గోల్డ్‌‌ లోన్లకు మస్తు గిరాకీ

  • ఎన్‌‌బీఎఫ్‌‌సీల్లో ఇబ్బందులే కారణం
  • ధరల పెరుగుదలతో గోల్డ్‌‌ లోన్లకు ఊతం

ఇది వరకైతే అన్ని ప్రయత్నాలు ఫెయిల్​ అయ్యాక ప్రజలు గోల్డ్‌‌లోన్లవైపుకు వచ్చేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారింది. గోల్డ్‌‌లోన్లకు గిరాకీ పెరుగుతోంది.  కస్టమర్ల క్రెడిట్‌‌ ప్రొఫైల్‌‌ మెరుగుపడుతోంది. మా ఖాతాదారుల్లో నాలుగింట మూడొంతుల మంది క్రెడిట్‌‌ స్కోరు 650పైగా నమోదవుతున్నది’’ –స్వామినాథన్‌‌, సీనియర్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ ప్రెసిడెంట్‌‌, కోటక్‌‌ మహీంద్రా బ్యాంక్‌‌

న్యూఢిల్లీ: ఐఎల్‌‌ఎఫ్‌‌ఎస్‌‌ దివాలా తీసిన తరువాత నాన్‌‌ బ్యాంకింగ్‌‌ ఫైనాన్స్‌‌ కంపెనీల (ఎన్‌‌బీఎఫ్‌‌సీ) పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. మార్కెట్‌‌ నుంచి నిధులు తెచ్చుకోవడం కనాకష్టంగా మారింది. బ్యాంకులు, మ్యూచువల్‌‌ ఫండ్లు వీటికి డబ్బులు ఇవ్వడం మానేశాయి. దీంతో ఇవి రిటైల్‌‌ లోన్లను ఇవ్వడం దాదాపు ఆపేశాయి. లిక్విడిటీ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌లో ఆటో, అన్‌‌సెక్యూర్డ్‌‌, ప్రాపర్టీ లోన్లు బాగా పడిపోయాయని ఎన్‌‌బీఎఫ్‌‌సీల నియంత్రణ సంస్థ ‘ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవెలప్‌‌మెంట్‌‌ కౌన్సిల్‌‌’ తెలిపింది. ఎన్‌‌బీఎఫ్‌‌సీలకు లిక్విడిటీ కొరత గోల్డ్‌‌లోన్‌‌ కంపెనీలకు వరంలా మారింది. గత ఏడాది నుంచి ఇవి దాదాపు రెట్టింపు అయ్యాయి. బంగారం ధరలు పెరగడం, ఎన్‌‌బీఎఫ్‌‌సీల క్రెడిట్‌‌ తగ్గిపోవడంతో గోల్డ్‌‌లోన్లకు డిమాండ్‌‌ ఎక్కువయింది. అన్‌‌సెక్యూర్డ్‌‌ లోన్ల కంటే బంగారాన్ని కుదువ పెట్టుకొని అప్పులు ఇవ్వడం మేలని నాన్‌‌ బ్యాంక్‌‌ లెండర్స్‌‌ బావిస్తున్నారు. గోల్డ్‌‌లోన్లను దాదాపు స్వల్పకాలానికే ఇస్తారు. బంగారం మొత్తం విలువ కంటే తక్కువ మొత్తంలోనే అప్పులు ఇస్తారు కాబట్టి రుణాలకు పూర్తి భద్రత ఉంటుంది. అందుకే అన్ని రకాల లెండర్లు వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారని కార్వీ కమోడిటీస్‌‌ అండ్‌‌ కరెన్సీస్‌‌ హెడ్‌‌  రమేశ్‌‌ వరఖేడ్కర్‌‌ అన్నారు. పసిడి ధరలు పెరగడం వల్ల రుణాల పరిశ్రమకు ఎంతో మేలు చేసిందని చెప్పారు. సాధారణంగా బ్యాంకుల్లో, ఎన్‌‌బీఎఫ్‌‌సీల్లో లోన్‌‌ తీసుకుంటే అప్పులో కొంత మొత్తానికి వడ్డీ కలిపి నెలవాయిదాగా చెల్లించాలి. గోల్డ్‌‌లోన్లకు ఇలాంటి ఇబ్బంది లేదు. నెలకు ఓసారి వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది కాబట్టి వీటికే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారని రమేశ్‌‌ అన్నారు.

ప్రగతి పరుగు..

తమ కంపెనీలో మిగతా అన్ని విభాగాల కంటే గోల్డ్‌‌లోన్ల విభాగంలో అత్యధిక వృద్ధి కనిపిస్తోందని ఐఐఎఫ్‌‌ఎల్‌‌ ఫైనాన్స్‌‌ ఉన్నతాధికారి మయాంక్‌‌ శర్మ అన్నారు. బంగారం ధరలు పెరుగుతూనే ఉండటం వల్ల వాటిపై పుట్టే అప్పు మొత్తం పెరుగుతోందని అన్నారు. లిక్విడిటీని పెంచుకోవడానికి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు గోల్డ్‌‌లోన్లు తీసుకుంటున్నారని వివరించారు. ఆర్‌‌బీఐ రూల్స్‌‌ ప్రకారం బంగారం మార్కెట్‌‌ విలువలో 75 శాతం మొత్తానికి గోల్డ్‌‌లోన్‌‌ ఇవ్వాలి. 2014 వరకు ‘లోన్‌‌ టు వాల్యూ’ 60 శాతం ఉండేది. ఎన్‌‌బీఎఫ్‌‌సీల గోల్డ్‌‌లోన్ పోర్ట్‌‌ఫోలియో అతివేగంగా పెరుగుతుందనే భయాల వల్లే దీనిని తగ్గించారు. తదనంతరం లోన్ల సంఖ్య తగ్గడంతో లోన్ టు వాల్యూను 75 శాతానికి పెంచారు. ఎన్‌‌బీఎఫ్‌‌సీలకు లిక్విడిటీ ఇబ్బందులు పెరిగాక గోల్డ్‌‌లోన్లు కూడా ఎక్కువయ్యాయి. అయితే లోన్‌‌ టు వాల్యూ గురించి మాత్రం ఆర్‌‌బీఐ వైపు నుంచి ఏమీ స్పందన కనిపించడం లేదు. లిక్విడిటీ లేకపోవడం వల్ల గత కొన్ని క్వార్టర్ల నుంచి అప్పులు దొరక్క సామాన్యులు ఇబ్బందిపడుతున్నారని ముత్తూట్‌‌ ఫిన్‌‌కార్ప్‌‌ సీఈఓ వాసుదేవన్‌‌ రామస్వామి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్‌‌లోన్లు వారికి అపద్భాంధవులుగా మారాయని చెప్పారు. గత నెల 25న లెక్కల ప్రకారం 10 గ్రాముల బంగారం ధర రూ.35,020. ‘‘గోల్డ్‌‌లోన్లు ఇచ్చే కంపెనీలు పెరిగాయి. అసంఘటితవ్యాపారం సంఘటితంగా మారింది.  అన్ని చోట్లా బంగారం తాకట్టును అంగీకరిస్తుండడంతో గోల్డ్‌‌లోన్ల పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతున్నది’’ అని అన్నారు. ఎన్‌‌బీఎఫ్‌‌సీల లోన్లు తగ్గినప్పటికీ… మనదేశంలోనే రెండు అతిపెద్ద గోల్డ్‌‌ లోన్‌‌ కంపెనీలు మణప్పురం, ముత్తూట్‌‌ల వృద్ధి సాధారణ అంచనాల ప్రకారమే పెరుగుతోంది. బ్యాంకులు కూడా గోల్డ్‌‌లోన్లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. తమ గోల్డ్‌‌లోన్ల విభాగంలో చెప్పుకోదగ్గ ప్రగతి కనిపించిందని కోటక్‌‌ బ్యాంక్‌‌ ఉన్నతాధికారి వి.స్వామినాథన్‌‌ అన్నారు. బంగారాన్ని ఇంట్లో పెట్టుకుంటేనే మంచిదనే నమ్మకం బలహీనపడుతున్నదని అన్నారు

Latest Updates