ఏపీలో లిక్క‌ర్ రేట్లు 25 శాతం పెంపు

మ‌ద్యం ప్రియుల‌కు ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్.. క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా దాదాపు నెల‌న్న‌ర రోజులుగా మూతప‌డిన లిక్క‌ర్ షాపులు సోమ‌వారం నుంచి తెరుచుకోబోతున్నాయి. అయితే ఇదే స‌మ‌యంలో మ‌ద్యం ధ‌ర‌లు భారీగా పెర‌గ‌బోతున్నాయి. ఏపీలో 2019 సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో మ‌ద్య నిషేధం హామీ ఇచ్చిన వైసీపీ.. అధికారంలోకి వ‌చ్చాక క్ర‌మంగా షాపుల సంఖ్య, సేల్స్ టైమింగ్స్ భారీగా త‌గ్గించింది. ఆ త‌ర్వాత భారీగా లిక్క‌ర్ రేట్లు పెంచింది. ఇప్పుడు మ‌రోసారి 25 శాతం మేర ధ‌ర‌లు పెంచాల‌ని జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యించింది.

క‌రోనా నియంత్ర‌ణ కోసం లాక్ డౌన్ ను మే 17 వ‌ర‌కు పొడిగిస్తూ రెండ్రోజుల క్రితం కేంద్ర హోం శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే ఆర్థిక కార్య‌క‌లాపాల‌ను మొద‌లుపెట్టేందుకు దేశాన్ని గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభ‌జించి అనేక స‌డ‌లింపులు ప్ర‌క‌టించింది. గ్రీన్ జోన్ల‌లో లిక్క‌ర్ షాపులు కూడా తెరిచేందుకు అనుమ‌తి ఇచ్చింది. అయితే షాపుల ద‌గ్గ‌ర ఒకేసారి ఐదుగురికి మించి ఉండ‌కూద‌ని, ఒక్కొక్క‌రికి మ‌ధ్య ఆరు అడుగుల దూరం ఉండాల‌ని ఆదేశించింది. కేంద్రం సూచించిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఏపీలోనూ మ‌ద్యం షాపులు తెరిచేందుకు నిర్ణ‌యించింది ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం. అయితే మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా, దుకాణాల వద్ద రద్దీని తగ్గించేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. లిక్క‌ర్ రేట్ల‌ను 25 శాతం పెంచి అమ్మాల‌ని, సోమ‌వారం నుంచే ఈ ధ‌ర‌ల‌ను అమ‌లులోకి తేవాల‌ని ఆదేశించింది. రానున్న రోజుల్లో మ‌రిన్ని దుకాణాల సంఖ్య త‌గ్గించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Latest Updates