సాగర్​ ఎడమ కాల్వపై ఏపీ కన్ను

4 క్రాస్‌ వాల్స్‌ ను తొలగించాలంటూ ప్రతిపాదన

ఫ్లడ్ డేస్‌లో తీసుకున్న నీటిని వాటాలో లెక్కించొద్దని కృష్ణా బోర్డుకు లేఖ

ఎజెండాలో చేర్చిన బోర్డు.. నేడు మీటింగ్

ఏపీ తీరుపై తెలంగాణ ఇంజనీర్ల ఆగ్రహం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: నాగార్జునసాగర్ ఎడమ కాల్వపై ఆంధ్రప్రదేశ్ కన్నేసింది. కాల్వపై తెలంగాణ భూభాగంలో నిర్మించిన నాలుగు క్రాస్‌‌‌‌ వాల్స్‌‌‌‌ను తొలగించాలంటూ కొత్త ప్రపోజల్‌‌‌‌ను ముందుకు తెచ్చింది. దీంతోపాటు ఫ్లడ్‌‌‌‌ డేస్‌‌‌‌లో రెండు రాష్ట్రాలూ తీసుకున్న నీటిని ఆయా రాష్ట్రాల వాటాలో లెక్కించొద్దని ప్రతిపాదించింది. ఏపీ పెట్టిన ఈ రెండు ప్రపోజల్స్​కు వెంటనే కృష్ణా రివర్ మేనేజ్​మెంట్ బోర్డు ఆమోదముద్ర వేసి ఎజెండాలో చేర్చింది. తెలంగాణకు నష్టం చేసే ఈ ప్రతిపాదనలపై గురువారం బోర్డు 11వ జనరల్ బాడీ మీటింగ్‌‌‌‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ఇవీ ఏపీ ప్రపోజల్స్
ఏపీ వాటర్‌‌‌‌ రీసోర్సెస్‌‌‌‌ డిపా ర్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ సీఎస్‌‌‌‌ ఆదిత్యనాథ్‌ దాస్‌‌‌‌ బుధవారం కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. కృష్ణా బేసిన్‌‌‌‌లో ప్రాజెక్టులన్నీ నిండి సముద్రంలోకి నీళ్లు పోయినన్ని రోజులూ రెండు రాష్ట్రాలు ఉపయోగించుకున్న నీటిని ఆయా రాష్ట్రాల కౌంట్‌‌‌‌లో వేయొద్దని ప్రపోజల్ పెట్టారు. రెండు రాష్ట్రాలు ఫ్లడ్‌‌‌‌ డేస్‌‌‌‌లో ఉపయోగించుకున్న నీటిపై బోర్డు మీటింగ్‌‌‌‌లో చర్చిం చి నిర్ణయం తీసుకోవాలని కోరారు. నాగార్జునసాగర్‌‌‌‌ ఎడమ కాల్వపై నిర్మించిన నాలుగు క్రాస్‌‌‌‌ వాల్స్‌‌‌‌ను తొలగిం చి, ఏపీకి సక్రమంగా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని మరో ప్రపోజల్ పెట్టారు. సాగర్‌‌‌‌ ఎడమ కాలువ (21వ మెయిన్‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌ కెనాల్‌‌‌‌)పై 73.328 కి.మీ., 77.68 కి.మీ., 83.515 కి.మీ., 94.699 కి.మీ.ల వద్ద నిర్మించిన క్రాస్‌‌‌‌ వాల్స్‌‌‌‌తో ఏపీకి సరిగ్గా నీళ్లు సరఫరా కావడం లేదని, వాటిని తొలగించేలా తెలంగాణను ఆదేశించాలని ఆయన లేఖలో సూచించారు.

మన ఆయకట్టుకు ఉపయోగించేది 2 టీఎంసీలే..
నాగార్జునసాగర్‌‌‌‌ ఎడమ కాల్వ మున్నేరు అక్విడెక్ట్‌‌‌‌ను దాటిన తర్వాత 21 మెయిన్‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌ కెనాల్‌‌‌‌గా పిలుస్తారు. ఈ కాల్వ 73.32 కి.మీ.ల నుం చి 94.69 కి.మీ.లకు మధ్య, ఆ తర్వాత సాగర్‌‌‌‌ ఎడమ కాల్వ జోన్‌‌‌‌-3 పరిధిలో మొత్తం 21 వేల ఎకరాల ఆయకట్టు మాత్రమే తెలంగాణలో ఉంది.ఈ ఆయకట్టుకు నీళ్లివ్వడానికి రెండు టీఎంసీలు సరిపోతాయి. కాల్వ లోతులో ఉండటంతో నీటిని అందించాల్సిన భూమి సిల్‌‌‌‌ లెవల్‌‌‌‌ కన్నా ఎత్తులో ఉండటంతో ఉమ్మడి ఏపీలో ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేందుకు రిటైర్డ్‌‌‌‌ సీఈ నేతృత్వంలో స్టడీ చేయించింది. ఆయన సూచన మేరకే కాల్వపై నాలుగు చోట్ల క్రాస్‌‌‌‌ వాల్స్‌‌‌‌ నిర్మించారు. అప్పటి నుంచి ఆయకట్టుకు ఎంతో కొంత నీళ్లందుతున్నాయి. సాగర్‌‌‌‌ ఎడమ కాల్వ జోన్‌‌‌‌- 3 పరిధిలో తెలంగాణ ఆయకట్టు 18 వేల ఎకరాలు మాత్రమే ఉంది.
జోన్ 3కి పైన మరో మూడు వేల ఎకరాలు ఉంది. మొత్తంగా 21 వేల ఎకరాలకు నీళ్లు అందడాన్ని ఏపీ జీర్ణించు కోలేకపోతోందన్న విమర్శలు ఉన్నాయి. ఆ నీటిని ఎడమ కాల్వ ద్వారా తమ భూభాగానికి తరలించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. క్రాస్‌‌‌‌ వాల్స్‌‌‌‌ తొలగించడం ద్వారా ఎగువ ప్రాంతాల్లో రాష్ట్రం ఉపయోగించుకునే నీటిని సులభంగా తమ భూభాగానికి తరలించాలనేది ఏపీ ఎత్తుగడ అని తెలంగాణ ఇంజనీర్లు అనుమానిస్తున్నారు.

వాటాను వాడుకోలేని దుస్థితిలో తెలంగాణ
నవంబర్‌‌‌‌ నెలాఖరు వరకు ఏపీకి 302 టీఎంసీలు, తెలంగాణకు 126.08 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు వాటర్‌‌‌‌ రిలీజ్‌ ఆర్డర్‌‌‌‌ ఇచ్చింది. డిసెంబర్‌‌‌‌ 23 నాటికి ఏపీ కేటాయించిన నీటి కన్నా 138.99 టీఎంసీలను అదనంగా తీసుకోగా, తెలంగాణ 32.88 టీఎంసీలు తక్కువగా తీసుకుంది. సాగర్‌‌‌‌ ఎడమ కాల్వ నుంచి తెలంగాణకు 63.22 టీఎంసీలను కేటాయించగా కేవలం 36.23 టీఎంసీలను తీసుకోగలిగింది. ఏపీకి ఎడమ కాలువ నుంచి 15టీఎంసీలను కేటాయించగా.. 4.21 టీఎంసీలు అదనంగా తరలించుకుపోయింది. సాగర్‌‌‌‌ ఎడమ కాల్వపై ఉన్న క్రాస్‌‌‌‌ వాల్స్‌ను దాటి ఈ నీళ్లు ఏపీకి చేరాయి.

నేడు ఉదయం కృష్ణా బోర్డు భేటీ
కృష్ణా బోర్డు 11వ జనరల్‌‌‌‌ బాడీ మీటింగ్‌‌‌‌ ముచ్చటగా మూడోసారి కూడా వాయిదా పడింది. రెండుసార్లు తేదీ నిర్ణయించుకున్నాక వాయిదా వేయగా.. ఈసారి సరిగ్గా సమావేశం టైముకు ముందు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఏపీ జల వనరుల శాఖ స్పెషల్‌‌‌‌ సీఎస్‌‌‌‌ ఆదిత్యనాథ్‌ దాస్‌‌‌‌ హాజరుకాకపోవడమే దీనికి కారణమని బోర్డు చైర్మన్‌‌‌‌ ప్రకటించారు. తిరిగి గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహిస్తామని బోర్డు మెంబర్‌‌‌‌ సెక్రటరీ పరమేశం ఇరు రాష్ట్రాలకూ సమాచారం ఇచ్చారు.

వరుసగా వాయిదాలే..
డిసెంబర్‌‌‌‌ 3న కృష్ణా బోర్డు భేటీ నిర్వహిస్తున్నట్టు మెంబర్‌‌‌‌ సెక్రెటరీ మొదట ఇరు రాష్ట్రాలకు లేఖ రాశారు. కానీ ఇతర మీటింగ్‌‌‌‌లతో బిజీగా ఉండటంతో సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీ ఈఎన్సీ కోరడంతో డిసెంబర్‌‌‌‌ 17వ తేదీకి మార్చారు. ఆ మీటింగ్‌‌‌‌ కూడా వాయిదా పడింది. తర్వాత ఈ నెల 8న ఏపీలోని విజయవాడలో బోర్డు మీటింగ్‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారమిచ్చారు. రాజధాని గొడవల నేపథ్యంలో తాము సమావేశం జరపలేమంటూ ఏపీ చేతులెత్తేయడంతో వేదికను హైదరాబాద్‌‌‌‌కు మార్చారు. సమావేశం కోసం ఏపీ జలవనరుల శాఖ, రాష్ట్ర ఇరిగేషన్‌‌‌‌ అధికారులు బుధవారం జలసౌధకు వచ్చారు. కానీ ఏపీ స్పెషల్‌‌‌‌ సీఎస్‌‌‌‌ రాకపోవడంతో మీటింగ్‌ను మరోసారి వాయిదా వేశారు.

Latest Updates