కృష్ణా బోర్టుకు నీళ్ల లెక్క చెప్పని ఏపీ

  •                 కృష్ణా బోర్డుకు యుటిలైజేషన్‌‌ వివరాలు చెప్పని ఏపీ
  •                 బోర్డు ఒత్తిడితో తప్పుడు లెక్కలు చెప్పిన ఏపీ ఇంజనీర్లు
  •                 ఆధారాలతో సహా తిప్పికొట్టిన తెలంగాణ ఇంజనీర్లు
  •                 సాగర్‌‌ ఎడమ కాలువ లెక్కలు మాత్రమే కొలిక్కి
  •                 పోతిరెడ్డిపాడు, కేసీ కెనాల్‌‌, కృష్ణా డెల్టాపై తేలని పంచాయితీ

కృష్ణా బోర్డు మీటింగ్‌‌లో ఏపీ తప్పుడు లెక్కలతో అడ్డంగా దొరికిపోయింది. మొదట నీటి లెక్కలే చెప్పమంటూ మొండికేసిన ఏపీ ఇంజినీర్లు.. బోర్డు పట్టుబట్టడంతో చివరికి వాడుకున్న నీటి లెక్కలను రాతపూర్వకంగా అందజేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ నుంచి అక్టోబర్‌‌ 4 వరకు 112 టీఎంసీలే తీసుకున్నామని ఏపీ చెప్పగా.. టెలిమెట్రీల పరిశీలనలో 130.50 టీఎంసీలు తీసుకున్నట్టుగా తేలిందని తెలంగాణ వాదించింది. తాము మరో 3 టీఎంసీలు మాత్రమే అదనంగా తీసుకున్నామని ఏపీ వివరించింది.గురువారం జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం మెంబర్‌‌ సెక్రటరీ పరమేశం అధ్యక్షతన జరిగింది. తెలంగాణ, ఏపీ కృష్ణా బేసిన్‌‌ ప్రాజెక్టుల ఇంజినీర్లు పాల్గొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌, కర్నూల్‌‌-కడప కెనాల్‌‌, సాగర్‌‌ ఎడమ కాలువ, కృష్ణా డెల్టా స్కీం నీళ్ల లెక్కలపై సమావేశంలో చర్చించారు.

తేలని పంచాయితీ

కర్నూల్‌‌-కడప కెనాల్‌‌ నుంచి 19 టీఎంసీలే తీసుకున్నామని ఏపీ చెప్పగా 27.50 టీఎంసీలు తీసుకుందని తెలంగాణ లెక్కలు ముందు పెట్టింది. అదనంగా మరో రెండు టీఎంసీలే వాడుకున్నామని ఏపీ ఒప్పుకుంది. పోతిరెడ్డిపాడు, కేసీ కెనాల్‌‌ల నుంచి చెప్పిన లెక్కలకు మించి 5 టీఎంసీలు వాడుకున్నట్టు కూడా బోర్డు ఎదుట అంగీకరించింది. కృష్ణా డెల్టా స్కీంకు 21 టీఎంసీల గోదావరి నీళ్లను తరలించామని ఏపీ వింత వాదనను తెరపైకి తెచ్చింది. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీళ్లు సముద్రంలోకి పోతుంటే పట్టిసీమ ద్వారా 21 టీఎంసీలను ఎత్తిపోశామని ఏపీ యుటిలైజేషన్‌‌ లెక్కల్లో చూపించడాన్ని తెలంగాణ తప్పుబట్టింది. 21 టీఎంసీల కృష్ణా నీళ్లను అదనంగా పొందేందుకే ఏపీ తప్పుడు లెక్కలు చెప్తోందని తెలంగాణ ఇంజనీర్లు మండిపడ్డారు. సాగర్‌‌ ఎడమ కాలువ నుంచి 29 టీఎంసీలు విడుదల చేయగా, అందులో 18 టీఎంసీలను తెలంగాణ, 11 టీఎంసీలను ఏపీ వాడుకున్నాయి. సాగర్‌‌ ఎడమ కాలువ లెక్కలపై మాత్రమే ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకారం తెలుపగా, పోతిరెడ్డిపాడు, కేసీ కెనాల్‌‌, కృష్ణా డెల్టా సిస్టం లెక్కలు తేలకుండానే భేటీ ముగిసింది. ఏపీ ఇప్పటి వరకు 6 శాతం నీటిని ఎక్కువగా వాడుకోగా, తెలంగాణ 6 శాతం నీటిని తక్కువగా వాడుకుంది. తెలంగాణకు 59 టీఎంసీలు కేటాయించగా ఇప్పటి వరకు 40 టీఎంసీలను మించి వాడుకోలేకపోయింది. నవంబర్‌‌ నెలాఖరు వరకు 150 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ కోరగా, 79 టీఎంసీలు కావాలని తెలంగాణ ఇండెంట్‌‌ అందజేసింది. ఈ ఇండెంట్లపై శుక్రవారం రిలీజ్‌‌ ఆర్డర్‌‌ ఇచ్చే అవకాశముంది.

15న కేఆర్‌‌ఎంబీ మీటింగ్‌‌

తెలంగాణ, ఏపీ ఈఎన్సీలతో ఈ నెల 15న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. ఇరు రాష్ట్రాలు కృష్ణా ప్రాజెక్టుల నుంచి తీసుకున్న నీటి లెక్కలతో పాటు బోర్డు వర్కింగ్‌‌ మాన్యువల్‌‌ తయారు చేయడమే ఎజెండాగా బోర్డు అధ్యక్షుడు ఆర్‌‌కే గుప్తా అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత దాని పరిధిపై స్పష్టత ఇవ్వలేదు. బోర్డు జ్యూరిస్‌‌డిక్షన్‌‌, చైర్మన్‌‌, మెంబర్‌‌ సెక్రటరీ, సభ్యుల అధికారాలు, పరిధులు, రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు ఉండే అధికారాలు, పరిధులపై నిర్ణయం తీసుకోనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఇతర పెండింగ్‌‌ సమస్యలపైనా చర్చించే అవకాశముంది.

Latest Updates