ఏపీలో అక్టోబ‌ర్ 15నుంచి కాలేజీలు ప్రారంభం ..సెప్టెంబ‌ర్ లో ఎంట్ర‌న్స్ టెస్ట్ లు

ఏపీ సీఎం జ‌గ‌న్ రాష్ట్రంలో ఉన్న‌త విద్యా విధానంపై ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అక్టోబరు 15న కాలేజీలు తెరవాలని, అందుకు సంబంధించిన సెట్ ల ఎంట్ర‌న్స్ టెస్ట్ ల‌ను సెప్టెంబరులో జ‌రిపేందుకు స‌న్న‌ద్ధం కావాల‌ని సూచించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ ఉన్నత విద్యలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ను 90 శాతానికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఈస‌మీక్ష‌లో పాఠ్య ప్రణాళికలో మార్పులు చేస్తూ మూడేళ్ల డిగ్రీ కోర్సులో 10 నెలల అప్రెంటిస్‌షిప్ తో పాటు దీనికి అదనంగా ఒక ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అంశాలపై శిక్షణ ఇవ్వ‌నున్నారు. అలా నైపున్యాభివృద్ధి, ఉపాధి అంశాల‌పై శిక్ష‌ణ పూర్తిచేసిన విద్యార్ధుల‌కు మాత్రమే డిగ్రీ ఆనర్స్‌గా పరిగణిస్తామని తెలిపారు.

వృత్తి విద్యా డిగ్రీలకు సంబంధించి 4 ఏళ్లలో కూడా 10 నెలలు తప్పనిసరి అప్రెంటిస్‌షిప్‌ ఉంటుందన్నారు. దీనికి అదనంగా 20 అడిషనల్‌ క్రెడిట్స్‌ సాధించేవారికి కూడా ఆనర్స్‌ డిగ్రీ ఇవ్వాలని ఆదేశించారు.

ఈ సమీక్ష‌లో పాల్గొన్న విద్యాశాఖ అధికారులు యూనివ‌ర్సిటీ ఏర్పాటు పై సీఎం జ‌గ‌న్ తో చ‌ర్చించారు. కర్నూలులో క్లస్టర్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు.

దీంతో పాటు కడపలో ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీకి, తెలుగు, సంస్కృతం అకాడమీల ప్రారంభానికి అనుమ‌తి, కురుపాంలో ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ పనులు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో యూనివర్శిటీలు పెట్టేందుకు చర్యల‌పై చ‌ర్చించారు.

పాడేరులో ట్రైబల్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపిన జ‌గ‌న్.. ఖ‌చ్చిత‌మైన నిధుల కేటాయింపుతో వచ్చే మూడు నాలుగేళ్లలో వాటి నిర్మాణాలు పూర్తి చేయాల‌ని అధికారులు సూచించారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న యూనివ‌ర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1110 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు.

Latest Updates