జూలై 27 నుంచి 31 వ‌ర‌కు ఎంసెట్.. 25న ఐసెట్

క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డి కోసం అమ‌లు చేస్తున్న లాక్ డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డిన ఉన్న‌త విద్యా కోర్సుల ప్ర‌వేశ ప‌రీక్ష‌లను జూలైలో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది ఏపీ ప్ర‌భుత్వం. ఎంసెట్ స‌హా ఇత‌ర ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీల‌ను బుధ‌వారం ప్ర‌క‌టించింది ఏపీ ఉన్న‌త విద్యా మండ‌లి. జూలై 27 నుంచి 31 వ‌ర‌కు ఐదు రోజుల పాటు ఎంసెట్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించింది. ఇంట‌ర్ పూర్తయిన విద్యార్తులు ఇంజ‌నీరింగ్, అగ్రిక‌ల్చ‌ర్, డెంట‌ల్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు సంబంధించి ఆయా కేట‌గిరీని బ‌ట్టి వేర్వేరు రోజుల్లో ప‌రీక్ష ఉంటుంది. వాస్త‌వానికి ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఎంసెట్‌ నిర్వహించాల్సి ఉండగా లాక్ డౌన్ కార‌ణంగా వాయిదావేశారు. అయితే జాతీయ స్థాయిలో జ‌రిగే ప్ర‌వేశ ప‌రీక్ష‌లు జేఈఈ మెయిన్ ను జూలై 18 నుంచి 23 వ‌ర‌కు, నీట్ ను జూలై 25న నిర్వ‌హించాల‌ని నిన్న కేంద్రం ప్ర‌క‌టించింది. దీంతో ఏపీ ప్ర‌భుత్వం కూడా ఉన్న‌త విద్యా ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీల‌ను అనౌన్ చేసింది.

 

ఏపీలో డిగ్రీ పూర్తి చేసుకోబోతున్న విద్యార్థుల‌కు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే ఐసెట్ ను జూలై 25న పెట్టాల‌ని ఉన్న‌త విద్యా మండ‌లి నిర్ణ‌యించింది. అలాగే పాలిటెక్నిక్ పూర్త‌యిన‌ విద్యార్థుల‌కు నేరుగా బీటెక్ సెకండియ‌ర్ లో ప్ర‌వేశాలు క‌ల్పించే ఈసెట్ ను జూలై 24న‌, బీటెక్, బీఈ నుంచి ఎంటెక్, ఎంఈ ప్ర‌వేశాల కోసం పీజీఈసెట్ ను ఆగ‌స్టు 2 నుంచి 4వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు తెలిపారు ఏపీ ఉన్న‌త విద్యా మండ‌లి కార్య‌ద‌ర్శి సుధీర్ ప్రేమ్ కుమార్. బీఈడీ ప్ర‌వేశాల‌కు సంబంధించిన‌ ఎడ్ సెట్ ను ఆగ‌స్టు 5న‌, లా కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు లాసెట్ ను ఆగ‌స్టు 6న‌, ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ కోర్సులో ప్ర‌వేశాల‌కు సంబంధించిన పీఈసెట్ ఫీల్డ్ టెస్టును ఆగ‌స్టు 7 నుంచి 9 వ‌ర‌కు పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Latest Updates