ముగింపు మరింత బాగుండాల్సింది: అనిల్ కుంబ్లే

న్యూఢిల్లీ: టీమిండియాకు కోచ్‌గా ఉన్న ఏడాది టైమ్‌ను తాను చాలా ఆస్వాదించానని స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే అన్నాడు. అయితే ముగింపు మరింత బాగా ఉండాల్సిందన్నాడు. జింబాబ్వే కామెంటేటర్ పొమ్మీ ముబాంగ్వాతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో కుంబ్లే పాల్గొన్నాడు. ఇండియన్ టీమ్ కోచ్‌గా పని చేయడాన్ని తాను ఎంజాయ్ చేశానని, దాని గురించి విచారించట్లేదన్నాడు.

‘కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. అది అద్భుతం. టీమిండియాతో ఒక సంవత్సరం గడపడం అద్భుతం. ఎన్నో గ్రేట్ పెర్ఫామెన్సెస్ తర్వాత మళ్లీ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో భాగమవ్వడం నిజంగా అద్భుతమైన ఫీలింగ్. ఓ ఏడాదిపాటు మేం చాలా శ్రమించాం. కొన్ని మంచి ప్రదర్శనలు కూడా ఉన్నాయి. దీనిపై విచారించడం లేదు. అక్కడి నుంచి బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉన్నా. కానీ ముగింపు బాగుండాల్సింది. అయినా పర్లేదు. ఒక కోచ్‌గా ఎప్పుడు తప్పుకోవాలో తెలుస్తుంది. ఆ ఏడాదిలో టీమ్‌లో కీలక పాత్ర పోషించినందుకు చాలా హ్యాపీగా ఉంది’ అని కుంబ్లే చెప్పాడు.

Latest Updates