ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు పరిహారం

ap-cm-jagan-decision-rs-7-lakhs-for-farmer-families-who-commit-suicide

సీఎం జగన్ సంచలన నిర్ణయం..

అమరావతి:  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు  సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన జగన్..  కాన్ఫరెన్స్ లో  గత ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.7 లక్షలు పరిహారం అందివ్వనున్నట్టు ప్రకటించారు.

డిస్ట్రిక్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం  2014–2019 వరకూ 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా కేవలం 391 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినట్టుగా రికార్డులు చెప్తున్నాయని జగన్ అన్నారు. గత ప్రభుత్వం ఈ రైతు కుటుంబాలకు పరిహారాన్నినిరాకరించినట్టుగా ఈ రికార్డుల బట్టి అర్థం అవుతోందని ఆయన అన్నారు. వెంటనే వారందరికి పరిహారం అందజేయాల్సిందిగా అధికారులను జగన్ ఆదేశించారు.

ఆయా జిల్లాల్లో డేటాను పరిశీలించి.. అర్హులైన రైతు కుటుంబాలకు వెంటనే పరిహారం ఇవ్వాలని, వారి కుటుంబాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాలని జగన్ తెలిపారు. ఎక్కడైనా సరే… రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే.. వెంటనే కలెక్టర్‌ స్పందించాలని, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని సీఎం అన్నారు. రైతులు కాని, కౌలు రైతులు కాని ఆత్మహత్య చేసుకునే పరిస్థి తిఉన్నప్పుడు కచ్చితంగా కలెక్టర్‌ ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలన్నారు.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు పరిహారం ఇవ్వడమే కాదు, వారికిస్తున్న పరిహారాన్ని వేరొకరు తీసుకోలేని విధంగా ఒక చట్టాన్ని కూడా తేబోతున్నట్టు జగన్ తెలిపారు.

తమది ప్రజల ప్రభుత్వం, మానవత్వం ఉన్న ప్రభుత్వమని.. పాలన కూడా ఆ దిశగానే ఉంటుందని  జగన్ ఈ సందర్భంగా అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల పట్ల సానుభూతితో, మానవీయతతో ఉండాలన్నారు. మనిషే చనిపోయాడు… మనం కూడా తోడుగా లేకపోతే సరైన సందేశం ఇచ్చినట్టు కాదని జగన్ ఈ కాన్ఫరెన్స్ లో తెలిపారు.

Latest Updates