స‌రిహ‌ద్దులో ఘ‌ట‌న.. మ‌న‌సు క‌ల‌చివేసింది: అది మీకూ.. మీ కుటుంబానికీ డేంజ‌ర్

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరారు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. 21 రోజుల పాటు ఎక్క‌డున్న వాళ్లు అక్క‌డే ఉండాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మ‌హ‌మ్మారిని కంట్రోల్ చేసేందుకు ప్ర‌భుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తోంద‌ని, ప్ర‌జ‌లు చేయాల్సింద‌ల్లా ఎవ‌రి ఇంట్లో వాళ్లు ఉండ‌డ‌మేన‌ని చెప్పారు. క‌రోనా క‌ట్ట‌డిపై గుర‌వారం సాయంత్రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నిన్న హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన ఏపీకి చెందిన విద్యార్థులు, ఉద్యోగుల‌ను రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో ఆపేయాల్సి రావ‌డం త‌న మ‌న‌సును క‌ల‌చివేసింద‌ని అన్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో జాగ్ర‌త్త గా ఉండ‌డం త‌ప్ప‌ద‌న్నారు.

రాష్ట్రంలోకి వ‌చ్చిన‌వాళ్ల‌కు క్వారంటైన్ త‌ప్ప‌దు

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని క‌ట్ట‌డి చేయాలంటే ఎక్క‌డ ఉన్న‌వాళ్లు అక్క‌డే ఉండాలని, అటూ ఇటూ ప్ర‌యాణాలు చేయ‌డం వ‌ల్ల సిటీల నుంచి ప‌ల్లెల‌కు కూడా వైర‌స్ ను వ్యాప్తి చేసిన‌ట్ల‌వుతుంద‌ని చెప్పారు జ‌గ‌న్. ఇలా రావ‌డం వ‌స్తున్న వారితో పాటు వారి కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా డేంజ‌ర్ అని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్క‌డివాళ్లు అక్క‌డే ఉండాల‌ని పిలుపునిచ్చారు. నిన్న‌టి ఘ‌ట‌న చూశాక‌ మ‌న‌వాళ్ల‌ను కూడా మ‌నం చిరున‌వ్వుతో ఆహ్వానించే ప‌రిస్థితి లేదా అని మ‌న‌సుకు చాలా బాధేసింద‌ని చెప్పారు. కానీ కొంచెం క‌ష్ట‌మైనా అందరూ స‌హ‌క‌రించాల‌ని కోరారు. నిన్న 44 మందిని, ఇవాళ మ‌రో 152 మందిని స‌రిహ‌ద్దు దాటి రానిచ్చి క్వారంటైన్ చేశామ‌ని, ఇది త‌ప్ప‌ద‌ని చెప్పారు. నేరుగా ఇళ్ల‌కు పంపించేస్తే ఎవ‌రు ఎంత‌మందితో కాంటాక్ట్ అవుతారో.. వైర‌స్ పొర‌బాటున ఎంత‌మందికి వ్యాపిస్తుందో గుర్తించ‌డం చాలా క‌ష్ట‌మ‌వుతుంద‌ని, ఆ ప‌రిస్థితి వ‌స్తే క‌రోనా కంట్రోల్ త‌ప్పిపోతుంద‌ని, జ‌రిగే ప‌రిణామాల‌ను ఊహించ‌లేమ‌ని అన్నారు సీఎం జ‌గ‌న్.

కేసీఆర్ ఆప్యాయంగా మాట్లాడారు

ప‌క్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్లు ఎక్క‌డివాళ్లు అక్క‌డే ఉండాల‌ని కోరారు సీఎం జ‌గ‌న్. అక్క‌డ ఏదైనా నిత్య‌వ‌స‌రాలు, వ‌స‌తి స‌హా ఏ స‌మ‌స్య వ‌చ్చినా హెల్ప్ లైన్ నంబ‌ర్ కు ఫోన్ చేస్తే వెంట‌నే అక్క‌డి ప్ర‌భుత్వాలు చూసుకుంటాయ‌ని చెప్పారు. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం క‌చ్చితమైన ఆదేశాలు ఇచ్చింద‌న్నారు. ఈ విష‌యంపై నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాట్లాడాన‌ని, ఆయ‌న చాలా ఆప్యాయంగా ఏ స‌మ‌స్య లేకుండా చూసుకుంటాన‌ని హామీ ఇచ్చార‌ని చెప్పారు. ద‌య‌చేసి ఎక్క‌డి వాళ్లు అక్కడే ఉండాల‌ని చేతులు రెండూ జోడించి విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌ని అన్నారు సీఎం జగ‌న్. రాష్ట్రంలోనూ ఒక్ జిల్లా నుంచి మ‌రో జిల్లాకు, ప‌క్క పక్క గ్రామాల‌కు కూడా ప్ర‌యాణాలు చేయొద్ద‌ని కోరారు.

వాలంటీర్లు, ఆశా వ‌ర్క‌ర్ల‌కు హాట్సాఫ్..

ప్ర‌స్తుతానికి రాష్ట్రంలో 10 కేసులు పాజిటివ్ వ‌చ్చాయ‌ని, మ‌నం స్వీయ నియంత్ర‌ణ పాటించ‌కుండా వ‌దిలేస్తే ఎంత భారీగా క‌రోనా బాధితులు పెరిగిపోతారో చెప్ప‌లేమ‌ని అన్నారు సీఎం జ‌గ‌న్. ఈ ప‌ది పెర‌గ‌కుండా ఉండాలంటే అంద‌రం ఒక్క‌టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బ‌య‌టి దేశాల నుంచి వచ్చి ఉంటున్న‌వారిని వాలంటీర్లు, ఆశా వ‌ర్క‌ర్లు స‌ర్వే చేసి గుర్తించారని, ఇప్ప‌టి వ‌ర‌కు 27819 మంది ఉన్న‌ట్లు తేలింద‌ని, వారంద‌రినీ సర్వైలెన్స్ లో పెట్టామ‌ని చెప్పారు సీఎం జ‌గ‌న్. వీళ్లే కాకుండా ప్ర‌తి ఇంట్లో ఎంత మంది జ‌లుబు, జ్వ‌రం, ద‌గ్గు, గొంతు నొ్ప్పి, ఊపిరి తీసుకోవ‌డంలో స‌మ‌స్య‌ లాంటి వాటితో ఇబ్బంది ప‌డుతున్నార‌న్న దానిపైనా సర్వే చేయిస్తున్నామ‌ని, ప్ర‌తి ఒక్క‌రినీ గుర్తించి చికిత్స చేయిస్తామ‌ని చెప్పారు జ‌గ‌న్. ఎవ‌రూ చేయ‌లేని ప‌నులు చేస్తున్న డాక్ట‌ర్లు, వైద్య సిబ్బంది, గ్రామ స‌చివాల‌య సిబ్బంది, ఆశా వ‌ర్క‌ర్లు, వాలంటీర్లు, పోలీసులు, శానిట‌రీ సిబ్బందికి మ‌నస్ఫూర్తిగా హాట్సాఫ్ చెబుతున్నాన‌ని అన్నారు. ఎవ‌రూ చేయ‌లేని గొప్ప సేవ వీళ్లు చేస్తున్నార‌ని అన్నారు.

రైతులు ప‌నులు చేసుకోవాలంటే..

ఏవైనా అనుకోని ప‌రిస్థితులు త‌లెత్తితే ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు సీఎం జ‌గ‌న్. ప్ర‌తి జిల్లాలోనూ 200 బెడ్స్ ఐసోలేష‌న్ వార్డులు, ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో 100 క్వారంటైన్ బెడ్స్ ఏర్పాటు చేశామ‌ని, రాష్ట్రంలో క‌రోనా కోస‌మే ప్ర‌త్యేకంగా విజ‌య‌వాడ‌, విశాఖ‌, నెల్లూరు, తిరుప‌తిల్లో నాలుగు హాస్పిట‌ళ్లు రెడీగా ఉంచామ‌ని తెలిపారు. ఎలాంటి విష‌మ ప‌రిస్థితి రాకుండా అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని, ఎవ‌రి ఇంట్లో వాళ్లుండాల‌ని కోరారు సీఎం జ‌గ‌న్. అయితే రైతులకు పంట చేతికొచ్చే స‌మ‌య‌మ‌ని, ఈ టైంలో ప‌న‌లు చేసుకోవాల్సి వ‌స్తే వెళ్లొచ్చ‌ని, కానీ త‌ప్ప‌నిస‌రిగా ఒక‌రికొక‌రు సామాజిక దూరాన్ని పాటించాల‌ని సూచించారు.

Latest Updates