ఏపీలో రాజ్యసభ ఎన్నికల వేళ.. వైసీపీ... టీడీపీ ఎత్తుకు పై ఎత్తులు

ఏపీలో రాజ్యసభ ఎన్నికల వేళ.. వైసీపీ... టీడీపీ ఎత్తుకు పై ఎత్తులు

రాజ్యసభ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు రాజీనామాకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ఆమోదం తెలిపారు. ఈ నెల 22న గంటా రాజీనామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో  మూడు రాజ్య సభ స్థానాలకు మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.  ప్రతిపక్ష టీడీపీకి షాకిచ్చేలా వైసీపీ సర్కార్ భారీ స్కెచ్ వేసింది. రాజ్య సభ ఎన్నికల నాటికి టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్యా బలం తగ్గించేందుకు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గంటా ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్పీకర్ తాజా నిర్ణయంతో గంటా రాజ్యసభ్య ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కోల్పోయాడు. దీంతో రాజ్య సభ ఎన్నికల్లో టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఓటు తగ్గింది. రాజ్య సభ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2022 ఫిబ్రవరి 6న  గంటా శ్రీనివాస్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను స్పీకర్‌కు అందించారు. ఇన్నాళ్లు రాజీనామాను పెండింగ్‌లో పెట్టిన స్పీకర్ తీరా ఎన్నికల ముంగిట రాజీనామాకు ఆమోదం తెలపడం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు  అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. పార్టీ మార్పుపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.  వైసీపీ నుంచి గెలుపొందిన ఉండవల్లి శ్రీదేవి, ఆనం , కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి, మేకపాటి చంద్రశేరరెడ్డి... టీడీపీ నుంచి కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్​, మద్దాలి గిరి... జనసేన నుంచి గెలుపొందిన ఏకైక  ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్​ నోటీసులు జారీ అయ్యాయి. 

2024, ఏప్రిల్​ 2 వ తేదీ నాటికి సీఎం రమేష్​, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, కనకమేడల పదవీకాలం ముగియనుంది. రాజ్యసభ ఎంపీ స్థానాలు చేజారిపోకుండా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ వ్యూహానికి కౌంటర్​ ఇచ్చేందుకు   టీడీపీ  రెడీ అవుతోంది.  తాము ఇచ్చిన  నలుగురు ఎమ్మెల్యేల డిస్​ క్వాలిఫికేషన్​ పిటిషన్​ను ఆమోదించాలని స్పీకర్​ కార్యాలయంపై తెలుగుదేశం ఒత్తిడి తెస్తుంది. రాజ్యసభ ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ  ఎత్తుకు పైఎత్తులు రచిస్తున్నాయి.