మే 17 నుంచి తిరుచానూరు అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మే 17 నుండి 19వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. మే 16వ తేదీ అంకురార్పణంతో వసంతోత్సవాలు ప్రారంభమవుతాయి. మే 18వ తేదీన ఉదయం స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. ఈ సందర్భంగా ఈ మూడు రోజులపాటు మధ్యాహ్నం 2.30 నుండి 4.00 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారిని ఘనంగా ఊరేగిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150  చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు లడ్డూ, వడ అందజేస్తారు. వసంతోత్సవం సందర్భంగా ఆలయంలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజలసేవను రద్దు చేశారు. మే 17న లక్ష్మీపూజ, మే18వ తేదీ సామవేద పుష్పాంజలిసేవలను TTD రద్దు చేసింది. ఆలయం దగ్గరున్న ఆస్థాన మండపంలో ప్రతిరోజూ సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో కళాకారులతో భజనలు, కోలాటాలు ఏర్పాటు చేశారు.

మే 14న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం..

పద్మావతీ అమ్మవారి వార్షిక వసంత్సోవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మే 14వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు.  ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.00 నుండి 8.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9.00 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.  ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజలసేవను TTD రద్దు చేసింది.

Latest Updates