కొత్త స్కెచ్ తో ఏపీ సర్కార్ నీళ్ల చోరీ

వరద నీళ్లే కాదు.. అడుగున ఉన్న నీళ్లకూ గండి
కృష్ణా నదిలోనే పంప్​హౌస్​ కడుతున్న ఏపీ
సంగమేశ్వరం నుంచి రోజుకు 3 టీఎంసీలు
పోతిరెడ్డిపాడు గండితో 8 టీఎంసీల మళ్లింపు
రోజూ 11 టీఎంసీలు తరలించుకుపోయే స్కెచ్
శ్రీశైలం రిజర్వాయర్​లో 790 అడుగుల
నీళ్లున్నా ఖాళీ చేసేందుకు కుట్ర
ప్రాజెక్ట్​ పనుల కోసం ఇప్పటికే జీవో జారీ

కుండలో నీళ్లు పొంగిపొర్లి నప్పుడే వాడుకుంటామని చెపుతున్న ఏపీ సర్కారు.. కుండకే చిల్లులు పెడుతోంది. కుండ అట్టడుగున ఉన్న నీళ్లను ఒక్క చుక్క లేకుండా ఖాళీ చేసే దోపిడీకి తెగించింది.

పోతిరెడ్డిపాడు గండిని డబుల్ చేస్తున్న ఏపీ.. ఈసారి అంతకు మించిన మహా నీటి దోపిడీకి ప్లాన్​ చేసింది. ఏకంగా శ్రీశైలం రిజర్వాయర్ వెనుక నుంచి మరో భారీ బుంగ కొట్టే స్కెచ్ వేసింది. పోతిరెడ్డిపాడుకు నాలుగు కిలోమీటర్ల దూరం నుంచే నీటిని అమాంతం లిఫ్ట్ చేసుకొని పోయే డైవర్షన్​ స్కీమ్​ చేపడుతోంది. సంగమేశ్వరం నుంచే రోజుకు మూడు టీఎంసీల నీటిని పంపింగ్​ చేసేందుకు అనుమతులు ఇచ్చింది. కృష్ణా జలాలు.. శ్రీశైలం జలాశయంలోకి రాకముందే.. ఎగువ ప్రాంతం నుంచే ప్రతి నీటి బొట్టును వచ్చింది వచ్చినట్లే ఎత్తుకెళ్లి.. శ్రీశైలం రైట్ కెనాల్ ద్వారా మళ్లించనుంది.

అడుగు నుంచి తోడేస్తారు

వరద జలాలను వాడుకుంటామని, అంటే.. కృష్ణా నదికి వరదలొచ్చినపుడు శ్రీశైలం నుంచి పొంగిపొర్లే జలాలను వాడుకుంటామని చెబుతున్న ఏపీ సర్కారు, రిజర్వాయర్​లో కనీస నీటిమట్టం లేకుండా కాజేసేందుకు అనుమతులు ఇచ్చింది. అడుగులు, మడుగుల్లో ఉన్న నీటిని సైతం లిఫ్ట్ చేసేందుకు పంపింగ్​ చేయాలనే ప్లాన్ తెలంగాణకు పెద్ద దెబ్బ.

దీంతో శ్రీశైలం దాటి కృష్ణా జలాలు కిందికి రావటం ఎండమావులను తలపించనుంది. శ్రీశైలం నీటి ఆధారంగా తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టులన్నీ వట్టిపోనున్నాయి. తాగు, సాగునీరు కరువై దక్షిణ తెలంగాణ జిల్లాలు ఎడారులయ్యే ప్రమాదముంది.

వరద అంటే అడుగు నీరా!

వరద ఉండే రోజుల్లోనే నీటిని తరలిస్తామని ఏపీ చెబుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ నిండి పొంగితే.. అంటే పూర్తి నీటి మట్టం 885 అడుగులు దాటాలి. శ్రీశైలం గేట్లు దుంకి దిగువన ఉన్న నాగార్జునసాగర్​ నిండాలి. అప్పుడే వరద జలాలుగా పరిగణించాలని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇదేమీ పట్టనట్లు నీటి మట్టం 790 అడుగులున్నప్పుడు కూడా సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు నుంచి మళ్లిస్తుంటే వరద జలాలెలా అవుతాయనేది తెలంగాణ ఇంజనీర్ల వాదన.

ఐదు ఉమ్మడి జిల్లాలకు ఎఫెక్ట్

సగటున ప్రతి ఐదేళ్లలో ఒక్క ఏడాది కృష్ణాకు వరదలొస్తున్నాయి. మిగతా నాలుగేళ్లు కృష్ణా బేసిన్లో అంతకంతకు సరిపడే నీళ్లే ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీ కట్టే ప్రాజెక్టులతో తెలంగాణకు భారీగా అన్యాయం జరుగనుంది. ప్రధానంగా శ్రీశైలం వరద జలాలపై ఆధారపడ్డ ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌‌ నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలను అవసరాలు దెబ్బతింటాయి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్​ స్కీమ్​తో పాటు నెట్టెంపాడు, ఎస్‌‌ఎల్‌‌బీసీ, పాలమూరు- – రంగారెడ్డి, డిండి, సాగర్​ ఎడమ కాల్వ భవితవ్యం ప్రశ్నార్థకం మారుతుంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌‌కు నీరందడం గగనమవుతుంది. శ్రీశైలం ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తే సాగర్‌‌ కింది ఆయకట్టు 6.40 లక్షల ఎకరాలతో పాటు ఏఎంఆర్‌‌పీ తాగు, సాగు నీరు అందని దుస్థితి వస్తుంది. రంగారెడ్డి, హైదరాబాద్, ​మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాలకు మిషన్​ భగీరథ ద్వారా అందించే తాగునీటికి కరువు తప్పదు. శ్రీశైలంలో 815 అడుగుల వరకు నీరుంటేనే ఈ జిల్లాలో తాగునీటి అవసరాలు తీరుతాయి. అంతకన్నా  తక్కువ మట్టంనుంచే నీటిని ఏపీ ఎత్తిపోసుకుంటే ఈ జిల్లాలకు తాగునీరు గగనమే అవుతుంది.

అసలు ప్రమాదమేంది?

కృష్ణా బోర్డు సమక్షంలో రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్ లో కనీస నీటి నిల్వమట్టం 834 అడుగులు మెయింటెన్ చేయాలి. కానీ పోతిరెడ్డిపాడు నుంచి లెక్కలేనన్ని నీళ్లను ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతోంది. నీటి మట్టం .. 790 అడుగులకు పడిపోయినా కూడా .. ఉన్న నీరంతా ఖాళీ చేసేలా పంపింగ్ స్కీమ్ ను డిజైన్ చేసుకుంది. దీంతో సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు నుంచి నీరు గలగల పారుతుంటే.. శ్రీశైలం చుక్కనీరు లేకుండా ఖాళీ కావటం ఖాయమని ఇంజనీరింగ్  నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.                  –బొల్గం శ్రీనివాస్, స్టేట్బ్యూరో చీఫ్

మరిన్ని వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

Latest Updates