న్యాయం చేయాలే: మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం

  • లేదంటే మమ్మల్ని చంపుర్రి అంటూ నినాదాలు

నర్సంపేట: ఆర్టీసీ కార్మికులు భావోద్వేగంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో మనస్తాపం చెంది బలవన్మరణాలకు సిద్ధపడుతున్నారు. నిన్న ఖమ్మంల జరిగిన ఘటనలు మరువక ముందే ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేట డిపో వద్ద మరో కార్మికుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఆర్టీసీ గుర్తింపు సంఘం టీఎంయూ కార్యదర్శి బత్తిని రవి అందరూ చూస్తుండగానే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే పోలీసులు, తోటి ఉద్యోగులు ఉండడంతో ప్రమాదం తప్పింది. నీళ్లు పోసి అతడిని కాపాడారు. అఘాయిత్యాలకు పాల్పడొద్దని స్థిమితపరిచారు.

న్యాయం చేయండి

ఆత్మహత్యాయత్నం చేసిన బత్తిని రవిని అడ్డుకుని పోలీసులు, తోటి కార్మికులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఆర్టీసీని కాపాడాలే అని రవి నినదించాడు. ‘తెలంగాణ కోసం పోరాడింది మేము. మన బిడ్డల కోసం తెలంగాణ తెచ్చుకున్నం. ఆర్టీసీ కోసం పని చేస్తోంది మేము. మాకు న్యాయం చేయాలే. లేదంటే చంపుర్రి. మమ్మల్ని చంపుర్రి’ అంటూ నినాదాలు చేశాడు రవి.

ధైర్యం కోల్పోవద్దు

ఆర్టీసీ సమ్మెపై సర్కారు వ్యవహరిస్తున్న తీరుతో శనివారం ఖమ్మంలో డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి కిరోసిన పోసుకుని నిప్పటించుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగిన కొద్ది నిమిషాలకే ఖమ్మం కలెక్టరేట్ దగ్గర వెంకటేశ్వరాచారి అనే మరో కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు, తోటి ఉద్యోగులు పైన నీళ్లు పోయడంతో ఓ ప్రాణం నిలబడింది.

ఖమ్మం డిపో డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి కిరోసిన్ పోసుకున్న ఘటనలో శరీరం 90 శాతం కాలిపోవడంతో ఆయన మరణించారు. దీంతో రాజకీయ పార్టీలు, ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రజా సంఘాలు.. కార్మికులకు దైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.   ‘డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ప్రాణం పోవడమే అత్యంత విషాదకరం, మీకు మేం అండగా ఉన్నాం. ఎవరూ దైర్యం కోల్పోవద్దు’ అని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు చెబుతున్నా ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యా యత్నాలు ఆగలేదు.

Latest Updates