ఏపీ కేబినెట్ భేటీ వాయిదా

ఏపీలో సీఎస్, సీఎంల మధ్య వార్ పీక్స్ కు చేరింది. ఈనెల 10న కేబినెట్ భేటీ నిర్వహిస్తా, ఎవరడ్డుకుంటారో చూస్తానంటూ శపథం చేసిన సీఎం చంద్రబాబుకు షాకిచ్చారు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కేబినెట్ భేటీ వివరాలను ఎలక్షన్ కమిషన్ కు రెండ్రోజుల ముందే సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. కేబినెట్ భేటీని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

ఈనెల 10న కేబినేట్ సమావేశం ఏర్పాటు చేయాలంటూ… సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు నోట్ పంపింది సీఎంఓ. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ఉత్కంఠ కలిగించింది. ఇదే అంశంపై చర్చించేందుకు సీఎంఓ, జీఏడీ పొలిటికల్ కార్యదర్శులతో సమావేశమయ్యారు సీఎస్. ఏపీ సీఈఓ ద్వివేదితోనూ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి మేరకే కేబినెట్ నిర్వహణ ఉంటుందని… అజెండాలో అంశాలపై ఈసీ అనుమతి ఇస్తేనే భేటీ ఉంటుందని సీఎస్ తేల్చిచెప్పారు. ఇక ఎన్నికల కోడ్ ను అనుసరించే మంత్రివర్గ సమావేశం ఉండాలన్నారు సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది. కోడ్ ప్రకారమే నేతలు, అధికారులు నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. 10న జరిగే భేటీని వాయిదా వేయటంతో.. ఈనెల 14న కేబినేట్ భేటీకి ఏర్పాట్లు చేయాలని సీఎస్ కు సూచించారు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ.

Latest Updates