బీటెక్ విద్యార్థిని మిస్సింగ్ కేసులో మరో మలుపు

నారాయణగూడ – వెలుగు : గత నెల 26న ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ హాస్టల్ నుంచి వెళ్లిపోయిన బీటెక్ విద్యార్థిని కేసు కొత్త మలుపు తిరిగింది. వారం రోజులుగా నారాయణగూడ పోలీసులను పరుగులు పెట్టించిన ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నారాయణగూడ ఇన్ స్పెక్టర్ పి.రమేశ్​ కుమార్ కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా నవీపేట్ కి చెందిన మౌనిక (19) నారాయణగూడ లోని కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. హిమాయత్ నగర్ లోని గౌడ హాస్టల్ లో ఉంటోంది. అదే గ్రామానికి చెందిన గోపి మణిరత్నం యాదవ్ (20) తనను వేధిస్తున్నాడంటూ వారం రోజుల క్రితం మౌనిక తండ్రి శ్రీనివాస్ కు ఫోన్ చేసి హాస్టల్ నుంచి వెళ్ళిపోయింది.

శ్రీనివాస్ కంప్లయింట్ మేరకు నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు . మణిరత్నం మొబైల్ సిగ్నల్ ఆధారంగా గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు. మణిరత్నంని సిటీకి తీసుకువచ్చి విచారించగా…మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మణిరత్నం బలవంతంగా యువతిని పెళ్లి చేసుకొనేందుకు యత్నించాడని  తేలడంతో పోలీసులు అతడిపై , అతనికి సహకరించిన వరుసకు బావమరిది అయ్యే భార్గవ్ యాదవ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో మరో నిందితుడు మణిరత్నం ఫ్రెండ్  రాజేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

చనువుగా ఉన్న ఫొటోలతో బ్లాక్ మెయిలింగ్

మౌనికకు మణిరత్నం చిన్నప్పటి నుండి క్లాస్ మేట్. ఒకే ఊరు కావడంతో వారి మధ్య కాస్త చనువు ఉండేది. ఇద్దరు ప్రేమించుకున్నారు . కొంత కాలానికి విడిపోయారు. గత ఏడాది బీటెక్ చదివేందుకు మౌనిక నగరానికి వచ్చింది.  మణిరత్నం కూడా సిటీలో హోటల్ మేనేజ్ మెంట కోర్సు చదువుతూ..బేగంపేట్ లో ఉండేవాడు. మౌనిక తనతో మాట్లాడకపోవడంతో   వారు చనువుగా దిగిన సెల్ఫీలను అడ్డుపెట్టుకొని మణిరత్నం బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడే వాడు. తనతో మాట్లాడాలని , తాను చెప్పినట్లు వినాలని లేకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో మౌనిక తన మొబైల్ నెంబర్ ను మార్చేసింది. కానీ మణిరత్నం మౌనిక రూమ్ మేట్ నంబర్ కు చెయ్యి కోసుకున్న ఫోటో పంపి , తనను పెళ్లి చేసుకోకపోతే మౌనికకు చంపుతానని బెదిరించాడు.

విసిగిపోయిన మౌనిక గత నెల 26న ఆత్మహత్య చేసుకొనేందుకు ట్యాంక్ బండ్ కు వెళ్ళింది. కానీ మనసు మార్చుకుని బేగంపేట్ లో ఉంటున్న మణిరత్నం రూమ్ కు వెళ్లి అతడి మొబైల్ లో ఉన్న ఫోటోలు డిలీట్ చేసింది.  మణిరత్నం యువతి ఫోటో లను అతని ఫ్రెండ్ రాజేష్ ఫోన్ కి పంపినట్లు చూపించాడు. తనని పెళ్లి చేసుకోకపోతే చంపుతానని బెదిరించాడు. మౌనికను బలవంతంగా మణిరత్నం, అతని స్నేహితుడు రాజేష్ చర్లపల్లి రైల్వే స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి గుంటూరు కు మణిరత్నం , మౌనిక వెళ్లారు. గుంటూరులో మణిరత్నం బావమరిది భార్గవ్ వారికి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశాడు.ఈలోగా పోలీసులు అక్కడికి వారిని  అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates