ఈజ్​ ఆఫ్​ డూయింగ్​ బిజినెస్​లో ఏపీ​ ఫస్ట్.. యూపీ సెకండ్​

థర్డ్ ప్లేస్​లో రాష్ట్రాలు, యూటీల ర్యాంకులు ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ, వెలుగు: ఈజ్ ఆఫ్​ డూయింగ్  బిజినెస్ (ఈవోడీబీ)లో మరోసారి ఏపీ నంబర్ వన్ గా నిలిచింది. తెలంగాణ మూడో స్థానానికి పడిపోయింది. గతంలో 12వ ప్లేస్​లో ఉన్న ఉత్తరప్రదేశ్​ ఏకంగా రెండో ప్లేస్​కు ఎగబాకింది. పాలన తీరు, బిజినెస్​ చేసుకోవడానికి కల్పిస్తున్న సౌకర్యాలు, వివిధ పర్మిషన్లు సులువుగా ఇచ్చే విధానాలు వంటి 187 సంస్కరణల అమలును బట్టి కేంద్రం 2016 నుంచి ఈవోడీబీ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఈ మేరకు డిపార్ట్‌‌మెంట్‌‌ ఫర్‌‌ ప్రమోషనల్‌‌ ఆఫ్‌‌ ఇండస్ట్రీ అండ్‌‌ ఇంటర్నల్‌‌ ట్రేడ్‌‌ (డీపీఐఐటీ) రూపొందించిన నాలుగో విడత ర్యాంకులను కేంద్ర ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలాసీతారామన్‌‌ శనివారం ప్రకటించారు. తర్వాత కేంద్ర మంత్రులు పీయూష్​గోయల్, హర్​దీప్​సింగ్​పూరి, సోం ప్రకాశ్​లతో కలిసి మీడియాతో మాట్లాడారు. బేస్​లెవల్​ నుంచి తీసుకున్న ఇన్​పుట్స్​ ఆధారంగా ఈ ర్యాంకింగ్స్​ ప్రకటించామని ఆమె చెప్పారు. మూడేళ్లుగా కొన్ని రాష్ట్రాలు మంచి పనితీరు చూపుతున్నాయని.. సంస్కరణలను బాగా అమలు చేస్తున్నాయని ప్రశంసించారు. ఈవోడీబీ ర్యాంకుల వెనక ఉద్దేశాన్ని గుర్తించిన రాష్ట్రాలు చక్కగా పనిచేస్తున్నాయన్నారు.

ఈ ర్యాంకులు రాష్ట్రాల మధ్య చక్కటి పోటీని ఏర్పరుస్తున్నాయని, వ్యాపారం సులభంగా చేసుకునేలా విధానాలు రూపొందుతున్నాయని వివరించారు. కరోనా టైంలో ఆత్మ నిర్భర్‌‌ ప్యాకేజీ ద్వారా అవసరమైన రంగాలకు చేయూత ఇచ్చామని.. ఇది సంస్కరణలకు మరింత ఊతమిచ్చిందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సంస్కరణలను అమలు చేయడం వల్ల మనదేశం పెట్టుబడులకు కీలకంగా మారుతుందని.. విదేశీ పెట్టుబడులు పెరుగుతాయని తెలిపారు. టాప్​ ప్లేస్​లో నిలిచిన రాష్ట్రాలను నిర్మలా సీతారామన్‌‌ ప్రత్యేకంగా అభినందించారు.

రాష్ట్రాల అభివృద్ధికి దోహదం: పీయూష్‌‌

ఈవోడీబీ యాక్షన్‌‌ ప్లాన్‌‌ రాష్ట్రాల ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఇన్వెస్ట్​మెంట్లను ఆకర్షించే వాతావరణాన్ని ర్యాంకింగ్ ప్రక్రియ సృష్టిస్తుందని.. ఇది రాష్ట్రాల ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు మంచి పనితీరుతో టాప్​ ర్యాంకులు సాధించాయన్నారు. తక్కువ ర్యాంకులు సాధించిన రాష్ట్రాలకు ఇది మేలుకొలుపు వంటిదని, ర్యాంకులు కోల్పోయిన రాష్ట్రాలు మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

జోనల్‌‌ స్థాయిలో టాప్​ ఇవే..

నార్త్‌‌ జోన్‌‌లో ఉత్తరప్రదేశ్.. తూర్పు జోన్‌‌లో జార్ఖండ్.. పశ్చిమ జోన్‌‌లో మధ్యప్రదేశ్.. దక్షిణ జోన్‌‌లో ఆంధ్రప్రదేశ్.. ఈశాన్య జోన్‌‌లో అస్సాం రాష్ట్రాలు టాప్​ ప్లేస్​లో ఉన్నాయి.

 

Latest Updates