సీఎం నేనా.. ఎలక్షన్ కమిషనరా?

ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వాయిదాపై జగన్ సీరియస్

మాటైనా చెప్పకుండా వాయిదా వేశారని ఫైర్​

మరో 10 రోజుల్లో ఎన్నికలు పూర్తి కావాల్సిందే

అవసరమైతే ఎంతవరకైనా వెళతామన్న సీఎం

రాజ్ భవన్​లో గవర్నర్​ను కలిసి ఫిర్యాదు

అమరావతి, వెలుగు: ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆరు వారాలు వాయిదా వేయడంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వానికి మాటైనా చెప్పకుండా ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు.  “రాష్ర్టానికి సీఎం నేనా… ఎన్నికల కమిషనరా?” అని మండిపడ్డారు. రాష్ర్ట ఎన్నికల కమిషనర్ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. మరో పది రోజుల్లో ఎన్నికలు పూర్తి కావాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఎన్నికల కమిషనర్ నిర్ణయంపై అవసరమైతే ఎంత వరకైనా వెళతామని హెచ్చరించారు.

ఐదు వేల కోట్లకుపైగా కోల్పోతాం: జగన్

కరోనా పేరుతో ప్రభుత్వానికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను సీఎం జగన్ ప్రశ్నించారు. రాష్ర్టంలో కరోనా ప్రభావంపై కనీసం హెల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీతో ఎస్ఈసీ చర్చించలేదన్నారు. చంద్రబాబు తన కులానికి చెందిన వ్యక్తిని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా అపాయింట్ చేశారని, అందుకే ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తోందని, పలు జిల్లాల్లో ఏకగ్రీవాల దిశగా వెళ్తోందనే ఎలక్షన్స్ వాయిదా వేశారని విమర్శించారు. ఈ నెల 31లోపు ఎన్నికలు పూర్తి చేయకుంటే రాష్ర్ట ప్రభుత్వం 14వ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే రూ. 5,182 కోట్లు కోల్పోతుందన్నారు. ఆదివారం విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను జగన్​ కలిసి ఎస్ఈసీపై ఫిర్యాదు చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా నిలదొక్కుకోలేనని అనుకున్న ప్రతిసారి వ్యవస్థలను చంద్రబాబు మ్యానేజ్ చేస్తారని, ఇప్పడు ఎన్నికల కమిషనర్ రూపంలో దాడికి దిగారని విమర్శించారు. ఎన్నికలు వాయిదా వేసే  ఆర్డర్స్ గురించి కనీసం ఆ శాఖ సెక్రటరీకి కూడా తెలియదన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత తొలి మీడియా సమావేశం ఇలాంటి పరిస్థితిలో పెట్టాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తీరు తనను తీవ్రంగా బాధించిందన్నారు. కరోనా వైరస్ నిరోధం వారాలు, నెలలో అయిపోయేది కాదన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా నిరోధక చర్యలు ఏడాది పాటు కొనసాగుతాయని వివరించారు. కరోనా కారణంగానే ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి కలెక్టర్లు, ఎస్పీలను ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. రాష్ర్టంలోని 10,243 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుంటే కేవలం 43 చోట్ల మాత్రమే చెదురుమదురు ఘటనలు జరిగాయని జగన్ చెప్పారు.

ఎస్​ఈసీని బెదిరిస్తారా?: చంద్రబాబు

స్థానిక ఎన్నికలను వాయిదా వేసినందుకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సీఎం జగన్ బెదిరిస్తున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. కరోనా వల్ల లండన్ లోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపేశారని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజల ప్రాణం ముఖ్యం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ను టీడీపీ ప్రభుత్వం నియమించలేదన్నారు. గవర్నర్ సిఫార్సు మేరకు ఆయన నియామకం జరిగిందని చెప్పారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా కాదు రద్దు చేయాలని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కోరారు. ఏపీలో హింసాత్మకంగా జరిగిన ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఎస్ఈసీని కోరారు.

కరోనా వల్లే ఎలక్షన్స్ వాయిదా: ఎస్ఈసీ

కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ చెప్పారు. ఇప్పటికే ప్రకటించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలతోపాటు నోటిఫికేషన్ విడుదల అవ్వాల్సిన పంచాయతీ ఎన్నికలు కూడా వాయిదా వేసినట్లు చెప్పారు. ఆర్టికల్ 243 రూల్ 7 ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో విచక్షణాధికారం ఉపయోగించి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

కరోనాను ప్రధాని నోటిఫైడ్ డిజాస్టర్ గా పేర్కొన్నారని, ప్రజారోగ్యం, ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఏకగ్రీవమైన స్థానాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఎన్నికల కోడ్ యథావిధిగా అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనల ఆధారంగా చిత్తూరు, గుంటూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఎన్నికల విధులను తప్పించామని తెలిపారు. గుంటూరు జిల్లా మాచర్లలో ప్రతిపక్ష ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేపై దాడి చేసిన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చిన సీఐని సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశించారు. శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలు,
తిరుపతి, పలమనేరు, తాడిపత్రి రాయదుర్గం సీఐలను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

For More News..

త్వరలో మిషన్ హైదరాబాద్

మే నుంచి కరెంట్ బిల్లుల పెంపు.. మధ్య తరగతిపై భారం

గుడ్‌న్యూస్.. కరోనా టెస్టులు ఫ్రీ

కట్నం కోసం కరోనా వేధింపులు

Latest Updates