పోతిరెడ్డిపాడుపై నోరువిప్పని ఏపీ

  • హెడ్‌‌ రెగ్యులేటరీ విస్తరణపై కృష్ణా బోర్డు లేఖకు జవాబు రాలే..
  • వరద నీటి వినియోగానికి కమిటీ ఏర్పాటుపైనా వెనుకడుగు
  • బేసిన్‌‌ అవతలికి నీళ్ల తరలింపు, ఇతర అంశాలే కారణం!

హైదరాబాద్‌‌, వెలుగు:

పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటరీ విస్తరణపై వివరణ ఇవ్వాలంటూ కృష్ణా బోర్డు రాసిన లేఖకు ఏపీ ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. లేఖ రాసి రెండు వారాలు గడిచినా ఏపీ అధికారుల నుంచి స్పందన రాలేదు. ఆ రాష్ట్రం చేపడుతున్నది పూర్తిగా కొత్త ప్రాజెక్టు కావడంతో డీపీఆర్‌‌ ఇస్తే చట్టపరంగా సమస్యలు వస్తాయని ఏపీ వెనుకాడుతున్నట్టు అధికారులు చెప్తున్నారు.

రెండింతలు నీళ్లు తీసుకునేలా..

పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ కెపాసిటీని రెండింతలు చేస్తామని ఏపీ సీఎం జగన్‌‌ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి అవసరమైన డీపీఆర్‌‌ను అక్కడి సాగునీటి శాఖ సిద్ధం చేయడం, సర్కారు గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వడం కూడా అయిపోయింది. పోతిరెడ్డిపాడుతో పాటు రాయలసీమలో కాలువల కెపాసిటీని పెంచే ప్రతిపాదనలు కూడా చేశారు. ఇక శ్రీశైలంలో 854 అడుగులకుపైన నీటి మట్టం ఉంటే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకునే చాన్స్‌‌ ఉంది. కెపాసిటీ పెంచినా నీటిమట్టం తక్కువగా ఉన్నప్పుడు రాయలసీమ అవసరాలు తీర్చుకోవడానికి కొత్తగా లిఫ్ట్‌‌ స్కీమ్​కు ప్రతిపాదనలు చేశారు. ఇవన్నీ కొత్త ప్రాజెక్టులని, రూల్స్​ ప్రకారం అపెక్స్​ కౌన్సిల్, బోర్డు అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు నిర్మించొద్దని తెలంగాణ ఇరిగేషన్​ ఈఎన్సీ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో కొత్త ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలని కృష్ణా బోర్డు ఈ నెల 5న ఏపీకి లేఖ రాసింది. మోస్ట్​ అర్జెంట్​గా పరిగణించి రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అయినా ఏపీ నుంచి జవాబు రాలేదు. బోర్డుకు డీపీఆర్‌‌ ఇస్తే విధిగా తెలంగాణ ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు దాని కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని పట్టించుకోవడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు నుంచి మళ్లీ రిమైండర్‌‌ ఇప్పించేందుకు తెలంగాణ ఇరిగేషన్‌‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని అంటున్నారు.

వరద నీటి వాడకంపై కమిటీ ఏర్పాటుకూ వెనుకంజ

కృష్ణా నదికి భారీగా వరదలొచ్చి సముద్రంలోకి పోయే రోజుల్లో తీసుకున్న నీటిని ఆయా రాష్ట్రాల లెక్కల్లో చూపొద్దని ఏపీ కృష్ణా బోర్డును కోరింది. దీనిపై ఏపీ ఇంజనీర్ల ఒత్తిడితో కృష్ణా బోర్డు అధికారులు వరద నీటి వినియోగం అంశాన్ని 11వ జనరల్‌‌ బాడీ మీటింగ్‌‌ ఎజెండాలో చేర్చారు. జనవరి 9న జరిగిన మీటింగ్‌‌లో దీనిపై చర్చించి వరద నీటి వాడకంపై కమిటీ ఏర్పాటు చేసి చర్చించాలని నిర్ణయించారు. బోర్డు మీటింగ్‌‌ జరిగి 40 రోజులు గడిచినా దీనిపై ఒక్క అడుగు ముందుకు పడలేదు. వెంటనే కమిటీ వేయాలంటూ తెలంగాణ ఈఎన్సీ ఈనెల 15న కృష్ణా బోర్డుకి లేఖ రాశారు. దీనిపై ఏపీ అధికారులతో బోర్డు ప్రముఖులు ఫోన్‌‌లో మాట్లాడారని, అటు నుంచి ఇంకా గ్రీన్‌‌ సిగ్నల్‌‌ రాలేదని తెలిసింది.

చెరిసగం వాడాలనడంతో..

వరద నీటి వాడకంపై కమిటీ విషయంగా కృష్ణా బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ పలు ప్రతిపాదనలు చేశారు. వరద నీటిని ఇరు రాష్ట్రాలు తలా 50 శాతం వినియోగించుకోవాలని, తెలంగాణలో ఆమేరకు నీటి నిల్వకు అవకాశం లేనందున నాగార్జునసాగర్‌‌, శ్రీశైలంలో నిల్వ చేసుకుని, తర్వాత ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. వరద రోజుల్లో భారీగా నీటిని తీసుకున్న ఏపీ.. ఆ మేరకు రిజర్వాయర్లలో నిల్వ ఉన్న నీటిపై తెలంగాణకు హక్కులు కల్పించడానికి సిద్ధంగా లేదు. దీంతో కమిటీని పక్కన పెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.

టెక్నికల్‌‌గా దొరికిపోతామనే..

బోర్డు మెంబర్‌‌ సెక్రెటరీ నేతృత్వంలో ఇరు రాష్ట్రాల ఇంటర్‌‌ స్టేట్‌‌ సీఈలతో వరద నీటి కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఈఎన్సీ సూచించారు. అయితే మొత్తం ఫ్లడ్‌‌ డేస్‌‌లో పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌, కేడీఎస్‌‌ స్కీములకు తరలించిన నీటి లెక్కలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే ఏపీ దీనిపై వెనుకంజ వేస్తున్నట్టు తెలిసింది. పోతిరెడ్డిపాడు నుంచి తీసుకునే నీటిలో 80 శాతానికిపైగా పెన్నా బేసిన్‌‌కు తరలించడం, కేడీఎస్‌‌కు పోలవరం ద్వారా గోదావరి నీటిని మళ్లించడంతో ఈ లెక్కలు మున్ముందు చిక్కులు తెచ్చిపెడుతాయని ఏపీ భావిస్తున్నట్టు తెలిసింది. ఈ కారణంగానే టెక్నికల్‌‌ కమిటీ అంశాన్ని తెరమరుగు చేయాలని ప్రయత్నిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు.

Latest Updates