ట్రిపుల్‍ ఐటీ అడ్మిషన్లకు  ఏపీ కోటా అడ్డంకి

ఆ రాష్ట్రంలో టెన్త్​ స్టూడెంట్ల గ్రేడ్ల ప్రకటన ఆలస్యం

ఓపెన్‍ కేటగిరి కింద ఏపీకి 15 శాతం రిజర్వేషన్​

ఇప్పటికే అక్కడి ప్రభుత్వానికి లెటర్​  రాసిన అధికారులు

స్టూడెంట్లంతా పాస్‍ కావడంతో అడ్మిషన్లకు పెరిగిన డిమాండ్‍

నిర్మల్‍, వెలుగుబాసర ట్రిపుల్​ ఐటీ ప్రవేశాలకు ఏపీ కోటా అడ్డం పడుతోంది. ఓపెన్​ కేటగిరి కింద ఏపీకి 15 శాతం రిజర్వేషన్​ ఉండడం, అక్కడ టెన్త్​ స్టూడెంట్లకు గ్రేడ్లు ఇంకా ప్రకటించకపోవడంతో నోటిఫికేషన్ ​విడుదల ఆలస్యమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ట్రిపుల్​ ఐటీ నిర్మల్‍ జిల్లా బాసరలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍ రాష్ట్రంలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‍ రెడ్డి ట్రిపుల్‌ ఐటీలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ఈ ట్రిపుల్‌ ఐటీలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని బాసర, ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బాసర ట్రిపుల్‍ ఐటీలో ప్రతి ఏడాది ఏప్రిల్‍ చివరి వారంలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్‍  విడుదలయ్యేది. జూన్‍ చివరి వారంలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యేది. ఆరేళ్ల కోర్సులో భాగంగా ప్రస్తుతం ట్రిపుల్‍ ఐటీలో 7,500 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ఈ సంవత్సరం 1,500 సీట్లకు అడ్మిషన్లు తీసుకోనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‍ దాటినా ట్రిపుల్‍ ఐటీ అడ్మిషన్లు ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. రాష్ట్రంలో ఈసారి కరోనా కారణంగా పది పరీక్షలు రద్దు చేసి స్టూడెంట్లందరిని పాస్​ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షకు పైనే స్టూడెంట్లు పాసయ్యారు. వారికి గ్రేడ్లు, మార్కులు కూడా ప్రకటించారు. అయితే కరోనా తీవ్రత కారణంగా ఇన్ని రోజులు ట్రిపుల్‍ ఐటీ నోటిఫికేషన్‍ విడుదల చేయలేదు.

ఎంట్రన్స్​ పెడతామంటున్న ఏపీ

ట్రిపుల్‍ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్‍ సిద్ధం చేసిన అధికారులకు కొత్త చిక్కు వచ్చిపడింది. బాసర ట్రిపుల్‍ ఐటీ నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్‍ రాష్ట్రానికి ఓపెన్​కేటగిరిలో15 శాతం కోటా ఉంది. అక్కడి ప్రభుత్వం పది పరీక్షల రిజల్ట్ ప్రకటించినా ఇంతవరకు గ్రేడ్లు్, మార్కులు రిలీజ్‍ చేయలేదు. దీనిపై పది రోజుల క్రితం ఇక్కడి అధికారులు ఏపీకి లెటర్​రాశారు. కానీ అక్కడి ప్రభుత్వం మాత్రం ఎంట్రెన్స్ నిర్వహిస్తామని చెబుతుండటంతో ట్రిపుల్‍ ఐటీ ప్రవేశాల నోటిఫికేషన్‍ ఆలస్యమవుతోంది. ఒకవేళ వారి కోటా లేకుండా నోటిఫికేషన్‍ విడుదల చేస్తే న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రిపుల్‍ ఐటీ వర్గాలు చెబుతున్నాయి.

చాలామందికి 10 జీపీ

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టెన్త్​ స్టూడెంట్లందరిని పాస్​ చేయడంతో ఈసారి బాసర ట్రిపుల్‍ ఐటీలో ప్రవేశాలకు డిమాండ్‌ పెరగనుంది. స్టూడెంట్ల గ్రేడ్​పాయింట్ల ఆధారంగానే అడ్మిషన్లు కల్పిస్తారు. అయితే గతంతో పోల్చుకుంటే 10 జీపీఏ వచ్చిన వారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో ఈసారి ప్రవేశాలు ఏ విధంగా కల్పిస్తారోననే ఉత్కంఠ నెలకొంది. చాలామంది స్టూడెంట్లకు 10 జీపీఏ పాయింట్లు రావడంతో సబ్జెక్టుల్లో వారికి వచ్చిన మార్కులు కీలకం కానున్నాయి. సబ్జెక్టు మార్కులు సైతం ఒకేలా వస్తే వయసు, రిజర్వేషన్లు చూసే అవకాశం ఉంది.

నోటిఫికేషన్కు అన్నీ రెడీ

ఈ ఏడాది ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు ఆలస్యమయ్యాయి. నోటిఫికేషన్‍ కోసం అన్నీ రెడీ చేశాం. కానీ ఏపీకి సంబంధించిన 15 శాత కోటా ఉండటంతో అక్కడి స్టూడెంట్లను దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్‍ వెల్లడించాల్సి ఉంటుంది. కానీ ఆంధ్రాలో టెన్త్​స్టూడెంట్ల గ్రేడ్లు, మార్కులు ఇంతవరకు ప్రకటించలేదు. ఇప్పటికే అక్కడి అధికారులకు లెటర్ ​కూడా రాశాం. అక్కడి స్టూడెంట్ల మార్కులు, గ్రేడ్లు రాగానే నోటిఫికేషన్‍ విడుదల చేస్తాం.–రాజేశ్వర్‍, ఏవో ట్రిపుల్‍ ఐటీ.

Latest Updates