అప్పటివరకూ.. సైలెన్స్ ప్లీజ్

రొటీన్ గ్లామర్ రోల్స్ తగ్గించి కథానాయిక ప్రాధాన్యత గల చిత్రాలపై దృష్టి సారించింది అనుష్క. ఈ క్రమంలో ‘భాగమతి’ తర్వాత ఆమె నుంచి రానున్న చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకుడు. టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మిస్తున్నారు. మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజుతో పాటు  మైఖేల్ మ్యాడిసన్ అనే విదేశీ నటుడు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. షూటింగ్ పూర్తిగా అమెరికాలో జరుగుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ‘సైలెన్స్ పేరుతో విడుదల కానుంది. తాజాగా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌ రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ కూడా ప్రకటించారు. ఈ నెల 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకి ఫస్టు లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే అనుష్క విషయంలో తాజాగా ఓ వివాదం చెలరేగింది. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌లో తీసిన ఫొటో ఒకటి లీకైంది. అందులో అనుష్క కాస్త లావుగా ఉండటంతో కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. దాంతో అలా మాట్లాడటం సరికాదంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ‘సైజ్ జీరో’ చిత్రం తర్వాత కొంత బరువు పెరిగింది అనుష్క. ‘బాహుబలి–2’ ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌లో ఆ మార్పు కనిపించింది. అయితే ఆ మధ్య ఆస్ట్రియాలో వెయిట్ రిడక్షన్ కోసం డిటాక్స్ ప్రోగ్రామ్ తీసుకుంటోందనే ప్రచారం జరిగింది. కొద్ది రోజులకు న్యూట్రిషనిస్ట్‌‌‌‌‌‌‌‌తో కలసి చేసిన ఫొటోషూట్‌‌‌‌‌‌‌‌లో చాలా  నాజూగ్గా కనిపించింది. దీంతో ‘నిశ్శబ్దం’లో ఆమె మునుపటిలా కనిపించబోతోందని అందరూ భావించారు. అందుకే ఎయిర్ పోర్ట్ ఫొటో లీకయ్యాక దీనిపై వెబ్ మీడియాలో రకరకాల కథనాలొచ్చాయి. అవి చూసి బాడీ షేమింగ్ గురించి మాట్లాడటం సరికాదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహుశా ‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్ పోస్టర్ వీటన్నింటికీ చెక్ పెట్టొచ్చేమో. అప్పటివరకూ సైలెంట్‌‌‌‌‌‌‌‌గా వెయిట్ చేద్దాం!

Latest Updates