కాలేజ్ నుంచి డైరెక్ట్ గా జాబ్‌‌‌‌కు పంపుతాం: ఏపీ సీఎం జగన్

స్కిల్​ టెస్ట్​ పాసైతేనే చేతికి డిగ్రీలు

అమరావతి, వెలుగు: పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ ను విద్యార్థులకు నేర్పించి కాలేజ్ నుంచి డైరెక్ట్ గా ఉద్యోగానికి పంపుతాపమని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దీని కోసం స్కిల్​ డెవలప్ మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగం పెరగడానికి కారణం స్కిల్స్​ లేకపోవడమేనని అన్నారు. డిగ్రీ, బీటెక్​, ఐటీఐ కోర్సులతోపాటు అందరికీ స్కిల్స్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న కోర్సులకు అదనంగా మరో ఏడాది అప్రెంటిషిప్​అందిస్తామన్నారు. దీని కోసం కోర్సుల కాలవ్యవధిని మరో ఏడాది పొడిగించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

ఏపీలోని 25 పార్లమెంట్​ నియోజకవర్గాల్లో ఒక్కో స్కిల్​ డెవలప్​మెంట్​ కాలేజ్​ ఏర్పాటు చేస్తామన్నారు. వీటి ద్వారా ఫైనలియర్​ విద్యార్థులకు సంబంధిత కోర్సుకు చెందిన పారిశ్రామిక శిక్షణ ఇస్తామని చెప్పారు. ఏడాదిపాటు సాగే ఈ అప్రెంటిషిప్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ క్వాలిఫై కావాలని లేకుంటే మరికొంత కాలం గడువు పొడిగిస్తామన్నారు. అప్రెంటిషిప్​ శిక్షణలో పాసైతేనే ఫైనలియర్​పరీక్షలు రాయిస్తామని చెప్పారు. స్కిల్​ డెవలప్​మెంట్, ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేకంగా ఒక ఐఏఎస్​ అధికారిని నియమిస్తున్నట్లు చెప్పారు. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన శాఖలను ఒకే గొడుగు కిందకు తెస్తామని ప్రకటించారు.

శుక్రవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్య, నిరుద్యోగం, ఉపాధి శిక్షణపై ఉన్నతాధికారులతో వైఎస్ జగన్ సమీక్షించారు. విద్యార్థులు మారుతున్న టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. ఏడాది పాటు ఇచ్చే శిక్షణలో ఉద్యోగం, ఉపాధి పొందడమే లక్ష్యంగా కోర్సులను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచానికి అవసరమైన బెస్ట్​ హ్యూమన్​ రిసోర్స్​ను అందించాలని ఆకాక్షించారు. స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ, అనుబంధ కాలేజీల ఏర్పాటుపై నెల రోజుల్లోగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎన్‌‌‌‌‌‌‌‌ఏసీ ( నేషనల్‌‌‌‌‌‌‌‌ అకాడమీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ కనస్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌) తరహా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్థానికంగా అందుబాటులో ఉన్న మానవ వనరులను ఉపయోగించుకునేలా ప్రభుత్వ శాఖలు ఓలా, ఉబర్‌‌‌‌‌‌‌‌ తరహాలో యాప్‌‌‌‌‌‌‌‌ రూపొందించాలని ఆదేశించారు. గ్రామ సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌ స్థాయిలో మ్యాపింగ్‌‌‌‌‌‌‌‌ జరగాలన్నారు. ప్లంబర్‌‌‌‌‌‌‌‌, మెకానిక్‌‌‌‌‌‌‌‌, డ్రైవర్‌‌‌‌‌‌‌‌ లాంటి వాళ్లకు ఈ యాప్​ ద్వారా స్థానికంగానే ఉపాధి కల్పించాలని సూచించారు.

AP CM Jagan said that students should be send them directly from college to job

Latest Updates