క‌రోనా పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వాడండి: ఏపీ వైద్యారోగ్యశాఖ

అమరావతి: ఆస్పత్రుల్లో అడ్మిషన్ల సమయంలో కరోనా అనుమానితుల పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలని ఏపీ వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. యాంటీజెన్ టెస్టులో పాజిటివ్ అని తేలితే తక్షణం చికిత్స ప్రారంభించి సదరు రోగిని ఐసోలేట్ చేయాలని, నెగెటివ్ వస్తే వెంటనే ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయాలని తెలిపింది. దాంట్లోనూ నెగెటివ్ వస్తే రియల్ టైమ్ ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయాలని వివరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్ఓలకు స్పష్టం చేసింది. అంతేకాదు, ఒక్కో జిల్లాకు 20 వేల ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు పంపినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. హైరిస్క్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో కరోనా టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేపట్టాలని పేర్కొంది.

హైరిస్కు కేసులు కలిగిన ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో వ్యాధి లక్షణాలు కలిగి కరోనా నెగెటివ్ ఫలితాలు వచ్చిన వారిని కూడా పరీక్షించాల్సిందిగా సూచనలు జారీ చేశారు. ఆస్పత్రుల్లో గర్భిణులు, శస్త్ర చికిత్స చేయాల్సిన రోగులకు పరీక్షించేందుకు కూడా ఈ కిట్లు వినియోగించాలని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. క్వారంటైన్ కేంద్రాల్లో 10 రోజుల క్వారంటైన్ అనంతరం డిశ్చార్జి అవుతున్న వారిని కూడా ఈ కిట్లతో పరీక్షించవచ్చని సూచించింది. అయితే కరోనా లక్షణాలు కలిగి ఉన్న రోగులందరినీ డిశ్చార్జి చేసేందుకు ట్రూనాట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Latest Updates