నకిలీ ఔషధాలపై సీఎం జ‌గ‌న్ కొరడా.. జరిమానా విధించేలా నిబంధనలు

అమరావతి: డ్రగ్‌ కంట్రోల్‌పై ఏపీ సీఎం వైయస్‌.జగన్ సోమ‌వారం సమీక్ష నిర్వ‌హించారు. మార్కెట్లో నకిలీ మందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో డైరెక్టర్‌ జనరల్, డ్రగ్స్‌ అండ్‌ కాపీరైట్‌ రవిశంకర్‌ నారాయణ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 285కిపైగా డ్రగ్‌ తయారీ యూనిట్లు, 34వేలకుపైగా ఔషధాలు అమ్మే దుకాణాలున్నాయని అధికారులు సీఎం కు తెలిపారు. అయితే వాటిలో ప‌రిమిత సంఖ్య‌లో సిబ్బంది ఉన్నార‌ని , ల్యాబ్‌ కెపాసిటీ కూడా స్వల్పంగా ఉందని, నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరముంద‌ని వారు వెల్ల‌డించారు.

దీనిపై స్పందించిన సీఎం.. డ్రగ్‌ కంట్రోల్‌ కార్యకలాపాలు బలోపేతంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే నకిలీ ఔషధాలను అరికట్టాల్సిందేన‌ని, అందుకు కఠినమైన నిబంధనలు తీసుకు రావాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే డ్రగ్‌ తయారీ యూనిట్లు, ఔషధ దుకాణాలపై జరిమానాలు విధించేందుకు వీలుగా చట్టంలో నిబంధనలు తీసుకురావాలన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గొప్ప విధానాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. థర్డ్‌ పార్టీ తనిఖీలు జరిగేలా చూడాలన్నారు. ఆ 34వేల మందుల దుకాణల వద్దే కంప్లైంట్‌ ఎవరికి చేయాలి? ఏ నంబర్‌కు చేయాలన్న సమాచారాన్ని ఉంచాలన్నారు. డ్రగ్‌ తయారీ యూనిట్లలోనూ నాణ్యతపై దృష్టి పెట్టాలన్నారు. విజయవాడలో ఉన్న ల్యాబ్‌తోపాటు కొత్తగా నిర్మాణంలో ఉన్న కర్నూలు, విశాఖపట్నం ల్యాబ్‌ల్లో సామర్ధ్యం పెంపునకు సీఎం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న మందులపైనా కూడా క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని వై.ఎస్.జ‌గ‌న్ అన్నారు. నకిలీ మందుల కట్టడి కోసం డ్రగ్‌ కంట్రోల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ఏర్పాటు చేయాల‌ని నిర్ణయంచారు. నకిలీ మందుల తయారీ, విక్రయం, నాణ్యత లేని మందుల తయారీ విక్రయంపై సమాచారమిచ్చే వారికి రివార్డులు అందించాలని జగన్‌ సూచించారు. అలాగే ప్రజల నుంచి, ఇతరత్రా వ్యక్తులనుంచి నిరంతర ఫిర్యాదులు స్వీక‌రించేలా.. వచ్చే ఫిర్యాదులు డిజిటిల్‌ పద్ధతిలో నిక్షిప్తమ‌య్యేలా చూడాల‌న్నారు. ఫిర్యాదుల‌పై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు నివేదించాల‌న్నారు. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులకు, సిబ్బందికి పూర్తిస్థాయి పరిజ్ఞానంపై , కొత్త ప్రొసీజర్స్‌పై పూర్తి అవగాహన క‌ల్పించేలా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేయాల‌న్నారు. నెల రోజుల్లో పై అంశాలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తీసుకురావాలని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

Latest Updates