచ్‌‌సీలో చేసేది కాదు. ఆ సమయంలో లేబర్‌‌ రూమ్‌‌ స్టాఫ్‌‌ నర్స్‌‌ డ్యూటీలో ఉండదు. ఇప్పుడు చాలా పీహెచ్‌‌సీల్లో మూడు షిప్టుల్లో డ్యూటీలు చేస్తున్నారు. ఇవేవీ తెలియక జనం ఉపయోగించుకోవట్లే.’ అని చెప్పింది ఉమామహేశ్వరి. ఆమె అన్నట్లే ప్రభుత్వ దవాఖానలపై ఉండేవి అపోహలే అంటోంది గీతాంజలి. ఆమె ఓ ప్రైవేట్‌‌ హాస్పిటల్‌‌లో ఇప్పుడు నర్స్‌‌గా పనిచేస్తోంది.  గాంధీ హాస్పిటల్‌‌లో ఏఎన్‌‌ఎం కోర్సు చదివింది. ట్రైనింగ్‌‌ల ఉన్నపుడు ఎంత చక్కగా వైద్యం చేస్తారో చూసింది. తను  ప్రెగ్నెంట్‌‌అయినప్పుడు అంగన్‌‌వాడీ భోజనం, గుడ్డు, పాలు తీసుకున్నది. గాంధీ దవాఖానలోనే ప్రసవానికి ముందు చేరింది. బిడ్డను కన్నది.

పేదింటిఆశ
గర్భిణీలను హాస్పిటల్‌‌కు తీసుకువచ్చేందుకు ఆశక్కలు, ఏఎన్‌‌ఎం, అంగన్‌‌వాడీ వర్కర్లున్నారు. ఇంత మంది ఉన్నా అందరూ హాస్పిటల్‌‌కు రావట్లే. బిడ్డలు మంచిగ పుట్టట్లే. అందరినీ హాస్పిటల్‌‌కు రప్పిస్తే ఈ బాధలన్నీ పోతయని గవర్నమెంట్‌‌ జూలై 2017లో కేసీఆర్‌‌ కిట్‌‌ పథకాన్ని మొదలుపెట్టింది. ‘గవర్నమెంట్ హాస్పిటల్‌‌కు రండ్రి. ఫ్రీగా ట్రీట్‌‌మెంట్‌‌, మందులే కాదు తల్లి చేతికి డబ్బులు, బిడ్డకు బోలెడు కానుకలు ఇస్తమని గవర్నమెంట్‌‌ చెప్పింది. గీ మాటెప్పుడైతే జనానికి వినపడ్డదో అప్పటి సంది గర్భిణీల ఎన్‌‌రోల్‌‌మెంట్‌‌ పెరిగింది. మా కేంద్రం పరిధిలో ఉన్న ఏడు కాలనీల్లో ఇప్పుడు వంద శాతం ఎన్‌‌రోల్‌‌మెంట్‌‌ ఉంది’ అని అంగన్‌‌వాడీ వర్కర్‌‌ సంధ్య అంటోంది. ఈ కేంద్రం పరిధిలోనే కాదు మా పీహెచ్‌‌సీ పరిధిలో కూడా ఇలాగే ఉంది’ అని ఉమామహేశ్వరి చెప్పింది.

హిట్‌‌.. కేసీఆర్‌‌ కిట్‌‌
‘కేసీఆర్‌‌ కిట్‌‌’ పేరుతో కాబోయే అమ్మలకు వరాల ఆశచూపి హాస్పిటల్‌‌కు తీసుకుపోతున్నరు ఆశక్కలు. అయిదు నెలలలోపు రెండు సార్లు చెకప్‌‌ చేయించుకుంటే మూడు వేల రూపాయలు ఇస్తారు. ప్రభుత్వ దవాఖానలో డెలివరీకి అయితే 4 వేల రూపాయలు (ఆడబిడ్డ పుడితే రూ.5 వేలు) ఇస్తున్నారు. అట్లనే తల్లీబిడ్డల కోసం 2 వేల రూపాయల విలువైన కేసీఆర్‌‌కిట్‌‌ ఇస్తున్నారు. ఇక పుట్టిన బిడ్డకు మూడున్నర నెలల వరకు వ్యాక్సిన్లు ఇప్పిస్తే రెండు వేలిస్తారు.   పదో నెలలో ఎమ్మెమ్‌‌ఆర్‌‌, విటమిన్‌‌–ఏ సిరప్‌‌ తాగిస్తే మూడు వేల రూపాయలు ఇస్తున్నారు. ఇంటి నుంచి హాస్పిటల్‌‌కు తీసుకుపోవడానికి 102 బస్సు, తోడుగా ఆశక్క, వైద్య పరీక్షలు, ఫ్రీగా మందులిచ్చి మల్లా చేతికి డబ్బులిస్తే ఏ తల్లి వదులుకుంటది. అందుకే తెలంగాణలో అంగన్‌‌వాడి బువ్వకు, గవర్నమెంట్‌‌ ఇంజెక్షన్ల కోసం వచ్చే వాళ్లు పెరుగుతున్నరు. అట్లనే ఆరోగ్యంగా పుట్టే బిడ్డలూ పెరుగుతున్నరు

పేదోళ్ల పుట్టిల్లు
కేసీఆర్​ కిట్​ మొదలుపెట్టిన ఏడాదిలో  పుట్టిన పిల్లల్లో 32.8 శాతం గవర్నమెంట్‌‌ దవాఖానల్లో పుట్టారు. అనుకున్నట్లే ఇప్పుడు సగం డెలివరీలు (47.2 శాతం) గవర్నమెంట్‌‌ హాస్పిటల్‌‌లోనే అయితున్నయి. ఇంటికాడే బిడ్డను కంటే డబ్బులు రావని దవాఖానకు పోతుంటే, మధ్యలో పరీక్షలు చేయించుకోకుంటే సగం డబ్బులు రావని ఇంకొకరు హాస్పిటల్‌‌కు పోతున్నరు. పుట్టిన బిడ్డకూ వ్యాక్సిన్లు వేయిస్తే మళ్లీ డబ్బులిస్తున్నరు. ఇదే కేసీఆర్‌‌ కిట్‌. ఈ కిట్‌‌ కావాలంటే బిడ్డ కడుపులో పడ్డప్పట్నుంచి హాస్పిటల్‌‌కు రావాల్సిందే. ట్రీట్‌‌మెంట్‌‌ చేయించుకోవాల్సిందే!
-నాగవర్ధన్​ రాయల

Latest Updates