అభ్యర్థి ఫొటో చాలు.. పార్టీలు, గుర్తులు ఉండొద్దు: అన్నా హజారే

‘‘ఎన్నికల గుర్తులు, పొలిటికల్ పార్టీలు ఉండరాదన్న రాజ్యాంగాన్ని నేను నమ్ముతాను. గుర్తులను తొలగించాలని ఈసీతో ఆరేళ్లుగా చర్చలు జరుపుతున్నాను. రాజ్యాంగం వ్యక్తులను మాత్రమే గుర్తిస్తుంది” అని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే చెప్పారు. ఎన్నికల్లో గుర్తులు, అభ్యర్థుల పేర్లకు బదులుగా ఫొటోలను పెడితే చాలన్నారు. ‘‘1952లో ప్రింటింగ్ టెక్నాలజీ అంత అడ్వాన్స్ డ్ కాదు. అందుకే గుర్తులు వాడారు. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఇంకా గుర్తులు ఎందుకు? గుర్తులు తీసివేస్తే, చట్టసభల్లోకి అర్హత లేని వ్యక్తులు రాకుండా అడ్డుకోవచ్చు. మంచి ఇమేజ్, ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తులు ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంటుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

శనివారం మహారాష్ర్టలోని అహ్మద్ నగర్ జిల్లా రాలేగావ్ సిద్ధిలో హజారే విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పెద్ద స్థాయిలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఓటర్లకు అవగాహన లేకపోవడం, ఎలాగైనా గెలవాలని పార్టీలుప్రయత్నిస్తుండటం వల్ల దేశంలో పాలిటిక్స్ దిగజారి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇలానే ఉంటే దేశానికి మెరుగైన భవిష్యత్ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఓటర్ ఒకరని అన్నారు. ‘‘రోజూ కోట్లలో డబ్బు పట్టుబడుతోంది. ఓటర్లు డబ్బు ఎందుకు తీసుకుంటున్నారనేది నాకు ఆశ్చర్యా నికి గురిచేస్తోంది. ఇండిపెండెన్స్ తెచ్చిన స్వాతంత్ర్య సమరయోధులకు మనం ఇచ్చే గుర్తింపు ఇదేనా” అని ప్రశ్నించారు. ఎలాగైనా గెలవాలన్న పార్టీల తీరు వల్ల రాజకీయాలు నేరమయమవుతున్నాయని, పార్లమెంట్, అసెంబ్లీల పవిత్రతకు ముంపుపొంచి ఉందన్నారు.

మోడీకి 32 లెటర్లు రాశా
‘‘అమరుల త్యాగాలను ఓట్ల కోసం వాడుకోవడం దురదృష్టకరం. పవర్ లోకి వచ్చేందుకు ఏమైనాచేయాలనుకునే ట్రెండ్ ఉన్నప్పుడు.. ఇలాంటివే కనిపిస్తాయి. ఓటర్లు నిద్రపోతుంటారు” అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి 32 లెటర్లు రాస్తే ఒక్కదానికీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన లోక్ పాల్.. తన అంచనాలకు తగ్గట్లు లేకపోయినా ఏదో ఒకరోజు అవినీతికి అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడో దశఎన్నికల్లో భాగంగా 23న అహ్మద్ నగర్లో ఓటేస్తానని చెప్పారు. కరెక్ట్ అభ్యర్థి కే ఓటేస్తానని, లేకుంటే నోటా బటన్ నొక్కుతానని చెప్పారు.

Latest Updates