చంద్రబాబు ఢిల్లీ దీక్ష ఖర్చు పై AP కేబినెట్ లో చర్చ

AP cabinet on delhi protest spendings

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీలో చేసిన ధర్మపోరాట దీక్షపై దుష్ప్రచారం జరుగుతోందని సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.10 కోట్ల ఖర్చు చేశారంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు. అది రాష్ట్రం కోసం చేసిన దీక్ష అని అన్నారు. ఇవాళ అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించారు. దీక్షకు అయిన ఖర్చుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఢిల్లీ ధర్మపోరాట దీక్షకు చేసిన ఖర్చు రూ.2.83 కోట్లు. మద్దతుదారులు, నేతలు ఢిల్లీ వచ్చేందుకు రైలుకు రూ.కోటీ 23 లక్షలు, ఏపీ భవన్‌లో ఏర్పాట్లకు రూ. కోటీ 60 లక్షలు ఖర్చయిందని కేబినెట్ చెప్పింది. దీనికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

2011 సెప్టెంబరు 17న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రమోదీ  ‘సద్భావన మిషన్’ పేరుతో మూడు రోజుల పాటు చేసిన ఖర్చు ధర్మపోరాట దీక్ష ఖర్చు కంటే చాలా ఎక్కువ అని బాబు చెప్పారు.

అది ఆయన తన సొంతానికి చేసిన దీక్ష. ఆయన పార్టీ ప్రయోజనాల కోసం చేసిన దీక్ష. ఇది మన ధర్మపోరాటం. ఏపీకి చెందిన ఐదు కోట్ల ప్రజల కోసం చేసిన దీక్ష. రాష్ట్రం  కోసం, రాష్ట్ర ప్రజల కోసం చేసిన దీక్ష అని చంద్రబాబు అన్నారు.

కేబినెట్ లో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు

  • డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలన్న నిర్ణయంపై మంత్రిమండలిలో ఆమోదం. సిమ్ కార్డుతో పాటు 3 ఏళ్ల ఫ్రీ కనెక్టివిటీ.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మండలి ఏర్పాటుకు ఆమోదం. వ్యవసాయ, ఉద్యానవనాల విద్య క్రమబద్ధీకరణకు ఉద్దేశించి ఈ మండలి ఏర్పాటు.
  • పంచాయతీల్లో కంటింజెన్సీ ఉద్యోగులకు జీతాల పెంపు.
  • తిత్లి, పెథాయ్ తుపాన్లలో నష్టపోయిన రైతులకు మిగిలిన పెండింగ్ మొత్తాలు కూడా వెంటనే ఇచ్చేయాలని నిర్ణయం.

Latest Updates