కాపీ కొడితే విలువేముంది..నేనలా చేయను

కార్తికేయ హీరోగా శేఖర్ రెడ్డిదర్శకత్వం లో అశోక్ రెడ్డినిర్మించిన చిత్రం ‘90 ఎంఎల్’. ఈ నెల 5న సినిమా విడుదల కానున్నసందర్భంగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ చెప్పిన విశేషాలు..

  • గతంలో కొన్ని మాస్ సినిమాలు చేసినప్పటికీ  నా కెరీర్​లో పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇదే. ఆరు పాటలు, ఒక బిట్ సాంగ్ ఉన్నాయి. అద్నాన్ సమీ ఒక పాట పాడారు. నేపథ్య సంగీతానికి ప్రాధాన్యత గల చిత్రం. ‘90 ఎంఎల్’ అనే అంశం చుట్టూ అల్లుకున్న ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. కొత్త స్టోరీ లైన్ కానీ కమర్షియల్ ఫార్మాట్‌లో తీశారు.
  • దర్శకుడు చెప్పిన కథే 90 ఎంఎల్ పుచ్చుకున్నంత కిక్ ఇచ్చింది.  రియల్ లైఫ్ కార్తికేయలో చాలా హ్యూమర్ ఉంది. గత చిత్రాల్లోని తన నటనలో అది ఎక్కడా కనిపించలేదు. ఇందులో అతను కొత్తగా కనిపించడానికి ఆ హ్యూమర్ కారణం. అతని డ్యాన్సులు ప్రేక్షకులకు సర్‌‌ప్రైజ్ ఎలిమెంట్స్​.
  • ఇటీవల సినిమాల్లో పాటల సంఖ్య తగ్గుతోంది. కమర్షియల్ మీటర్ ని తు.చ. తప్పక ఫాలో అవుతారు దర్శకుడు శేఖర్ రెడ్డి. అందుకే ఆరు పాటలు కావాలన్నారు. అందుకు తగ్గ సిట్యుయేషన్స్ కూడా సినిమాలో ఉన్నాయి. కార్తికేయ లాంటి హీరోల విషయంలో కథతో పాటు వాళ్ల ఇమేజ్, డ్యాన్సుల్ని కూడా దృష్టిలో ఉంచుకుని సంగీతం ఇస్తాను.
  •  కొన్ని అవుతాయనుకున్న ప్రాజెక్ట్స్ జరగలేదు. అన్నీ నా చేతుల్లో ఉండవు కదా. ‘ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది’ అని నమ్ముతాను. ఒక్కోసారి నేనెంత చక్కని సంగీతం ఇచ్చినా సినిమా హిట్ అవ్వదు. అలాంటప్పుడు బాధేస్తుంది. అంతే తప్ప డిప్రెషన్ ఫీలవ్వను. కెరీర్​లో గ్యాప్ వచ్చినప్పుడు వరల్డ్ మ్యూజిక్ వింటూ చాలా నేర్చుకుంటాను.
  •  సంగీతానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రేక్షకుల్ని సినిమాకి రప్పిస్తోంది. అది గ్రేట్ థింగ్. స్టార్స్ లేని సినిమాకు కూడా సంగీతం నచ్చి థియేటర్స్​కి వస్తున్నారు. నేను చేసిన ఇష్క్, మనం, గుండెజారి గల్లంతయ్యిందే, టెంపర్ లాంటివన్నీ అప్పట్లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్. ఇప్పటి సోషల్ మీడియా ప్రాబల్యం అప్పట్లో ఉండుంటే అవి రికార్డులు క్రియేట్ చేసేవేమో.
  • పిండి కొద్దీ రొట్టెలా మ్యూజిక్​ క్వాలిటీ కూడా ఖర్చును బట్టే వస్తుంది. మిక్సింగ్, ఆర్కెస్ట్రా లాంటి అంశాలతో పాట క్వాలిటీ పెరుగుతుంది. చిన్న సినిమాల విషయంలో నా సంతృప్తి కోసం ఎదురు డబ్బు పెట్టి క్వాలిటీ కోసం ప్రయత్నించిన సందర్భాలున్నాయి.
  • అద్భుతమైన సంగీతం విన్నప్పుడు దాన్నుంచి ఓ ట్యూన్ స్ఫురిస్తుంది. వెంటనే దాన్ని రికార్డ్ చేసి పెట్టుకుని.. అందుకు తగ్గ సిట్యుయేషన్ మ్యాచ్ అయినప్పుడు దాన్ని వాడుతుంటాం. ‘ఇష్క్’లో ప్రియా ప్రియా పాట అలాంటిదే. ఒకే సంగీత దర్శకుడి వంద పాటల్లో ఐదారు పాటలు ఒకేలా వినిపించడం కామన్. కానీ మరొకరి పాటని కాపీ చేయడం సరికాదు. నేను దానికి వ్యతిరేకిని అలా చేస్తే సంగీత దర్శకుడికి విలువ ఏముంటుంది!
  • నేను మాస్ సాంగ్స్ కూడా చేసినప్పటికీ మెలోడీలే ఎక్కువ సక్సెస్ అయ్యాయి. ఆ ప్రభావంతో మాస్ సినిమాలు నా దగ్గరకు ఎక్కువ రాలేదు. ప్రస్తుతం తెలుగులో రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రానికి సంగీతం అందిస్తున్నాను. కొన్ని కన్నడ చిత్రాలకు కూడా వర్క్ చేస్తున్నాను.

Latest Updates