అమరావతికే బీజేపీ మద్దతు: కన్నా లక్ష్మీనారాయణ

అమరావతి, వెలుగు: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ జగన్ సర్కారును డిమాండ్ చేశారు. అమరావతికే బీజేపీ మద్దతు ఇస్తుందని తెలిపారు. విశాఖ, రాయలసీమలో రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తామన్న బీజేపీ నేతల ప్రకటనలు వారి వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఇష్టం వచ్చిన చోటుకు రాజధాని తరలించేస్తాం అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆదివారం విజయవాడలోని బీజేపీ ఆఫీసులో  ‘పౌరసత్వ సవరణ చట్టం అపోహలు – వాస్తవాలు’ పేరుతో రూపొందించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. సీఏఏపై వాస్తవాలను తెలిపేందుకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “రాజధానిపై నియమించిన కమిటీలు సీఎం జగన్ ఆలోచనకు అనుగుణంగా రిపోర్టులు ఇస్తున్నాయి. జీఎన్ రావు, బోస్టన్ కమిటీ రిపోర్టులు వాస్తవాల ఆధారంగా తయారు చేసినవి కావు.. వైసీపీ ప్రభుత్వానికి కావాల్సినట్లుగా రిపోర్ట్ రాసిచ్చాయి. అమరావతి రైతుల ఆమోదం లేకుండా రాజధాని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు. రాజధాని ఎక్కడ నిర్మించాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. అమరావతిపై కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఉండదు” అని అన్నారు.

 

Latest Updates