ఆంధ్ర అసెంబ్లీని కుదిపేసిన తెలంగాణ నీళ్లు

ఆంధ్రా అసెంబ్లీని తెలంగాణ నీళ్లు కుదిపేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి ‌‌–కృష్ణా లింక్​పై ఏపీలోని అధికార, ప్రతిపక్షాల మధ్య గురువారం సభలో గరంగరం చర్చ నడిచింది. తెలంగాణ గడ్డ నుంచి ఆంధ్రప్రదేశ్​కు నీళ్లు తెస్తామని, ఇందుకు కేసీఆర్ అంగీకరించారని ఏపీ సీఎం జగన్​ ప్రకటించారు. తనకున్న సత్సంబంధాలతోనే కేసీఆర్​ ఔదార్యం చూపిస్తున్నారని, తెలంగాణ భూభాగం మీదుగా గోదావరి జలాలను తరలించి ఏపీలోని కృష్ణా ఆయకట్టును స్థిరీకరిస్తామని చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు. అత్యంత సున్నితమైన జలాల అంశాన్ని జగన్​ తేలికగా తీసుకుంటున్నారని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫైరయ్యారు.   భవిష్యత్తులో తెలంగాణ నుంచి మనకు నీళ్లు రాకుంటే ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు.

ఎందుకంత బాధ

సభలో చర్చ సందర్భంగా ‘‘ఏపీ, తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి తెలంగాణ నుంచి ఏపీకి నీళ్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. తెలంగాణ హద్దుల్లో ఉన్న గోదావరి నీళ్లను  శ్రీశైలం, నాగార్జునసాగర్​కు తెచ్చుకొని రాయలసీమకు, కృష్ణా ఆయకట్టుకు ఇస్తామంటే చంద్రబాబుకు ఎందుకంత బాధ” అని చంద్రబాబును వైఎస్​ జగన్​ ప్రశ్నించారు. గోదావరికి నాలుగు పాయలుంటే, నాసిక్ నుంచి వచ్చే పాయ ఏనాడో ఎండిపోయి తెలంగాణకు చేరడం లేదని, రెండోపాయ ప్రాణహితలో 36 శాతం, మూడో పాయ ఇంద్రావతిలో 26 శాతం మొత్తంగా 65 శాతం గోదావరి జలాలు తెలంగాణకున్నాయని జగన్​ పేర్కొన్నారు. ఏపీకి శబరి పాయ ద్వారా కేవలం11 శాతం, అంటే 500 టీఎంసీలు మాత్రమే దక్కుతున్నాయని చెప్పారు. ఎక్కువ నీటి లభ్యత ఉన్న తెలంగాణ.. దిగువకు నీటిని వదిలితే తప్ప ఏపీకి  దిక్కులేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే  తెలంగాణవాళ్లు 3 టీఎంసీల నీళ్లను తరలించే కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. ఎగువ భాగంలో ఉన్నవాళ్లు ప్రాజెక్టులు కట్టడం.. నీటిని తరలించుకుపోవడం కామన్ అని, అందుకు గొడవలు చేసి, కోర్టులకు వెళ్లి, కేసులు వేస్తే అవి ఏనాటికీ తెగవని పేర్కొన్నారు.

కర్నాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచినా, మహారాష్ట్రలో అడ్డగోలు ప్రాజెక్టులు కట్టినా, తెలంగాణలో కేసీఆర్ కాళేశ్వరం ద్వారా రోజూ 3 టీఎంసీలను లిఫ్ట్ చేసుకొని పోతున్నా ఏపీ ఏమీ  చేసే పరిస్థితి లేదన్నారు. ‘‘ఇప్పడు మనకు కావాల్సింది గొడవలు కాదు. రాష్ట్రాల మధ్య సఖ్యత.. సీఎంల మధ్య సత్సంబంధాలు ఉంటే, కలిసి పనిచేసే గుణం ఉంటే ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుంది. అలాంటి  పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టే  కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేశారు. మనం అడిగిన వెంటనే వాళ్ల రాష్ట్రం నుంచి, వాళ్ల బౌండరీస్ నుంచి గోదావరి నీటిని కృష్ణాకు తరలించేందుకు ఒప్పుకున్నారు’’ అని జగన్ వివరించారు. గోదావరి నీటిని నాగార్జున సాగర్​కు తరలించడం వల్ల  తెలంగాణలోని మహబూబ్​నగర్,  రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సాగునీరు ఇవ్వవచ్చని కేసీఆర్ భావిస్తున్నారని, ఏపీకి సంబంధించి రాయలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా మొత్తం ఎనిమిది జిల్లాల్లోని కృష్ణా ఆయకట్టును స్థిరీకరించే అవకాశముంటుందని పేర్కొన్నారు. ఈ  బృహత్తర పథకానికి రెండు రాష్ట్రాల నడుమ చర్చలు జరుగుతుంటే సంతోషించకుండా, అందులోనూ రాజకీయాలు వెతికే  దిక్కుమాలిన ప్రతిపక్షం ఉండడం దురదృష్టకరమంటూ జగన్ టీడీపీని ఘాటుగా విమర్శించారు.

చంద్రబాబు గాడిదలు కాశాడా

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మూడురోజుల పాటు దీక్ష చేపట్టిన జగన్.. ముఖ్యమంత్రి హోదాలో ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎలా వెళ్లారని చంద్రబాబు నిలదీశారు. దీనికి జగన్​ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సీఎంగా నేను వెళ్లాను. నేను పోయినా పోకపోయినా వాళ్లు బటన్​ నొక్కే వాళ్లు.. ఆన్​ అయ్యేది.. నీళ్లు పోయేవి. ఐదేళ్లు చంద్రబాబు ఇక్కడి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణవాళ్లు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ఆ ప్రాజెక్టు కడుతా ఉంటే చంద్రబాబు ఇక్కడ ఏం గాడిదలు కాశాడు” అని ఆయన ఫైర్​ అయ్యారు.

భవిష్యత్తులో అడ్డుపడితే ఏం చేస్తారు?: చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత సున్నితమైన జలాల అంశాన్ని సీఎం జగన్ చాలా తేలికగా తీసుకుంటున్నారని ప్రతిపక్ష నేత  చంద్రబాబు విమర్శించారు. ఏపీ దగ్గర ఏం లేదు అందుకే తెలంగాణ వద్దకు వెళుతున్నాం అనేలా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీ హక్కులను తెలంగాణకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు జరిగితే ఏపీ, తెలంగాణ..  పాకిస్తాన్​, ఇండియాల మారుతాయని అప్పట్లో జగన్​ అన్నారని, ఇప్పుడేమో మాటమార్చారని దుయ్యబట్టారు. జగన్ తన ఏకపక్ష నిర్ణయాలతో భావితరాల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి తుంగభద్ర, ఎస్ఎల్బీసీల నీటి వాటానే ఏపీకిసరిగా రాలేదన్నారు. తెలంగాణ  భూభాగాల మీద ప్రాజెక్టులు కట్టాక, భవిష్యత్తులో తెలంగాణవాళ్లు తమ భూముల్లోంచి నీటిని ఏపీకి తీసుకెళ్లేందుకు ఒప్పుకోకపోతే ఎలా? అని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టులపై ఏపీకి హక్కులు, వాటాలు లేవంటే, అడ్డుపడితే ఏం చేస్తారని జగన్​ను నిలదీశారు.

తెలంగాణ నుంచి ఏపీకి హక్కుగా రావాల్సిన నీళ్లే రావడం లేదని, ఇలాంటప్పుడు తెలంగాణలో కట్టే ప్రాజెక్టుల నుంచి నీళ్లిస్తారంటే ఎలా నమ్మాలని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై ఏపీ ప్రజల్లో ఆందోళన ఉందని, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. దానికి సీఎం జగన్ కౌంటర్ అటాక్ చేశారు. ఉమ్మడి ప్రాజెక్టులు చేపడితే, వాటికి సంబంధించి  రెండు రాష్ట్రాల నడుమ ఒప్పందాలు జరుగుతాయని స్పష్టత ఇచ్చారు. గోదావరి జలాలను తరలించేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టులకేననీ, ఇన్నేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఈ విషయం కూడా తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

Latest Updates