గోదావరి నీళ్లపైనా ఏపీ పేచీ

తమకే ఎక్కువ కేటాయింపులు ఉన్నాయంటూ కొత్త లొల్లి

తెలంగాణకు 967.14 టీఎంసీలు ఉన్నట్టు శ్రీకృష్ణ కమిటీకి నివేదిక

ఇప్పుడేమో 650 టీఎంసీలేనని వాదన

మిగులు జలాల్లో ఎక్కువ వాటా కోసమే పంచాయితీ?

హైదరాబాద్‌‌, వెలుగు: ఇప్పటికే కృష్ణా నీళ్లన్నీ మళ్లించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ.. కొత్తగా గోదావరి జలాలపైనా పంచాయితీ మొదలుపెట్టింది. గతంలో శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్‌‌లో చెప్పినట్టుగా తెలంగాణకు 967.14 టీఎంసీల కేటాయింపులు లేవని.. కేవలం 650 టీఎంసీలు మాత్రమే దక్కుతాయని లొల్లి లేవనెత్తింది. ఇంతకుముందు గోదావరి బోర్డుకు ఈ వాదనతో కంప్లైంట్‌ చేసిన ఏపీ.. ఇటీవల కేంద్రం నిర్వహించిన ఎన్‌ డబ్ల్ యూడీఏ మీటింగ్‌ లోనూ ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు 1,480 టీఎంసీల కేటాయింపులు ఉండగా.. ఏపీలోని ధవళేశ్వరం, పోలవరం ప్రాజెక్టులకే 776 టీఎంసీల వినియోగం ఉందని, తెలంగాణకు మిగతా వాటా మాత్రమే దక్కుతుందని పేర్కొంది. పోలవరం కుడి కాల్వ నుంచి కృష్ణా డెల్టా, రాయలసీమ, నెల్లూరు జిల్లాలు, ఎడమ కాల్వ నుంచి ఉత్తరాంధ్రకు అడ్డగోలుగా నీళ్లు తరలించుకునేందుకే ఏపీ కొత్తగా వివాదాన్ని లేవనెత్తుతోందని తెలంగాణ ఇంజనీర్లు చెప్తున్నారు .

తెలంగాణ లిఫ్ట్‌‌లన్నీ అక్రమమట

మహానది–గోదావరి– కావేరి అనుసంధానంపై ఇటీవల నిర్వహించిన ఎన్‌ డబ్ల్ యూడీఏ మీటింగ్‌ లో గోదావరిలో నీటి కేటాయింపులపై ఏపీ అడ్డగోలు వాదనలు చేసింది. ఉమ్మడి ఏపీలోని ధవళేశ్వరం, పోలవరం ప్రాజెక్టుల కింద ఏపీలో 776 టీఎంసీల వినియోగం ఉందని తెలిపింది. ఉమ్మడి అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్‌ లో, శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్టులో తెలంగాణకు 967.14 టీఎంసీల కేటాయింపు ఉన్న విషయాన్ని పేర్కొన్నారని మన అధికారులు స్పష్టం చేసినా.. ఏపీ అడ్డు తగిలింది. కాళేశ్వరం సహా గోదావరిపై తెలంగాణ చేపట్టిన అన్ని లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు అక్రమేనని ఆరోపించింది. మిగులు జలాల్లోనూ తాము చేపట్టిన ప్రాజెక్టుల అవసరాలు తీరాకే కావేరికి నీటిని తరలించే ప్రాజెక్టులు చేపట్టాలంది.

ఎందుకీ వివాదం?

జస్టిస్‌ బచావత్‌ నేతృత్వం లోని గోదావరి వాటర్‌‌ జలాల వివాదాలను ‌ ట్రిబ్యునల్‌ .. ప్రాజెక్టుల వారీగా కాకుండా గోదావరిలో సబ్‌ బేసిన్‌ ల వారీగా కేటాయింపులు చేసింది. అప్పటికి గోదావరిలో నీటి లభ్యత ఎక్కువగా ఉండటం, వివాదాలు లేకపోవడంతో ఆ రకంగా పంచింది. తెలంగాణ భూభాగంలో ఎక్కువ సబ్‌ బేసిన్‌ లు ఉండటంతో వాటిని లెక్కలోకి తీసుకొని 967.14 టీఎంసీలు దక్కుతాయని 2009లో శ్రీకృష్ణ కమిటీకి నివేదిక కూడా ఇచ్చారు . నీటి కేటాయింపుల్లో ట్రిబ్యునల్‌ ఏర్పడే నాటికి పర్మిషన్‌ ఉన్న ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులనే లెక్కించాలని.. శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్టును ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ఏపీ ప్రశ్నిస్తోంది.

మిగులు జలాల కోసమే..

పోలవరం నుంచి కృష్ణా, పెన్నా, వంశధార బేసిన్‌ లకు ఆరేడు వందల టీఎంసీల నీళ్లు మళ్లించుకునేందుకు ఏపీ పలు ప్రాజెక్టులు చేపడుతోంది. కరువు ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రకు నీళ్లిచ్చే ఈ ప్రాజెక్టులకు సాయం చేయాలంటూ ఏపీ ఇప్పటికే నీతి ఆయోగ్‌ ను కోరింది. అక్రమంగా నీళ్లన్నీ వాడుకునే ఆ ప్రాజెక్టులను ఆపాలని తెలంగాణ సర్కారు ఇప్పటికే గోదావరి బోర్డుకు కంప్లైంట్‌ చేసింది. అయితే గోదావరి బేసిన్‌ లో చిట్టచివరి రాష్ట్రమైన ఏపీకి.. కిందికొచ్చే వరదలో వీలైనంత ఎక్కువగా మళ్లించుకోవడానికి చాన్స్​ ఉంది. కానీ దీన్ని లీగలైజ్‌ చేసుకోవడానికే నికర జలాల్లో పంచాయితీని తెరపైకి తీసుకువస్తోంది. కేవలం రెండు ప్రాజెక్టులకే ఏకంగా సగానికిపైగా నీటి కేటాయింపులున్నాయని వాదిస్తోంది.

Latest Updates