చంద్రబాబుకు షాకిచ్చిన జగన్ ప్రభుత్వం

ఏపీలో ఇసుకు దుమారం
నవంబర్ 14న దీక్షకు చంద్రబాబు
అనుమతి నిరాకరించిన పోలీసులు

విజయవాడ: మాజీ సీఎం చంద్రబాబుకు జగన్ ప్రభుత్వం షాకిచ్చింది. ఇసుక కొరతకు నిరసనగా ఈ నెల 14న విజయవాడలో చంద్రబాబు తలపెట్టిన దీక్షకు ఏపీ సర్కార్ అనుమతి నిరాకరించింది. చంద్రబాబు దీక్షకు విజయవాడలోని ఇందిరా‌గాంధీ మున్సిపల్ స్టేడియంలో అనుమతి ఇవ్వాలని టీడీపీ నేతలు.. విజయవాడ పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్లను కోరారు. అయితే టీడీపీ నేతల విజ్ఞప్తిని పోలీసులు తోసిపుచ్చారు. అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమాలు చేయడానికి అనుమతి ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. ఇందిరా‌గాంధీ స్టేడియంలో దీక్షకు అనుమతి నిరాకరించినప్పటికీ చంద్రబాబు దీక్ష కొనసాగుతుందని టీడీపీ నేతలు వెల్లడించారు. ఇందిరా‌గాంధీ మున్సిపల్ స్టేడియంకు ప్రత్యామ్నాయంగా ధర్నాచౌక్‌ను పరిశీలిస్తున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు.

ఇసుక కొరతతో రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కుదేలయిందని విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. నిర్మాణ రంగంలో పనులు ఆగిపోవడం వల్ల కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహిస్తున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో నవంబర్ 3న లాంగ్ మార్చ్ నిర్వహించారు. రెండు వారాల్లోపు భవన నిర్మాణ కార్మికులకు రూ.50 వేలు ఇవ్వాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ కూడా విధించారు. అంతేకాదు చనిపోయిన కార్మిక కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో చంద్రబాబునాయుడు సైతం నవంబరు 14న దీక్ష చేపట్టాలని నిర్ణయించారు.

Latest Updates