రాష్ట్రంలో యాంటీబాడీ సర్వే ఇంకెప్పుడు?

హైదరాబాద్, వెలుగురాష్ర్టంలో ఎంతమందికి కరోనా వచ్చి పోయిందో తెలుసుకునేందుకు చేపట్టాల్సిన యాంటీబాడీ సర్వే ఇంకా స్టార్ట్ కాలేదు. టెస్టింగ్ కిట్లు, మెషన్లు, అధికార యంత్రాంగమంతా సిద్ధంగా ఉన్నా.. సర్కారు పట్టించుకోవడం లేదు. దాదాపు 3 నెలలుగా వాయిదా వేస్తూ వస్తోంది. అసలు సర్వే ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

3 జిల్లాల్లో రెండుసార్లు ఐసీఎంఆర్ సర్వే

కరోనా వైరస్ వ్యాప్తిని తెలుసుకుని, దాన్ని ఎదుర్కొనే ప్లాన్లు రూపొందించుకునేందుకు దాదాపు అన్ని రాష్ర్టాల్లోనూ ఐసీఎంఆర్‌‌‌‌‌‌‌‌ యాంటీబాడీ సర్వేలు చేయిస్తోంది. మన రాష్ర్టంలోనూ 3 జిల్లాల్లో రెండుసార్లు సర్వే చేయించింది. అయితే రాష్ర్టవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని తెలుసుకునేందుకు ఆయా రాష్ర్టాలు సొంతగా సర్వేలు చేయించుకోవాలని జూన్‌‌‌‌లో సూచించింది. ఇందుకు అనుగుణంగా రాష్ర్టంలోనూ సర్వే చేపట్టాలని ఆఫీసర్లు భావించారు. కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉండే డాక్టర్లు, హెల్త్ స్టాఫ్‌‌‌‌, పోలీసులు, శానిటేషన్ వర్కర్స్, జర్నలిస్టులకు తొలుత యాంటీబాడీ టెస్టులు చేయించాలని నిర్ణయించారు. వైరస్ ముప్పు ఎక్కువగా ఉండే వృద్ధులు, డయాబెటీస్, క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారికి తర్వాత టెస్టులు చేయించాలని భావించారు.

మెషీన్లు రెడీ

ఆర్టీపీసీఆర్, యాంటీజెన్ తరహాలోనే యాంటీబాడీ టెస్టింగ్‌‌‌‌కు కూడా ప్రత్యేకంగా కిట్లు ఉంటాయి. సర్వే కోసం టీఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ఐడీసీ ద్వారా సుమారు 25 వేల యాంటీబాడీ కిట్లను తెప్పించారు. హైదరాబాద్‌‌‌‌లోని ఇన్ స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రాంగణంలో టెస్టులు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన మెషీన్లను తెప్పించి నారాయణగూడలోని ఐపీఎం ల్యాబులో ఇన్‌‌‌‌స్టాల్ చేయించారు. టెక్నీషియన్లకు ట్రైనింగ్ ఇచ్చారు. కొత్తగా తెప్పించిన మిషన్లతో రోజుకు కనీసం వెయ్యి మందికి టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని ఐపీఎం డైరెక్టర్, డాక్టర్ శంకర్ గతంలో ‘వెలుగు’కు వివరించారు.

రిక్వెస్ట్‌కు స్పందిస్తలే.. పర్మిషన్ ఇస్తలే

యాంటీబాడీ సర్వే కోసం పర్మిషన్ ఇవ్వాలని, ఆర్థిక వనరులు సమకూర్చాలని హెల్త్ ఆఫీసర్లు ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టి నెలలు గడుస్తోంది. కానీ ఇంతవరకు సర్కార్ నుంచి పర్మిషన్ రాలేదని ఓ పెద్దాఫీసర్ చెప్పారు. ప్రస్తుతం కరోనా టెస్టులు, కేసులు, డెత్ ల విషయంలో సర్కారు చెబుతున్న లెక్కకు, వాస్తవ లెక్కలకు పొంతన ఉండటం లేదు. ఈ పరిస్థితుల్లో యాంటీబాడీ సర్వే చేస్తే అసలు లెక్కలు బయటపడే ప్రమాదం ఉందన్న వాదన వినిపిస్తోంది. అందుకే యాంటీబాడీ సర్వే చేయాల్నా? వద్దా అని సర్కార్ మల్లగుల్లాలు పడుతోందని డాక్టర్లు చెబుతున్నారు.

Latest Updates