ఏపీలో సర్కారీ స్కూళ్ల వద్ద కొత్త ఆంక్షలు

ఏపీలో సర్కారీ స్కూళ్ల వద్ద కొత్త ఆంక్షలు
  • 200 మీటర్ల పరిధిలో మద్యం, సిగరెట్, గుట్కా,  పాన్ అమ్మకాలపై నిషేధం
  • స్కూళ్ల పరిసరాల్లో వీటి అమ్మకాలు జరగకుండా పర్యవేక్షణ బాధ్యత ఏఎన్ఎంలకు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంక్షేమం కోసం సంచలనం నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ స్కూళ్లకు 200 మీటర్ల పరిధిలో మద్యం, సిగరెట్, గుట్కా, పాన్ ల అమ్మకాలపై నిషేధం విధించింది. విద్యార్థుల చదువులు సాఫీగా సాగేందుకు వీలుగా  ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. నాడు-నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించి వాటి స్వరూపాలు సంపూర్ణంగా మార్చివేసే చర్యలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం తాజాగా పాఠశాలల చుట్టూ కలుషిత వాతావరణం సృష్టిస్తున్న వాటిని తొలగించే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలలకు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్లు అమ్మే షాపులు ఉండకూడదని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
స్కూళ్ల పరిసరాల్లో పరిస్థితులపై ఏఎన్ఎంలతో పర్యవేక్షణ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్ల సమీపంలోని పరిస్థితులను ఇకపై ఏఎన్‌ఎంలు పర్యవేక్షిస్తూ ఉంటారని ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కో ఏఎన్‌ఎంకు రెండు, మూడు పాఠశాలల బాధ్యతలు అప్పగించనున్నారు. ఏఎన్‌ఎం వెళ్లి స్కూలు సమీపంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కట్టుదిట్టంగా అమలు చేసేందుకు దీని కోసం ఒక ప్రత్యేక యాప్‌ను కూడా తయారుచేశారు. ఈ యాప్‌ ద్వారా అక్కడి తాజా ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేస్తుండాలి.
ప్రతి స్కూల్ ఆన్ లైన్ మ్యాపింగ్ తో పోర్టల్ కు అనుసంధానం
స్కూళ్లకు సమీపంలో ఎవరైనా సిగరెట్, గుట్కా, పాన్‌షాపులు నిర్వహిస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే పాఠశాలల సమీపంలో ఎవరైనా సిగరెట్ తాగినా, మద్యం సేవించినా అట్టివారిపై కఠినమైన చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం ప్రతి స్కూల్‌నూ పర్యవేక్షణ కోసం మ్యాపింగ్‌ చేస్తారు. మ్యాపింగ్‌ అనంతరం వీటిని ఆన్‌లైన్‌ పోర్టల్‌కు అనుసంధానిస్తారు. చెడు అలవాట్ల ప్రభావం చిన్నపిల్లలపై పడకూడదన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. 
స్కూల్ ఆవరణలో చెడు అలవాట్ల అనర్ధాలను సూచించే రాతలు
స్కూల్‌ ఆవరణలో సిగరెట్, మద్యం, పాన్ , గుట్కా వంటి వాటి వల్ల వచ్చే అనర్థాలను సూచించే బోర్డులను, గోడలపై రాతలు రాస్తారు. ఈ నిబంధనలను స్కూల్ ఆవరణలో అందరూ పాటించాల్సి ఉంటుంది. స్వయంగా టీచర్లు ఎవరైనా స్కూల్‌ ఆవరణలో స్మోకింగ్‌ చేస్తే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటారు. త్వరలో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది.