జ‌గ‌న్ స‌ర్కారుకు హైకోర్టు షాక్.. ఎస్‌ఈసీగా నిమ్మ‌గ‌డ్డ కొన‌సాగింపు

ఏపీ స‌ర్కారుకు మ‌రోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. రాష్ట్ర ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ ను తొల‌గిస్తూ ప్ర‌భుత్వం ఇచ్చిన జీవో చెల్ల‌ద‌ని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ నియామ‌కం, ప‌ద‌వీకాలం స‌హా ప‌లు నిబంధ‌న‌లు మారుస్తూ జారీ చేసి ఆర్డినెన్స్ ను న్యాయ‌స్థానం కొట్టేసింది. పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్‌, జీవో జారీలపై హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌నర్ ప‌ద‌వీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్ల‌కు త‌గ్గించి.. మాజీ ఐఏఎస్ ల‌ను కాకుండా హైకోర్టు రిటైర్డ్ జ‌డ్జిని నియ‌మించేలా నిబంధ‌న‌లు మార్చింది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు ఎస్ఈసీగా ఉన్న నిమ్మ‌గ‌డ్డ‌కు ప‌ద‌వీ కాలం మూడేళ్లు పూర్త‌యిందంటూ జ‌గ‌న్ స‌ర్కారు ఆయ‌న్ని తొల‌గిస్తూ జీవో జారీ చేసింది. కొత్త ఎస్ఈసీగా జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్ ను నియ‌మించింది. అయితే, తనను తొలగించాలన్న దురుద్దేశంతోనే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారని మాజీ ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఆయ‌న‌తో పాటు 13 హైకోర్టులో పిటిష‌న్లు వేశారు. వాట‌న్నింటిని క‌లిపి విచారించిన న్యాయ‌స్థానం నిమ్మ‌గ‌డ్డ‌నే రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా కొన‌సాగించాల‌ని తీర్పు ఇచ్చింది. ప్ర‌భుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని, ఆర్టిక‌ల్ 213 ప్ర‌కారం ఆ ఆర్డినెన్స్ చెల్ల‌ద‌ని పేర్కొంది.

Latest Updates