డబ్బులు ఎక్కడ దాచుకోవాలి

  •                 వడ్డీరేట్లను తగ్గిస్తోన్న ఆర్‌‌బీఐ
  •                 ప్రతిఫలంగా డిపాజిట్ వడ్డీరేట్లకు కోత
  •                 తప్పనిసరవుతున్న ప్రత్యామ్నాయ మార్గాలు

నానాటికీ కొండలా జీవన వ్యయం ఓ వైపు పెరుగుతుంటే, మరోవైపు వడ్డీ రేట్ల తగ్గింపుతో ఆదాయం నానాటికీ కుదించుకుపోతుంటే సీనియర్‌‌‌‌ సిటిజెన్స్‌‌‌‌, రిటైర్డ్‌‌‌‌ ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఎంతో ముందు చూపుతో, ఎవరి మీదా ఆధారపడకుండా జీవితాన్ని సాఫీగా సాగించేయాలనుకునే వారి ఆశలకు గండి పడుతోంది. ఇంకోవైపు మార్కెట్లో స్థిరమైన ప్రతిఫలంతోపాటు, ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు భద్రత కల్పించే ప్రత్యామ్నాయ మార్గాలూ ఇండియాలో అందుబాటులోకి అంతగా రాలేదు. ఏళ్ల తరబడి వడ్డీ రేట్ల పెరుగుదలకు లేదా స్థిరమైన వడ్డీ రేట్లకు అలవాటుపడిన సీనియర్ సిటిజెన్స్‌‌‌‌, రిటైర్డ్‌‌‌‌ ఉద్యోగులు ఇప్పుడు వడ్డీ రేట్ల తగ్గుదలకు అలవాటుపడాలంటే చాలా కష్టమైనదే. తగ్గుతున్న వడ్డీ రేట్లు  ముఖ్యంగా సీనియర్‌‌‌‌ సిటిజెన్స్‌‌‌‌ను  బెంబేలెత్తిస్తున్నాయి. స్థిరమైన ప్రతిఫలం ఆశించి భద్రత ఎక్కువగా ఉండే బ్యాంకులలో ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డిపాజిట్లనే చాలా మంది ఆశ్రయించడం దీనికి ప్రధానమైన కారణం. దేశంలో స్థిరమైన ప్రతిఫలాలిచ్చే పెట్టుబడుల ఆప్షన్స్‌‌‌‌ నిజానికి అంత ఎక్కువగా ఏమీలేవు. బంగారం ధర ఇప్పటికే చుక్కలంటుతుండగా, రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ వైపు కన్నెత్తి చూసే సాహసం చేయడానికీ అవకాశం లేకుండా పోయింది. ఇక స్టాక్‌‌‌‌ మార్కెట్లో ఈక్విటీ పెట్టుబడుల విషయం చెప్పనే అక్కర్లేదు. ఇక్కడ పెట్టిన పెట్టుబడులు నూరు శాతం రిస్క్‌‌‌‌తో కూడుకున్నవనేది అందరికీ తెలిసిందే. మ్యూచువల్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌, కార్పొరేట్‌‌‌‌ బాండ్స్‌‌‌‌ వంటి పెట్టుబడి మార్గాలు కూడా అంతగా ఇండియాలో ఇంకా ఆకర్షణీయంగా మారలేదు.

సామాజిక భద్రతా అంతంత మాత్రమే….

అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా రిజర్వ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ దేశంలోనూ వడ్డీ రేట్లను తగ్గిస్తూ పోతోంది. ఈ వడ్డీ తగ్గింపు ప్రధానంగా రిటైర్డ్‌‌‌‌ ఉద్యోగులు, సీనియర్‌‌‌‌ సిటిజెన్స్ జీవితాలపై పెద్ద ప్రభావమే చూపిస్తోంది. సొంతంగా పనిచేసి సంపాదించే సామర్ధ్యం లేని సమయంలో అక్కరకు వస్తాయనే ఉద్దేశంతో చాలా మంది రిటైర్డ్‌‌‌‌ ఉద్యోగులు, సీనియర్‌‌‌‌ సిటిజెన్స్‌‌‌‌ తమ డబ్బును బ్యాంకులలో (ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులే) ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డిపాజిట్లుగా దాచుకుంటున్నారు. వాటిపై వచ్చే వడ్డీతో తమ నెలవారీ ఆర్థిక అవసరాలను నెరవేర్చుకుంటున్నారు. ఇలాంటి రిటైర్డ్‌‌‌‌ ఉద్యోగులు, సీనియర్‌‌‌‌ సిటిజన్స్‌‌‌‌ ఇప్పుడు అయోమయంలో పడిపోయారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పిల్లలపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో, ఎంతో ముందు చూపుతో ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డిపాజిట్లు చేసుకుని, దానిపై వచ్చే వడ్డీతో భద్రంగా జీవితాన్ని గడిపేయొచ్చనుకున్న వారి ఆశలను, వడ్డీ రేట్ల తగ్గింపు అడియాశలు చేస్తోంది. ప్రభుత్వం వైపు నుంచి రిటైర్డ్‌‌‌‌ ఉద్యోగులు, సీనియర్‌‌‌‌ సిటిజెన్స్‌‌‌‌కు లభించే సామాజిక భద్రతా అంతంత మాత్రమే కావడం వారిలో ఆందోళన పెంచుతోంది.

వరుస బెట్టి వడ్డీరేట్లు తగ్గిస్తోన్న బ్యాంక్‌‌‌‌లు…

రిజర్వ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఆదేశాలతో తాము ఇచ్చే అప్పులపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్న బ్యాంకులు అదే క్రమంలో ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డిపాజిట్లు, సేవింగ్స్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ వడ్డీ రేట్లనూ తగ్గిస్తూ పోతున్నాయి. అప్పులపై వడ్డీ రేట్లు తగ్గడం చిన్న వ్యాపారస్తులు, కొత్తగా ఉద్యోగాలలో చేరిన వారికి వరంగా పరిణమించినా, ఎఫ్‌‌‌‌డీలు, ఎస్‌‌‌‌బీ వడ్డీ రేట్లు తగ్గడం వయసు మళ్లిన వారికి ఇబ్బందికరంగా మారుతోంది. ఇండియాలోని దిగ్గజ బ్యాంకు స్టేట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా (ఎస్‌‌‌‌బీఐ) తన ఎంసీఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ (మార్జినల్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ బేస్డ్‌‌‌‌ లెండింగ్‌‌‌‌ రేట్‌‌‌‌)ను బుధవారం మరోసారి తగ్గించింది. బ్యాంక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ మహారాష్ట్ర ఇదే దారిలో గురువారం తన ఎంసీఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ తగ్గింపు నిర్ణయాన్ని ప్రకటించింది. ఒక రోజు ముందో వెనకో అన్ని బ్యాంకులూ ఈ మార్గంలోనే నడవాలి. గత కొన్ని దశాబ్దాలుగా సీనియర్‌‌‌‌ సిటిజెన్స్‌‌‌‌కు ప్రత్యేక వడ్డీ రేట్లను బ్యాంకులు కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు ఆ వడ్డీ రేట్ల తగ్గింపుకూ తెగబడుతున్నాయి. దీంతో తమ ఆదాయాన్ని పరిరక్షించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడం సీనియర్‌‌‌‌ సిటిజెన్స్‌‌‌‌కు తప్పనిసరవుతోంది. ఈ నేపథ్యంలో కొంతైనా రిస్క్‌‌‌‌తో కూడిన ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆప్షన్స్‌‌‌‌ వైపు చూడటం వారికి తప్పకపోవచ్చని ఫైనాన్షియల్‌‌‌‌ ప్లానర్స్‌‌‌‌ చెబుతున్నారు. ముఖ్యంగా తక్కువ రిస్క్‌‌‌‌తో కూడిన డెట్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌ (రుణ సాధనాలు) కొంత మెరుగైన ప్రత్యామ్నాయమని పేర్కొంటున్నారు.

4.1 కోట్ల మంది అకౌంట్లలో రూ.14 లక్షల కోట్లు…

సీనియర్ సిటిజెన్స్‌‌‌‌, రిటైర్డ్‌‌‌‌ ఉద్యోగుల కోసం ప్రభుత్వమే  చొరవ తీసుకోవల్సి ఉంటుందని ఎస్‌‌‌‌బీఐ ఇటీవల ఒక రిపోర్టులో తెలిపింది.  సీనియర్‌‌‌‌ సిటిజెన్స్‌‌‌‌ సేవింగ్స్‌‌‌‌ స్కీము (ఎస్‌‌‌‌సీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌)లో పెట్టిన పెట్టుబడులపై మరిన్ని పన్ను రాయితీలు కల్పించాలని అభిప్రాయపడింది. ఈ స్కీము కింద 60 ఏళ్లకు పైబడిన వారు గరిష్టంగా రూ. 15 లక్షల దాకా దాచుకోవచ్చు.  ఎస్‌‌‌‌బీఐ తాజా వడ్డీ కోతతో రూ. 50 లక్షల ఎఫ్‌‌‌‌డీపై ఏటా వచ్చే వడ్డీలో రూ. 5,000 కోత పడుతోంది. ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ ఎక్కువగా ఉండటంతోనే కోత తప్పడం లేదని ఎస్‌‌‌‌బీఐ ఈ సందర్భంగా తెలిపింది.  దేశంలోని 4.1 కోట్ల మంది సీనియర్‌‌‌‌ సిటిజెన్‌‌‌‌లు ఏకంగా రూ. 14 లక్షల కోట్లను ఎఫ్‌‌‌‌డీలలో దాచుకున్నారు. ఈ ఎఫ్‌‌‌‌డీలను వారు రెన్యువల్‌‌‌‌ చేసుకునే సమయంలో తక్కువ వడ్డీకే చేసుకోవల్సి వస్తుంది. రెన్యువల్‌‌‌‌ సమయంలో వడ్డీ రేట్ల తగ్గింపు అనుభవంలోకి వస్తే, వారిలో అసంతృప్తి బైటపడుతుందని భావిస్తున్నారు.

తక్కువ వడ్డీరేటుకు అలవాటుపడని ప్రజలు…

రెపో రేటు తగ్గుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లు తగ్గక తప్పదని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు ఉన్నతాధికారి చెప్పారు. రెపో రేటు మరింత తగ్గే సూచనలున్నాయని, మన దేశంలో డిపాజిట్లపై వడ్డీ రేటు 6 శాతం కిందికి వస్తే సామాజికంగా ఇబ్బందులుంటాయని చెబుతూ, ముఖ్యంగా సీనియర్‌‌‌‌ సిటిజెన్స్ పరిస్థితి ఆందోళనకరమవుతుందని ఆ బ్యాంకర్‌‌‌‌ వ్యాఖ్యానించారు. దేశంలో ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ 5 శాతానికి మించి ఉండటంతో, ప్రజలు 8 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేటుకు అలవాటు పడ్డారు. ఇప్పుడు ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ 4 శాతం లోపుకు వచ్చింది కాబట్టి, డిపాజిట్లపై వడ్డీ రేటు 6–7 శాతం మధ్యలో ఉందని మరో బ్యాంకర్‌‌‌‌ అభిప్రాయపడ్డారు.

Latest Updates