చంద్రబాబు తీరుపై అనుమానాలున్నాయి: కన్నా

AP BJP leader kanna comments on chandrababu

ఈవీఎంలపై పదే పదే గొడవలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు తీరు పలు  అనుమానాలకు తావిస్తుందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార యంత్రాంగంలో తనకు సంబంధించిన వారినే నియమించిన చంద్రబాబు ఎన్నికలను, ఈవిఎంలను మేనేజ్ చేస్తున్నారన్నారు. సీఎం సమీక్ష సమావేశంలో చంద్రబాబు కలెక్టర్లను పొగడడం చూస్తోంటే అనుమానం కలుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరుపై కేంద్ర ఎన్నికల కమీషన్ పరిశీలన చేయాలని కోరతామని ఆయన తెలిపారు.

నిత్యం అబద్ధాలాడే వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండటం సిగ్గుచేటని కన్నా వ్యాఖ్యానించారు. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో రాష్ట్రంలో మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేశారని ఆరోపించారు. ఈ విషయంలో వారి పార్టీ నేత,  టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి  ఎన్నికల కోసం  రూ.50 కోట్లు ఖర్చుపెట్టామని  బహిరంగంగానే చెబుతున్నారని, దీనిపై విచారణ జరపాలని ఎన్నికల అధికారిని కోరితే ఇంతవరకూ ఎలాంటి స్పందన లేదని కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు.

Latest Updates