పాక్ లో హిందూ మహిళల కిడ్నాప్

another-hindu-girl-abducted-in-pakistan

పాకిస్థాన్ లో హిందూ మహిళలకు రక్షణ లేకుండా పోయింది. వరుసగా హిందూ మహిళలు అపహరణకు గురవుతున్నా పాక్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవలే రవీనా, రీనా అనే ఇద్దరు హిందూ మహిళలను అపహరించి మత మార్పిడి చేసి బలవంతంగా పెళ్లి చేసిన వీడియో సంచలనం సృష్టించిన రెండు రోజులకే మరో హిందూ బాలికను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్ళారు. పాక్ లోని ఘోట్కికిలో మార్చి 16న అర్థరాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి తన కూతురుని ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఓ హిందూ మహిళ. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి వారికి న్యాయం చేస్తామని చెప్పారు. ఈ కేసును త్వరగా దర్యాప్తు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు సింధ్ ప్రావిన్స్ మైనార్టీ వ్యవహారాల మంత్రి హరి రామ్ కిషోరి లాల్. బాధితుల కుటుంబాలకు న్యాయం చేస్తామని అన్నారు.

ఇటీవల ఇద్దరు బాలికలను ఎత్తుకెళ్లి మత మార్పిడి జరిపి పెళ్లి చేసిన ఘటనపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌద్రీల మధ్య ట్విట్టర్లో ఓ చిన్నపాటి రచ్చ జరిగింది. ఇది పాకిస్తాన్ అంతర్గత విషయం అని అన్నారు పాక్ మంత్రి ఫవాద్ చౌద్రీ. మైనార్టీలను అణచి వేసేందుకు ఇదేం ఇండియాలోని మోదీ ప్రభుత్వం కాదని ఇమ్రాన్ ప్రభుత్వం అని అన్నారు.  మైనార్టీలను తమ దేశంలో సమానంగా చూస్తామని.. ఇండియాలో  కూడా మైనార్టీలను సమానంగా చూస్తారని ఆశిస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. దీనికి సుష్మా బదులిస్తూ.. మీ వ్యాఖ్యలు చూస్తుంటే మీలోని వక్రబుద్ధి మరోసారి బయటపడిందని అన్నారు.

Latest Updates